న భూతో న భ భవిష్యతి....... 'కవిరాజు' త్రిపురనేని రామస్వామి చౌదరి
వీరగంధము....
వీరగంధముఁ దెచ్చినారము
వీరుఁ డెవ్వఁడొ తెల్పుఁడీ!
పూసి పోదుము, మెడను వైతుము
పూలదండలు భక్తితో!!
తెలుఁగు బావుట కన్ను చెదరఁగ
కొండవీఁటను నెగిరినప్పుడు
తెలుఁగువారల కత్తిదెబ్బలు
గండికోటను కాచినప్పుడు
తెలుఁగువారల వేఁడినెత్తురు
తుంగభద్రను గలసినప్పుడు
దూరమందున నున్న సహ్యజ
కత్తినెత్తురు కడిగినప్పుడు
ఇట్టి సందియ మెన్నఁడేనియుఁ
బుట్టలేదు రవంతయున్!
ఇట్టి ప్రశ్నల నడుగువారలు
లేకపోయిరి సుంతయున్.
నడుముగట్టిన తెలుఁగుబాలుఁడు
వెనుక తిరుగం డెన్నఁడున్,
బాసయిచ్చిన తెలుఁగుబాలుఁడు
పాఱిపోవం డెన్నఁడున్.
ఇదిగొ! యున్నది వీరగంధము
మై నలందుము మైనలందుము;
శాంతిపర్వముఁ జదువవచ్చును
శాంతిసమరం బైనపిమ్మట.
తెలుఁగునాఁటిని వీరమాతను
జేసిమాత్రము తిరిగి రమ్మిఁక,
పలుతుపాకులు పలు ఫిరంగులు
దారి కడ్డము రాకతప్పవు
వీరగంధముఁ దెచ్చినారము
వీరుఁ డెవ్వఁడొ తెల్పుఁడీ!
పూసిపోదుము, మెడను వైతుము
పూలదండలు భక్తితో!!
(ఏవీ నాటి ఆ సౌరభాలు ?)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి