28, జూన్ 2020, ఆదివారం
ఈ మధ్య ఊరెళ్ళి వచ్చాను.ఆకు పచ్చని పొలాలన్నీ చేపల చెరువులయిపోయాయి.మంచి నీళ్ళ చెరువేమో మురుగు కాలవయిపోయింది.రైతులందరూ కూలీలయ్యారు.కూలీలందరూ మహా నగరానికి వలస వెళ్ళి పోయారు.చదువుకున్న వాళ్ళందరూ ఇంజినీర్లయిపోయారు.చదువు లేని వాళ్ళు అప్పు చేసి ఖతరో, కువైటో వెళ్ళి, నానా కష్టాలూ పడి చేసిన అప్పు తీర్చిఇంక పడలేక ఉత్త చేతుల్తో మళ్ళీ ఊరొచ్చేశారు.కప్పల బెక బెక లూ, గాలి వాటమూ కనిపెట్టి, వాన రాకడ అంచనా వెయ్య గలిగిన రామయ్య తాతకి పక్ష వాతమొచ్చి మూలన పడి, ప్రాణం పోకడ కోసం ఎదురు చూస్తున్నాడు.క్యాలండర్ చూడకపోయినా తిధులు, అమావాస్యలు, పౌర్ణమిలు, పండుగలుచెప్పేసే సూరమ్మామ చచ్చి పోయిందని తెలిసింది.రోజూ ఇంత అన్నం పెడితే చాలు విఠలాచార్యకి కూడా తెలియని కధలన్నీ ఏడు రాత్రులు ఏడు పగళ్ళూ గుక్క తిప్పు కోకుండా చెప్పగలిగిన పళ్ళ వీరన్న కూడా పైకెళ్ళిపోయాడు.రేపో మాపో అన్నట్టు ఉన్న చాకలి ముసలి మామ్మవీధిలో కనిపించి "నువ్వు పుట్టినప్పుడు ఆరునెలలు వచ్చేవరకూ నేనే నీకు ఒళ్ళు తోమి స్నానం చేయించేదాన్న"ని గుర్తు చేసి మురిసిపోయి,"ఓ యాభై రూపాయలుంటే ఇవ్వు బాబా నాలుగు లంక పొగాకు చుట్టపీకలు కొనుక్కుంటా" అని అడిగింది. జేబులో వంద ఉంటే తీసి ఇచ్చేశాను.ముందు దండం పెట్టి తర్వాత ముద్దు పెట్టుకుంది.మనిషి దగ్గర చుట్ట కంపు వస్తుంది కానీ మనసు మాత్రంపుట్టినప్పుడు ఎంత స్వచ్చంగా వుందో ఇప్పుడూ అలాగే ఉన్నట్టనిపించింది.నారాయుడు తాత అయితే ఆధార్ కార్డు, తెల్ల కార్డు బయటికి తీసుకొచ్చి చూపించి,"ఇదుంటే చాలు రా మనవడా, నెలకి రెండొందల పింఛను, రూపాయికే కిలో బియ్యంవస్తాయి" అని ప్రపంచం లో ఏ సమస్యకయినా బ్రహ్మాస్త్రం తన దగ్గరే ఉన్నంత ధీమా గా చెప్పాడు.ఎంత అల్ప సంతోషులు? ఒక బిల్ గేట్స్ గురించి తెలీదు. ఒక ఒబామా గురించి తెలీదు.యోగా, ధ్యానం, ఐ-ఫోన్, అబధ్ధం ఇవేమీ తెలీదు.ఇప్పటి వరకూ మనం గ్రైండర్ లు వచ్చాక రుబ్బు రోళ్ళు, పురుగు మందులొచ్చాక పిచ్చుకలు,జనారణ్యాలు వచ్చాక పులులే అంతమయిపోతున్నాయనుకున్నాంకానీ, ఇలాంటి మనుషులు కూడా ముందు ముందు మనం చూద్దామన్నా కనిపించక పోవచ్చు.వీళ్ళతోపాటే కొన్ని కధలు, మాటలు, పాటలు, కొన్ని భావోద్వేగాలు అంతమైపోతాయి.మనమే తప్పుగా అర్ధం చేసుకున్నాం.మాయన్ లు చెప్పింది యుగాంతం గురించి కాదనుకుంట.ఇలాంటి "మనుషుల" యుగం అంతం గురించే అనుకుంట.మే నెల, 2013
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి