18, మార్చి 2017, శనివారం

చెయ్యెత్తి జే కొట్టు...శ్రీకృష్ణ

చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా!
గతమెంతో ఘనకీర్తి కలవోడా!
                           
సాటిలేని జాతి-ఓటమెరుగని కోట
నివురుగప్పి నేడు-నిదురపోతుండాది
జైకొట్టి మేల్కొలుపు తెలుగోడా!
గతమెంతో ఘనకీర్తి కలవోడా!!||చెయ్యెత్తి||

వీర రక్తపుధార-వారబోసిన సీమ
పలనాడు నీదెరా-వెలనాడు నీదెరా
బాలచంద్రుడు చూడ ఎవడోయి!
తాండ్రపాపయ్య కూడనీవోడూ||చెయ్యెత్తి||

కాకతీయ రుద్రమ, మల్లమాంబా, మొల్ల
మగువ మాంచాల నీతోడ బుట్టినవాళ్ళే
వీరవనితల గన్న తల్లేరా!
ధీరమాతల జన్మ భూమేరా! ||చెయ్యెత్తి||

నాగార్జునుడి కొండ,అమరావతీస్థూపం
భావాల పుట్టలో-జీవకళ పొదిగావు
అల్పుడను కావంచు తెల్పావు నీవు
శిల్పినని చాటావు దేశదేశాలలో! ||చెయ్యెత్తి||

దేశమంతే వట్టి మట్టి కాదన్నాడు
మనుషులన్నమాట మరువబోకన్నాడు
అమరకవి గురజాడ నీవాడురా
ప్రజలకవితను చాటిచూపాడురా! ||చెయ్యెత్తి||

రాయలేలిన సీమ-రతనాల సీమరా
దాయగట్టె పరులు-దారి తీస్తుండారు
నోరెత్తి యడగరా దానోడా
వారసుడ నీవెరా తెలుగోడా! ||చెయ్యెత్తి||

కల్లోల గౌతమీ-వెల్లువల కృష్ణమ్మ
తుంగభద్రాతల్లి-పొంగిపొరలిన చాలు
ధాన్యరాశులే పండు దేశానా!
కూడుగుడ్డకు కొదవలేదన్నా!||చెయ్యెత్తి||

ముక్కోటి బలగమోయ్-ఒక్కటిగ మనముంటే
ఇరుగుపొరుగులోన -వూరు పేరుంటాది
తల్లి ఒక్కతే నీకు తెలుగోడా!
సవతిబిడ్డల పోరు మనకేలా! ||చెయ్యెత్తి||

పెనుగాలి వీచింది-అణగారి పోయింది
నట్టనడి సంద్రాన-నావ నిలుచుండాది
చుక్కాని బట్టరా తెలుగోడా!
నావ దరిచేర్చరా మొనగాడా!!
!! చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి