29, ఆగస్టు 2020, శనివారం

*నా తెలుగు* ......శ్రీధూర్జటిఆ.వె౹౹ తీయనైన బాస...తేనెలొలుకు బాస...తేటి మాట మూట... తేట వూట...తరచి... తరచి చదువ తనివితీరదెపుడుతీపి రుచుల మావి తెలుగు బాస...!! ★సీ౹౹నన్నయ తిక్కన యర్రనలుగలసి నుదుట కుంకుమ రూపు నిలిచి మెరిసె శ్రీనాథు కలమున శ్రీలు పొంగిన కవిత ఆభరణమ్ములైనందగించెఆంధ్రభోజుని యింటి అష్టదిగ్గజ కవుల్ అందెల సవ్వడైనలరు దొడగె మొల్లలల్లిన రాత ముచ్చట గాజులై గల గల రవముల గారవించె ఆ.వె౹౹పాల్కురికియు మరియు పినవీరభద్రుడు పట్టుచీర వోలె పరవశించె కవుల మొయిలి గుంపు కావ్యమాగాణిపై తేనెజల్లుబోయ తెలుగు తడిసె ★ సీ౹౹కొమ్మలందున జేరి కోయిల పాటలా అలరించి పాడెనె అన్నమయ్య రామరామయనుచు రాచిలక పలుకై రాజిల్లి మురిసెను రామదాసు వేమన బద్దెన వెంకయ్య గారలు దుక్కి దున్నె తెలుగు ధరణి యందు గురజాడ జాషువా గిడుగు చిన్నయ సూరి సేవ చేసిరిచట ఛేవ తోడ ఆ.వె౹౹వంద వేల సంఖ్య వచ్చిరి కవులౌర...!! కదన తొక్కినారుకవనసీమ మార్పులెన్నొ తెచ్చె మన భాష యందున కాని చిదుప లేదు కొంచమైన....!! ★ఆ.వె౹౹కొత్త రుచులు కోరి కోయిల గీరగా గార్డభంబు వలెను గానరీతి వేష భాష మారి వంకర నడకతో వగచుచున్నదయ్య వనిత తెలుగు ★ తే.గీ౹౹ తిరిగి పొందవలయు పూర్వ తీరు తెన్ను తెలుగు వెలగవలయు నిల్చి తెల్లవార్లు నవ్వ వలయు తెలుగు నాడు నవ్వినట్లు దేశ భాషలం దెపుడును తెలుగులెస్సె....!! ********************అందరికి తెలుగు భాషాదినోత్సవ శుభాకాంక్షలు గిడుగు పంతులుగారికి నమస్సులు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి