27, అక్టోబర్ 2016, గురువారం

ఈ దుర్యోధన దుశ్శాసన
దుర్వినీతలోకంలో
రక్తాశ్రులు చిందిస్తూ
రాస్తున్నా శోకంతో
మరో మహాభారతం ఆరవవేదం
మానభంగపర్వంలో
మాతృహృదయ నిర్వేదం నిర్వేదం

పుడుతూనే పాలకేడ్చి
పుట్టి జంపాలకేడ్చి
పెరిగి పెద్దకాగానే
ముద్దుమురిపాలకేడ్చి
తనువంతా దోచుకున్న
తనయులు మీరు
మగసిరితో బ్రతకలేక కీచకులై
కుటిలకామ నీచకులై
స్త్రీ జాతిని అవమానిస్తే
మీ అమ్మల స్తన్యంతో
మీ అక్కల రక్తంతో
రంగరించి రాస్తున్నా
ఈనాడే మీకోసం ॥మరో॥

కన్న మహాపాపానికి
ఆడది తల్లిగ మారి
మీ కండలు పెంచినది
ఈ గుండెలతో కాదా
ఎర్రని తన రక్తాన్నే తెల్లని నెత్తురుజేసి
పెంచుకున్న తల్లి
ఒక ఆడదని మరిచారా
కనబడలేదా అక్కడ
పాపలుగా మీ చరిత్ర
ఏనాడో మీరుంచిన లేతపెదవి ముద్ర
ప్రతిభారత సతిమానం
చంద్రమతి మాంగల్యం
మర్మస్థానం కాదది మీ జన్మస్థానం
మానవతకి మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం
శిశువులుగా మీరు పుట్టి
పశువులుగా మారితే
మానవరూపంలోనే దానవులై పెరిగితే
సభ్యతకి సంస్కృతికి సమాధులే కడితే
కన్నులుండి చూడలేని
ధృతరాష్ట్రుల పాలనలో
భర్తలుండి విధవ అయిన
ద్రౌపది ఆక్రందనలో
నవశక్తులు యువశక్తులు
నిర్వీర్వం అవుతుంటే
ఏమైపోతుంది సభ్యసమాజం
ఏమైపోతుంది మానవధర్మం
ఏమైపోతుంది ఈ భారతదేశం
మన భారతదేశం మన భారతదేశం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి