3, ఫిబ్రవరి 2021, బుధవారం

కవి జాషువా"తల్లి"

అమ్మంటే.. ఎందరికో బాగా ఇష్టం..

దిగ్గజంలాంటి కవి జాషువా"తల్లి" అంటే..ఎంతగానో తల్లడిల్లిపోయేవాడు. తల్లంటే అల్లల్లాడే వాళ్ళు లోకంలో చాలమంది ఉన్నారు. అందుకే ఆయన కవిత "కన్నతల్లి" లో ఇలా కన్నీళ్లెట్టుకున్నాడు.  సహనంతో మొత్తం చదవండి!!

ఇల్లున్ వాకిలి లేనిదానివలె నేడీ శాకినీ ఢాకినుల్ 
బిల్లలసేయు శ్మశాన భూములను బ్రాపింపగనేలా!జగం 
బెల్లన్ జీకటి ముద్దయై పొడమె తల్లీ! నీవియోగంబునన్
జిల్లులు వడ్దది మానసంబుబికి వచ్చెన్ వేదనానీరధుల్.

కొడుకులను మమ్ము నిర్వాహకులను జేసి 
మురిసికొని చంద్రశిలలీల గరగినావు 
పుణ్యముల తల్లి నీ పాలపుష్టి కతన 
కవన బాలిక నాజిహ్వ నవతరించె.

తరుగింతేనియు లేని నీమహిత పుత్రప్రేమ యేతల్లికిన్ 
బురమాయించి త్యజించి పోయితివి మమ్మున్ నీ శరీరంబుతో 
మరణాంతంబున జన్మమే కలిగినన్ మా తల్లి! నీకడ్పునన్ 
మరలన్ బుట్టెద వేయిజన్మములకున్ దమ్ముండు వెంటాడగన్.

నిరుడీనాటికి గల్గు నీ మహిత సాన్నిధ్యంబు నే డక్కటా! 
మరుగై నీవు పరుండు మంచమొకటే మాకిందు బ్రత్యక్షమై 
పురిగొల్పున్ బరితాపవహ్ని ననయంబున్ గర్భదేశంబునన్ 
దిరిపెంబెత్తిన జూపువారెవరు? ధాత్రిన్ నీ శుభాకారమున్.

ఎనుబదేడుల వయసున దర్పితంబైన 
నీ పెద్ద తలకు మాణిక్య పూజ
జీవితేశుడు మన్నుజేయు నీ దివ్య మం 
గళ సూత్రమునకు నిక్కంపు వినతి

అమ్మల కాదర్శమై ఱాలుగరచు నీ 
మాతృత్వమునకు నమశ్శతంబు 
బలగంపు పూల పూజల దెల్ల వారిన 
నీ దీర్ఘ నిద్రకు నీలి గొడుగు..

నిన్ను దమిమీఱ ఱొమ్మున నిలుపుకొన్న
నీ సమాధికి వేడి కన్నీటి పూత 
కొడుకుల సుఖంబునకు మేను కొల్లబెట్టు 
జీర్ణమూర్తికి నెత్తురు చిలుకరింపు.

నిత్య విశ్రాంతినానందనిలయ మంచు 
దిరుగుచున్నావు గాబోలు దిగులు లేక 
సర్వ సంసార బాధా విష జ్వరమున 
కౌషధంబైన మరణంబు నభినుతింతు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి