3, ఆగస్టు 2020, సోమవారం

పుష్ప విలాపాన్ని గుండెల్లో వినిపించిన కరుణశ్రీ 108వ జయంతి ఈరోజు.. ........నే నొక పూలమొక్క కడ నిల్చి చివాలున కొమ్మవంచి గో రానెడు నంతలోన విరు లన్నియు జాలిగ నోళ్ళు విప్పి "మా ప్రాణము తీతువా" యనుచు బావురు మన్నవి; క్రుంగిపోతి; నా మానసమం దెదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై.తల్లి యొడిలోన తలిరాకు తల్ప మందు ఆడుకొను మమ్ములను బుట్టలందు చిదిమి అమ్ముకొందువె మోక్ష విత్తమ్ము కొరకు! హౄదయమే లేని నీ పూజ లెందుకోయి?జడమతుల మేము; జ్ఞానవంతుడవు నీవు; బుధ్ధి యున్నది; భావ సమౄద్ధి గలదు; బండబారె నటోయి నీ గుండెకాయ! శివునకై పూయదే నాల్గు చిన్ని పూలు?....బుద్ధ దేవుని భూమిలో పుట్టినావు సహజ మగు ప్రేమ నీలోన చచ్చెనేమి? అందమును హత్య చేసే హంతకుండ! మైలపడిపోయె నోయి! నీ మనుజ జన్మ.పూజ లేకున్న బాబు నీ పున్నె మాయె! కోయ బోకుము మా పేద కుత్తుకలను అకట! చేసేత మమ్ముల హత్య చేసి బాపుకొన బోవు ఆ మహా భాగ్య మేమి?ఇట్లు పుష్పాలు నన్ను చీవాట్లు పెట్టి నట్లుగాన్ - పూలు కోయ చేయాడలేదు; ఏమి తోచక దేవర కెరుక సేయ వట్టి చేతులతో ఇటు వచ్చినాను

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి