12, మార్చి 2018, సోమవారం

అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా ***************************************** అర్ధ శతాబ్దపు అనే ఈ పాట 1997లో విడుదలైన 'సింధూరం' చిత్రంలోని సుప్రసిద్ధమైన పాట. ఈ పాట రాసినందుకు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి రాష్ట్రస్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి వచ్చింది. ఈ పాటను గానంచేసింది ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఈ ‘సింధూరం’ సినిమాకి సంగీత దర్శకత్వం వహించింది ‘శ్రీ’ గా మనకి సుపరిచితులైన శ్రీనివాస చక్రవర్తి గారు. పాట నేపథ్యం ************* భారత మాత 1947 ఆగస్టు పదిహేను అర్ధరాత్రి దాస్య శృంఖలాల నుండి విముక్తురాలు అయ్యింది. ప్రజలంతా సంబర పడ్డారు. అయితే స్వరాజ్యం రావడంతో మన కర్తవ్యం పూర్తి కాలేదు, అసలు ప్రగతి అంతా ముందుంది అని, "స్వాతంత్ర్యం వచ్చెననీ సభలేచేసి సంబరపడగానే సరిపోదోయి, సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరపాటోయి" అని అలనాడు తన పెన్నుతో మన వెన్ను తట్టి హెచ్చరించారు మహాకవి శ్రీశ్రీ.తరువాత స్వాతంత్ర్యం వచ్చిన అయిదు పదులకు దేశ రాజకీయ వాతావరణంలో చాల మార్పులు వచ్చాయి.కాని సగటు మనిషి జీవితంలో మార్పు రాలేదు. ఇంతలో నక్సలిజం రాజుకుంది. ఆ నేపథ్యంలో విడుదలయిన చిత్రం "సింధూరం". 'కృష్ణ వంశీ' దర్శకత్వంలో విడుదలయిన ఈ చిత్రం రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డ్ ను, మరియు ఫిలిం ఫేర్ అవార్డును గెలుచుకుంది. ఈచిత్రంలో ఒక మరపురాని గీతం వ్రాసినది శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. వారి కలం, కత్తి కన్నా పదునైనదని నిరూపించిన గీతం ఇది. నిజానికి చిత్ర నిర్మాణం పూర్తయి, ప్రీవ్యూ చూసి బయటకు వచ్చిన తరువాత కలిగిన స్పందనతో అప్పటికప్పుడు శాస్త్రి గారి కలం-గళం నుండి పెల్లుబికిన కవితావేశం ఈ గీతం అని కృష్ణవంశీ గారి మాటలలో తెలిసింది.ప్రస్తుతం మనకు స్వాతంత్ర్యం వచ్చి ఏడు పదులు కావస్తుంది అయినా సగటు రాజకీయ వాతావరణంలో మార్పు ఏ మాత్రంలేదు. కాకపోతే, మార్పుకోసం దశాబ్దానికొక కొత్త అలజడి, ఒక కొత్త ఉన్మాదం, వెరసి ఇదీ మన ప్రగతి గతి. వాస్తవానికొస్తే, ఈ పాట వింటుంటే ఏదో తెలియని బాధ కలుగుతుంది. మనసులో ఆశావాదం నిండి ఉన్నా ఒక్కోసారి నైరాశ్యం ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తుంటుంది. సిరివెన్నెల గారు తన పాటలో పలుకులో ఆ ఆవేదనను సాధారణ పదాలతో చక్కగా, స్పష్టంగా వ్యక్తం చేసారు. పాటలోని పాహిత్యం ****************** పల్లవి: అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా! స్వర్ణోత్సవాలు చేద్దామా! ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా! దానికి సలాము చేద్దామా! శాంతి కపోతపు కుత్తుక తెంచి తెచ్చిన బహుమానం ఈ రక్తపు సింధూరం నీ పాపిటలో భక్తిగ దిద్దిన ప్రజలను చూడమ్మా! ఓ! పవిత్ర భారతమా! అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్చను చూద్దామా! దాన్నేస్వరాజ్యమందామా! చరణం 1: కులాల కోసం గుంపులు కడుతూ, మతాల కోసం మంటలు పెడుతూ ఎక్కడలేని తెగువను చూపి తగువుకి లేస్తారే, జనాలు తలలర్పిస్తారే సమూహక్షేమం పట్టని స్వార్థపు ఇరుకుతనంలో ముడుచుకు పోతూ మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరే, తెలిసి భుజం కలిపి రారే అలాంటి జనాల తరఫున ఎవరో ఎందుకు పోరాడాలి? పోరి, ఏమిటి సాధించాలి? ఎవ్వరికోసం ఎవరు ఎవరితో సాగించే సమరం ఈ చిచ్చుల సిందూరం జవాబు చెప్పే బాధ్యత మరచిన జనాల భారతమా! ఓ అనాథ భారతమా! అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా! స్వర్ణోత్సవాలు చేద్దామా! ఆత్మవినాశపు అరాజకాన్ని స్వరాజ్యమందామా! దానికి సలాము చేద్దామా! చరణం 2: అన్యాయాన్ని సహించని శౌర్యం, దౌర్జన్యాన్ని దహించే ధైర్యం కారడవులలో క్రూర మృగంలా దాక్కుని ఉండాలా! వెలుగుని తప్పుకు తిరగాలా! శత్రువుతో పోరాడే సైన్యం, శాంతిని కాపాడే కర్తవ్యం స్వజాతి వీరులనణచే విధిలో సవాలు చెయ్యాలా! అన్నల చేతిలో చావాలా! తనలో ధైర్యం అడవికి ఇచ్చి, తన ధర్మం చట్టానికి ఇచ్చి ఆ కలహం చూస్తూ సంఘం శిలలా నిలుచుంటే నడిచే శవాల సిగలో తురిమిన నెత్తుటి మందారం, ఈ సంధ్యా సింధూరం వేకువ వైపా, చీకటి లోకా ఎటు నడిపేవమ్మా! గతి తోచని భారతమా! అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా! స్వర్ణోత్సవాలు చేద్దామా! యుద్ధ నినాదపు అరాజకాన్ని స్వరాజ్యమందామా! దాన్ని సవాలు చేద్దామా! చరణం 3: తన తలరాతను తనే రాయగల అవకాశాన్నే వదులుకొని తనలో భీతిని తన అవినీతిని తన ప్రతినిధులుగ ఎన్నుకుని ప్రజాస్వామ్యమని తలిచే జాతిని ప్రశ్నించడమే మానుకొని కళ్ళు వున్న ఈ కబోది జాతిని నడిపిస్తుందట ఆవేశం ఆ హక్కేదో తనకే ఉందని శాసిస్తుందట అధికారం కృష్ణుడు లేని కురుక్షేత్రముగ సాగే ఈ ఘోరం చితి మంటల సిందూరం చూస్తూ ఇంకా నిదురిస్తావా విశాల భారతమా! ఓ విషాద భారతమా అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా ఆత్మవినాశపు అరాజకాన్ని స్వరాజ్యమందామా! దానికి సలాము చేద్దామా! శాంతి కపోతపు కుత్తుక తెంచి తెచ్చిన బహుమానం ఈ రక్తపు సింధూరం నీ పాపిటలో భక్తిగ దిద్దిన ప్రజలను చూడమ్మా! ఓ! పవిత్ర భారతమా! అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్చను చూద్దామా! దాన్నేస్వరాజ్యమందామా! ఈ పాటను ఇక్కడ https://www.youtube.com/watch?v=vWSB07jA8JI వినండి! ***** కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి(శ్రీ) **************************** శ్రీ (సెప్టెంబర్ 13, 1966 - ఏప్రిల్ 18, 2015) ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్. ఇతడు ప్రఖ్యాత సంగీత దర్శకుడైన కె. చక్రవర్తి రెండవ కుమారుడు. శ్రీగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన ఆయన అసలు పేరు కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు లో 1966, సెప్టెంబర్ 13 న శ్రీ జన్మించారు. తమ పక్కింటి అమ్మాయి అరుణను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. కులాలు వేరు కావడంతో వీరి పెళ్ళిని కుటుంబసభ్యులు అంగీకరించలేదు. తర్వాత కొంతకాలానికి శ్రీ చెల్లెలికి ఆరోగ్యం బాగా లేనపుడు భార్య అరుణ చేసిన సేవలు మరియు కుటుంబసభ్యులతో కలసిమెలసి పోవడం చూసి వీరి వివాహాన్ని ఆమోదించారు. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్‌లో ఇంజినీరింగ్ పట్టభద్రుడైన శ్రీ సంగీతంపై మక్కువతో సినిమా రంగంవైపు అడుగులు వేశారు. రెండు దశాబ్దాల క్రితం జెమినీలో ప్రసారమై ప్రాచుర్యం పొందిన అంత్యాక్షరి ధారావాహిక సంగీత కార్యక్రమానికి సింగర్ సునీతతో కలిసి వ్యాఖ్యాతగా ప్రేక్షకులకు చేరువయ్యారు. తొలిసారిగా బాలకృష్ణ నటించిన ‘లారీ డ్రైవర్’ సినిమాకు రీ రికార్డింగ్ చేశాడు. పోలీస్ బ్రదర్స్ ఆయన తొలిచిత్రం. హీరోగా అవకాశాలు చాలామంది ఇస్తానన్నా అవి కాదనుకుని సంగీత దర్శకుడుగానే ఉండిపోయారు. ‘సింధూరం’ సినిమా వర్క్ జరుగుతున్న సమయంలో దర్శకుడు రవిరాజా పినిశెట్టి రుక్మిణి సినిమాలో హీరోగా చేయమని అడిగారు. ‘‘మ్యూజిక్ అయితే చేస్తాను, యాక్టింగ్ నా వల్ల కాదు’’ అని శ్రీ చెప్పారు. దాంతో వినీత్ నీ హీరోగా తీసుకొని ఆ సినిమా తీశారు. కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడి ఆయన ఏప్రిల్ 18, 2015 న హైదరాబాదు కొండాపూర్‌లోని స్వగృహంలో కన్నుమూశారు. (సేకరణ) టీవీయస్.శాస్త్రి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి