జిడ్డుకృష్ణమూర్తి గారి కథని బుర్రకథగా రాశాను. రాజశేఖర్ (మా ఆయన) పాట బీట్ కి లేదా ట్యూన్ కి తగినట్లుగా కొంత మార్చాడు పాటలని. కొద్దిగా సంగీతం తెలిసిన వారికి వీటిని పాడటం చాలా ఈజీ. తెలియకపోయినా పాడుతూ బుర్రకథని రక్తి కట్టించవచ్చు.
ఆ పరిపూర్ణ మానవతామూర్తి జిడ్డు కృష్ణమూర్తి గురించి ఈనాటి తరం పిల్లలు అందరికీ తెలియాలి. టీచర్లూ, మీ స్కూల్లో పిల్లల చేత ఈ బుర్రకథని చెప్పించాలని కోరుకుంటున్నాను.
కళాకారులందరికీ ఈ బుర్రకథని షేర్ చేయండి ఫ్రెండ్స్! - మీ రాధ మండువ
********************************************
పరిపూర్ణ మానవతామూర్తి - జిడ్డు కృష్ణమూర్తి
బుర్రకథ – రచన : రాధ మండువ
పాత్రలు :
కథకురాలు - రాధక్క
వంతలు - రమ, రాజు ("తందాన తాన" ఇంకా "సై" అని అంటూ ఉంటారు)
***
రాధక్క : జయము జయము తెలుగుతల్లీ జయము జయమూ నీకమ్మా - తందాన తాన
జయము జయము ఆంధ్రమాతా జయము శుభములనివ్వమ్మా - తందాన తాన
చదువులనిచ్చేటి దయగలతల్లీ - జ్ఞానము నీవమ్మా - తందాన తాన
సంపదలిచ్చేటి శ్రీ మహాలక్ష్మి కరుణజూపవమ్మా తందాన తాన
తరికిట ఝం తరిత .. త.. త.. త..
రమ,రాజు : తందాన తానా దేవనందనా, దేవనందనానా
తందాన తానా దేవనందనా, దేవనందనానా
తరికిట ఝం తరిత .. త.. త.. త..
రాజు : రాధక్కా, ఈరోజు ఏం కథ చెప్పబోతున్నావు?
రమ : మదనపల్లి లో పేరొందిన ఒక బడి ఉంది కదా తమ్ముడూ, ఆ బడి పేరేమిటో తెలుసా?
రాజు : తెలియదు. ఏం పేరు?
రమ : చిత్తూరు జిల్లాకి గౌరవాన్ని తెచ్చిన బడి - రిషీవ్యాలీ బడి.
రాజు : హేమిటీ!? ప్రేమ కార్యాలు జరిపే మదనుడి పేరు పెట్టుకున్న మదనపల్లిలో రుషుల పేరుతో రిషీవ్యాలీ స్కూలా? అదెట్లా కుదురుతుందీ? ఏందక్కా, చెల్లి అనేది?
రాధక్క : మంచి జోక్ తమ్ముడూ. నిజంగానే మన చెల్లి చెప్పింది నిజం. ఆ బడి చిత్తూరు జిల్లాకే గర్వకారణం. భారతదేశం నించే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా విద్యార్థులు వచ్చి ఆ బడిలో చదువుకుంటారు. అదే రిషీవ్యాలీ బడి. దాన్ని ‘World Teacher’ అని పిలవబడే పరిపూర్ణ మానవతామూర్తి జిడ్డు కృష్ణమూర్తి గారు స్థాపించారు.
పుణ్యక్షేత్రమైన తిరుపతి నుండి మదనపల్లి గుండా అనంతపురం వరకు వ్యాపించిన కొండలు, ఆ కొండల మధ్య లోయలు - ఆ లోయల్లో ఒక లోయ రిషీవ్యాలీ లోయ. అక్కడ చింత, కానుగ, మద్ది, తంగేడు, పలవరేణి, ఆకాశమల్లి లాంటి అనేక రకాలైన చెట్లు చిక్కటి ఛాయలను పరచి వాతావరణాన్ని చల్లగా ఉంచుతాయి. అక్కడ గడ్డిపువ్వులు కూడా వివిధ వర్ణాలతో అలరారుతుంటాయి. ఆ ప్రదేశంలో ఉన్న ఓ బ్రహ్మాండమైన మర్రిచెట్టుని చూసిన కృష్ణమూర్తిగారు బడికి అదే అనువైన ప్రదేశం అనుకున్నారు. అక్కడ రిషీవ్యాలీ బడిని స్థాపించారు.
రాజు : నువ్వు చెప్తుంటేనే ఆ ప్రదేశాన్ని చూడాలనిపిస్తోందక్కా. ఆ ప్రేమమూర్తి కథ చెప్తావా వింటాము.
రాధక్క : అలాగే తమ్ముడూ,
బంగరుఛాయల బిడ్డల్లారా - బిడ్డలగన్న తల్లుల్లారా
అయ్యల్లారా అమ్మల్లారా - వింటారా ఈ కథనూ... వింటారా ఈ కథనూ...
రమ, రాజు : ఊఁ ఎందుకు వినం ?
రాధక్క : మీరు కూడా వినండి ప్రజలారా ఆ కరుణామూర్తి కృష్ణమూర్తి గాథ - జిడ్డు కృష్ణమూర్తి గాథ //తందాన తానా//
రాధక్క : దక్షిణభారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లా ఉన్నది. ఆ జిల్లాలో అతి పురాతన శిలారూపాలుగా భావించబడుతున్న రాతికొండల మధ్య ఒదిగి ఉండే ఊరు మదనపల్లి. మదనపల్లిలో కాపురముంటున్న నారాయణయ్య, సంజీవమ్మ దంపతులకు ఎనిమిదవ సంతానంగా జన్మించాడు మన కృష్ణమూర్తి.
రమ : దేవకీ వసుదేవులకి అష్టమసంతానం సాక్షాత్తూ శ్రీ కృష్ణుడు, అందుకేనేమో ఈయనకి కూడా కృష్ణమూర్తి అని పేరు పెట్టుకున్నారు.
రాజు: ఆ కృష్ణుడు భగవద్గీతను బోధించి మనుషులకి మోక్షాన్ని ప్రసాదించాడు. మరి ఈయనో...!?
రాధక్క : ఈయన కూడా అంతటి గొప్పవాడే తమ్ముడూ. మనుషులకుండే అనేక రకాలైన బాధల్నించి, భయాల్నించి - తమ ఆలోచనలతో తామే తయారుచేసుకున్న పంజరాల నించి - వారిని విముక్తులని చేయాలన్నదే లక్ష్యంగా బ్రతికారు.
రాజు : ఎంత గొప్ప విషయం అక్కా! ఇప్పుడు, ఆయన్ని గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది.
రమ : అయితే శ్రద్ధగా విను. వసపిట్టలా ఒకటే ప్రశ్నలు అడుగుతుంటివి. కథ సాగేదెలా?
రాజు : నువ్వే కదా కృష్ణుడు - కృష్ణమూర్తి అని పేర్లు ఎత్తి మధ్యలో అడ్డుపడిందీ? నన్నంటావు అదేమంటే. (బుంగమూతి పెట్టుకుంటాడు. రమ ఏదో చెప్పబోతుంటే రాధక్క అడ్డుపడి) -
రాధక్క : ఊరుకో చెల్లీ! తమ్ముడూ, మీరిట్లా వాదులాడుకుంటుంటే ఎలా? మీరు ఆపితే కథ చెప్పడం మొదలుపెట్టుకుందాం!
(సరే అక్కా అంటూ ఇద్దరూ తలలు ఊపుతారు)
రాధక్క : వినరా సోదరా ఈ పుణ్యమూర్తి, కృష్ణమూర్తి గాథా //తందాన తానా//
మానవ జాతికి మంచిని చెప్పిన తత్త్వవేత్త గాథా //తందాన తానా//
తరికిట ఝం తరిత!
ఆ నారాయణయ్య సంజీవమ్మ దంపతులకు మే 11, 1895 న కృష్ణమూర్తి గారు జన్మించారు. ఆ తర్వాత వాళ్ళకి మరో అబ్బాయి పుట్టాడు. అతని పేరు నిత్యానంద. కృష్ణమూర్తిగారికి పదేళ్ళ వయసు ఉన్నప్పుడు పాపం తల్లి సంజీవమ్మ మరణించింది.
రమ, రాజు : అయ్యో పాపం!
రాధక్క : గొప్పా ఇంటా పుట్టిన బిడ్డా... //ఆఁ...//
అభం శుభం ఎరుగని బిడ్డా... //ఆయ్ ...//
ముందు వెనకా చూడకుండా... //ఆఁ...//
చేతిన ఉన్నది ఇచ్చే బిడ్డా... //ఆయ్ ...//
అలాంటి ఆ బిడ్డకి అంత చిన్న వయసులోనే తల్లి మరణించడం - ఎంత కష్టం తండ్రీ!
రమ, రాజు : అయ్యో, అయ్యొయ్యో! ఎంత కష్టం వచ్చింది తండ్రీ!!
రాధక్క : తండ్రి సంరక్షణలోనే బిడ్డలందరూ పెరిగి పెద్దవాళ్ళవుతున్నారు. తమ్ముడు నిత్యానందని కృష్ణమూర్తి ఎప్పుడూ విడిచి ఉండేవాడు కాడు. ఇద్దరూ కలసిమెలసి ఆడుకునేవారు. ఇలా ఉండగా కొన్నాళ్ళకి తహసిల్దారైన నారాయణయ్య రిటైరై పోయారు.
పిల్లలు చూస్తే చిన్నపిల్లలాయె. బాధ్యతలు తీరలేదయ్యే. అందుకని నారాయణయ్య మద్రాసు లోని థియోసాఫికల్ సొసైటీలో చిరుద్యోగిగా చేరాడు.
రాజు : థియోసాఫికల్ సొసైటీనా? ఏమిటక్కా అది?
రాధక్క : అదొక ఆధ్యాత్మిక సంస్థ నాయనా. ఒకే ఆలోచన కలిగిన వాళ్ళంతా పెట్టుకున్న సంస్థ. దాన్నే దివ్యజ్ఞాన సమాజం అని కూడా పిలుస్తారు. నారాయణయ్య అక్కడ ఉద్యోగంలో చేరినప్పుడు ఆ సంస్థకి అధ్యక్షురాలు అనిబిసెంట్ అనే ఆవిడ. ఆవిడ గురించి కూడా మనం చెప్పుకోవాలి రా తమ్ముడూ...
ఆమె బ్రిటీష్ దేశ వనిత. అయినా కూడా...
భారతదేశం క్షేమం కోరెను // తళాంగు తకథిమి తకిట తకిట తకతా//
తెల్లదొరలకి ఎదురు తిరిగెను //తళాంగు తకథిమి తకిట తకిట తకతా//
తిలక్ గారితో కలిసి నడిచెను //తళాంగు తకథిమి తకిట తకిట తకతా//
హోమ్ రూలును ప్రారంభించెను //తళాంగు తకథిమి తకిట తకిట తకతా//
అంతకంటే ముఖ్యంగా ఈమె గొప్ప తాత్త్వికవేత్త. నిరంతరం యోగసాధన, ధ్యానసాధన చేసుకుంటూ ఉండటమే కాక దేశదేశాల్లో ఉపన్యాసాలు ఇస్తూ ఉండేది. చురుకైన మహిళ. కృష్ణమూర్తిని పెంచిన తల్లి.
రాజు : అవునవును ఈమె నాకు తెలుసు. స్వాతంత్య్రోద్యమంలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా హోమ్ రూల్ ఉద్యమాన్ని చేపట్టిన వనిత అని చదువుకున్నాను. అయితే ఈమేనా కృష్ణమూర్తిగారిని పెంచిందీ!?
రాధక్క : అవును తమ్ముడూ. అందరి కష్టాలూ తీర్చే జగద్గురువు లోకంలోకి రాబోతున్నాడనీ, అతన్ని దివ్యజ్ఞాన సమాజం వెతికి, గుర్తించి, ప్రపంచానికి పరిచయం చేయాలని అనిబిసెంట్ నమ్మింది. ఈ సంస్థలోనే మరో ప్రముఖవ్యక్తి లెడ్ బీటర్ అనే అతను. ఇతను చాలా అద్భుత శక్తులు కలవాడు అని అందరూ అనుకునేవారు. అనిబిసెంట్ తో పాటు లెడ్ బీటర్ ఇంకా ఇతర సభ్యులు - అందరూ కూడా రాబోయే జగద్గురువు కోసం చూస్తున్న తరుణం అది.
ఆ సమయంలో లెడ్ బీటర్ - చూశాడండీ కృష్ణమూర్తిని. ఆ బంగారు తండ్రి ని చూడగానే ఎలా అనిపించదయ్యా లెడ్ బీటర్ గారికి -
విశాలమైనా ఫాలభాగము // థిమికిట థిమికిట థిమికిట థా //
అనంతమైన నిర్మలత్వమూ // కిటథిమి కిటథిమి కిటథిమి థా //
సున్నితమైన శరీర తత్త్వం // థిమికిట థిమికిట థిమికిట థా //
లోక మనోహర చిద్వీ లాసం // కిటథిమి కిటథిమి కిటథిమి థా //
రాజు : అయితే చూడ్డానికి ముద్దుగా, మురిపెంగా ఉన్నాడంటావ్...అంతేనా
రాధక్క : అంతేనా అంటే అంతే కాదు... అసలు విషయం వినండి మరి...
వెలుగులీనుతున్న కాంతి // సై //
వేరే లోకపు భ్రాంతి // సై //
మెరిసిపోతున్నా తేజస్సూ కల్మషం లేని ఓజస్సూ
// తరికిట ఝం తరిత//
బీచ్ లో తమ్ముడు నిత్యానందతో కలిసి ఆడుకుంటున్న కృష్ణమూర్తిని చూశాడు లెడ్ బీటర్. చూడగానే ఈ బాలుడు సామాన్యుడు కాదని అనుకున్నాడు. ఇతడే లోకానికి వచ్చిన జగద్గురువు అని నిర్ణయం చేసేశాడు. సభ్యులందరికీ ఈ బాలుని చూపించి విషయం చెప్పాడు.
రాజు : తర్వాతేం జరిగిందక్కా?
రాధక్క : ఎంతో కాలంగా ఎదురు చూసి చూసి ఇప్పటికి దొరికిన ఈ ప్రపంచగురువుని అనిబిసెంట్ తల్లిలా ఆదరించింది. ఆధ్యాత్మిక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకుని, నారాయణయ్య గారి అనుమతితో కృష్ణమూర్తిని, నిత్యానందని దత్తత తీసుకుంది.
జగద్గురువు అవబోతున్న కృష్ణమూర్తి లోకానికి తన బోధలని వినిపించాలంటే అతను శక్తివంతమైన, అపురూపమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలని అనిబిసెంట్ అనుకుంది.
రాజు : ఆధ్యాత్మిక శిక్షణ అంటే ఏమిటక్కా
రాధక్క : పూర్వం లోకంలో ఉండే యోగుల గురించీ, వారి జీవన విధానాల గురించీ, ధ్యాన యోగ సాధనల గురించి - ఇలా ఎన్నో తాత్త్విక విషయాల గురించి తెలియచెప్పడం తమ్ముడూ.
శిక్షణ మొదలైంది. ఈలోపు, జగద్గురువు తన కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రత్యేక సంస్థని, ఆయన బోధనలని ప్రజలు వసతిగా కూర్చుని వినడానికి గాను అనేక నగరాల్లో సభాప్రాంగణాలను నిర్మించాలని అనిబిసెంట్ నిర్ణయించుకుంది. 'ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ది ఈస్ట్' అనే పేరుతో ఒక సంస్థని స్థాపించింది.
రమ : ముందు చూపున్న స్త్రీ. ఎంత చురుకైన మనిషి!? మదనపల్లిలో ఆమె నిర్మించినదే కదక్కా బెసెంట్ కాలేజీ?
రాధక్క : అవును చెల్లీ. 'ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ది ఈస్ట్' సంస్థకి వేల రూపాయల విరాళాలు సేకరించింది. కృష్ణమూర్తిగారిని ఆ సంస్థకి అధిపతిని చేసింది.
రాజు : ఆహా, ఏమదృష్టం! వంద సంవత్సరాలకి ముందే వేల రూపాయలంటే, ఈ నాడు కోట్ల లెక్కన్నమాట!!
రమ, రాజు : వినరా సోదరా ఈ పుణ్యమూర్తి, కృష్ణమూర్తి గాథా //తందాన తానా//
మానవ జాతికి మంచిని చెప్పిన తత్త్వవేత్త గాథా //తందాన తానా//
తరికిట ఝం తరిత!
రాధక్క : ఇక మద్రాస్ లో థియోసాఫికల్ సొసైటీలో కృష్ణమూర్తి -
శిక్షణాపూర్తి చేసెరా //సై//
జ్ఞానమూర్తీ ఆయెరా //సై//
ప్రగతి మార్గము పట్టెరా //సై//
మార్గదర్శిగా మారెరా //సై//
రాజు : తర్వాతేమైందో తెలిసిపోయిందిగా అక్కా. ప్రపంచానికి గొప్ప గురువు అయ్యాడు. మదనపల్లిలో రిషీవ్యాలీ బడి స్థాపించాడు. అంతేగా.
రాధక్క : (నవ్వి) అయ్యాడు తమ్ముడూ. అయితే దివ్యజ్ఞాన సమాజం అనుకున్నట్లుగా కాదు. ఆ సమాజాన్ని, సంస్థలనీ, ఆ వ్యక్తులనీ కాదని, తను అధిపతి గా ఉన్న సంస్థ 'ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ది ఈస్ట్' ని రద్దు చేసేసి కట్టుబట్టలతో బయటకి వచ్చేశారు.
రాజు : ఆఁ ... (ఆశ్చర్యపోతాడు)
రాధక్క : అవును. జగద్గురువు అంటే మంత్రతంత్రాలు తెలిసి ఉంటాయనీ తద్వారా ఆ అదృశ్యశక్తులు, అద్భుత శక్తులు ప్రదర్శించి తన భక్తులకు ముక్తి, మోక్షం ప్రసాదిస్తాడనీ దివ్యజ్ఞాన సమాజం నమ్ముతుంది. ఈ ధోరణి, భావజాలం కృష్ణమూర్తికి నచ్చలేదు.
ఆయన ధ్యానసాధనలో ఒక్కో మెట్టూ ఎక్కుతున్నకొద్దీ ఈ సంస్థ వారి తీరు, విధానాలు నచ్చక విపరీతంగా బాధపడేవారు. సరిగ్గా ఆ సమయంలోనే ఆయనకి ధ్యానంలో అనేక దివ్య అనుభూతులు కలిగాయి. ఓర్చుకోలేనంతగా శారీరక బాధలు కూడా కలిగాయి. అతని లోలోపల మానసిక క్షేత్రంలో తీవ్రమైన మార్పులు కలిగాయి.
రమ : ఎంత అదృష్టం అక్కా! పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఆ అనుభవాలు కలుగుతాయి అంటారు.
రాజు : అయ్యో పాపం. శారీరక బాధలు కూడానా? అప్పుడేమైందో త్వరగా చెప్పక్కా.
రాధక్క : ఈ మానసిక స్థితిలో ఉన్నప్పుడే తనకి ఎంతో ఇష్టుడైన తమ్ముడు నిత్యానందకి జబ్బుచేసి మరణించాడు.
రాజు : అయ్యో, రామా, అయ్యొయ్యో!! // తందాన తానా //
ఏమిటీ కష్టాలు తండ్రీ!! // తందాన తానా//
రాధక్క : ఇక అప్పుడు -
గురువులు, మంత్రాలు, పూజలు నిన్ను
రక్షించాలేవూ //తందా...నా దేవనందనాన//
సంస్థలు, ఆస్తులు, హోదాలు, పదవులు
ఎందుకూ కొరగావు //తందా...నా దేవనందనాన//
రమ, రాజు : ఆ ఇంకా....
(వేగంగా)
రాధక్క : మనసులలోన మాయలు జూడు - మారేదానికి గోడలు జూడు
రమ, రాజు : భళా భళా రోయ్ తమ్ముడా మేలు భళారోయ్ తందానా
రాధక్క : గురువుల లోనా మోసము జూడు - మాటచేతలకు తేడా జూడు
రమ, రాజు : భళా భళా రోయ్ తమ్ముడా మేలు భళారోయ్ తందానా
అందరూ : వినరా సోదరా ఈ పుణ్యమూర్తి, కృష్ణమూర్తి గాథా //తందాన తానా//
మానవ జాతికి మంచిని చెప్పిన తత్త్వవేత్త గాథా //తందాన తానా//
తరికిట ఝం తరిత!
రాధక్క : ఇంకా ఏం చెప్పాడయ్యా అంటే - 'ఎవరికి వారు తమంతట తాము సత్యాన్ని కనుగొంటేనే విముక్తి లభిస్తుంది. అప్పుడే ఈ దేశాల విభజనలూ, జాతి విభజనలూ మాయమవుతాయి' అన్నారు.
స్వతంత్రంగా నీలాకాశంలో పక్షిలా ఆనందంగా జీవించాలంటే గురువులు, శక్తులు, మహత్తులు, సంస్థలు మీద ఆధారపడకుండా ఎవరికి వారు స్వీయజ్ఞానాన్ని పొందితేనే సాధ్యమవుతుంది అని గ్రహించారు.
(నిదానంగా) ఆహాహా....
మనసుని నమ్మీ చేసే సాధన
మార్గము చూపదూ //తందాన తానా//
మనసు మాయమై మర్మము ఎరిగితె
ముక్తి కలుగు నీకు //తందాన తానా//
తలపుల వల్లే కాలభావనలు
ఏర్పడుతున్నాయీ //తందాన తానా//
రమ, రాజు : తరికిట ఝం తరితా
రమ : అది కదా నిజమైన మోక్ష మార్గం!
రాధక్క : అవును చెల్లీ. ఇక అయన వెంటనే తన అభిప్రాయాన్ని సభ్యులందరికీ తెలియచేశారు. ఎవరికీ ఆయన ధోరణి నచ్చలేదు. అతన్ని వ్యతిరేకించారు. అయినా సరే తను నమ్మినది ఆచరణలో పెట్టడానికే నిర్ణయించుకున్న ఆయన తన ఆధిపత్యం లో ఉన్న సంస్థ - 'ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ది ఈస్ట్' ని రద్దు చేసేశారు. ఆ సందర్భంగా ఆయన ఇచ్చిన ఉపన్యాసం చాలా గొప్పది. తర్వాత చదువుకోండి చెల్లీ, తమ్ముడూ.
రమ, రాజు : వినరా సోదరా ఈ పుణ్యమూర్తి, కృష్ణమూర్తి గాథా తందాన తానా
మానవ జాతికి మంచిని చెప్పిన తత్త్వవేత్త గాథా తందాన తానా
తరికిట ఝం తరిత!
రాజు : అలాగే అక్కా. అనిబిసెంట్ గారు కూడా ఆయన్ని వ్యతిరేకించారా?
రాధక్క : మంచి ప్రశ్న తమ్ముడూ... మొదట వ్యతిరేకించినా తర్వాత ఆయన మాటల్లో నిజాన్ని గ్రహించి ఆయన్ని ఎంతో గౌరవించింది.
"నిజమైన విద్య అంటే ఎవరి గురించి వారు తెలుసుకోవడం తద్వారా జీవితాన్ని గురించి అర్థం చేసుకోవడం. అప్పుడే విద్యార్థులు సమగ్ర వికాసం చెంది పరిపూర్ణ వ్యక్తులుగా ఎదుగుతారు" అని అనుకున్న ఆయన ప్రపంచ వ్యాప్తంగా పాఠశాలలను స్థాపించారు.
వాటిని ప్రకృతి ఒడిలో విశాలమైన స్థలాలలో నెలకొల్పి, విద్యార్థులు భయరహిత వాతావరణం లో
పెరుగుతూ స్వీయజ్ఙానంతో ఎదగాలని కోరుకున్నారు.
రమ, రాజు : వినరా సోదరా వీర కుమారా కృష్ణమూర్తి గాథా
తందాన తాన
రాధక్క : మానవులంతా ఒక్కటేననీ //తందాన తానా//
జాతీమతాలూ వద్దు పొమ్మనీ //తందాన తానా//
సత్యం కోసం అన్వేషిస్తే //తందాన తానా//
ఎవరికి వారికె దొరుకుతుందనీ //తందాన తానా//
కాలమనేదే లేదు పొమ్మనీ //తందాన తానా//
ఉన్నదున్నట్టే చూడాలనీ //తందాన తానా//
దేశదేశాల ఖండాంతరాల మానవులందరి క్షేమం కోసం
హితవు పలికాడు, వెలుగై నిలిచాడు - తరికట ఝం తరిత
ఈ విధంగా తన ఆఖరి శ్వాస విడిచేవరకూ దేశ దేశాలు తిరిగి ఈ విషయాలని గురించి పదే పదే నొక్కి చెప్తూ అనేక ఉపన్యాసాలు ఇచ్చారు.
రమ, రాజు : వినరా సోదరా ఈ పుణ్యమూర్తి, కృష్ణమూర్తి గాథా తందాన తానా
మానవ జాతికి మంచిని చెప్పిన తత్త్వవేత్త గాథా తందాన తానా తరికిట ఝం తరిత!
రాజు : ఇంతకంటే మంచి పని ఇంకేం ఉంటుంది అక్కా? నేటి విద్యార్థులే రేపటి మంచి పౌరులు అవుతారు కదా!? అక్కా, ఆయన ఎప్పుడు మరణించారు?
రాధక్క : జిడ్డు కృష్ణమూర్తి ఫిబ్రవరి 17, 1986 న అమెరికాలో లో మరణించారు. తను జీవించినంత కాలం ఆయన మిత్రులూ, అభిమానులూ ఆయన బాగోగులు చూసుకున్నారు.
కోటానుకోట్ల విలువ చేసే ఆస్తిపాస్తులని, వేల మంది అనుయాయులని త్యజించి 'సత్యానికి ఇది మార్గం కాదు' అంటూ ఒంటరిగా నిలబడిన అతన్ని చూసి అనేకమంది ఆశ్చర్యపోయారు. అయితేనేం ఆయన ఇప్పుడు నిజమైన "ప్రపంచ గురువు - The World Teacher”.
ప్రకృతిని ముఖ్యంగా మానవ నైజాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వారికున్న అన్ని బాధలనించీ విముక్తి కలిగించాలని తపన పడిన ఏకైక వ్యక్తి. ఆధునిక యుగపు తత్త్వవేత్త. జీవన్ముక్తుడు. ధార్మిక జీవనానికి మార్గదర్శి, పరిపూర్ణ మానవతామూర్తి జిడ్డు కృష్ణమూర్తి.
అందరు : మంగళంబగు నిత్యంబు మంగళంబగు
ఆదర్శమూర్తి కృష్ణమూర్తికి మంగళంబగు
మంగళం జయ మంగళం - తరికిట తరికిట ఝం తరిత
మంగళం జయ మంగళం - మంగళం జయ మంగళం
***