20, ఏప్రిల్ 2022, బుధవారం

మన సంస్కృతి...డా:మీగడ

మణులు కానేకావు; మాన్యాలు కావయా
సత్కవి రచనలో సంస్కృతనగా..
బహుళ మేడలుకావు; భవనాలు కావయా..
సత్కర్మ విధులే సంస్కృతి యన..
ధనము కానేకాదు: ధనదాహము కాదు
సత్పురుషుల గోష్టి సంస్కృతి యన..
పదవి కానేకాదు; పలుకుబడులు కావు
సత్కళారూపాలో సంస్కృతి యన..

చెట్లవలె ,మహాన్నత హిమగిరుల వోలె
శాశ్వతంబైనదే ఇల మన సంస్కృతనగా
అట్టి భారత సంస్కృతిని ఆస్తి గాను
పిల్లలకు పంచి పెట్టుడు ఓ పెద్దలారా!
తనయులకు పంచి పెట్టుడు తలిదండ్రులారా!

28, నవంబర్ 2021, ఆదివారం

నార్లవారి మాట

పత్రిక అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఏకైక ఆయుధం. కీర్తన సంఘం కాదు.. ఎడిటర్ ఎలా ఉండాలి? సంపాదకుడు కారాదు.. అంటూ ఎన్నోచెప్పిన నిఖార్సయిన విలేఖకుడు నార్ల వారు.  
ఆయన .. "నవయుగాల బాట, నార్ల మాట" పాత్రికేయులకు నిత్య పారాయణ పంక్తులు..

ప్రతిభతోడ కలము  పట్టగల్గుట కంటె
కోరలేము వేరె గొప్పవరము
కలము అమ్ముకొనుట వెలయాలితనమురా
నవయుగాల బాట...
అన్య భాషపైని అధికారమబ్బదు
అంతుపట్టదేని సొంత భాష
మొదలు నేర్వకున్న తుద నెట్లు నేర్చురా
నవయుగాల....
ఎడిటరైనవాడు బిడియము చూపుచో
ధాటి తగ్గు వృత్తిధర్మమందు 
కడుపుకూటి వ్రాత కక్కుర్తి వ్రాతరా
నవయుగాల..
వర్తమాన జగతి పరివర్తనాలపై 
స్వేచ్ఛతోడ వ్యాఖ్య సేయనట్టి
ఎడిటరెందుకోయి ఏటిలో గలపనా
నవయుగాల...
నీతి నియతి లేని నీచుని చేతిలో 
పత్రి కుండెనేని ప్రజలకు చేటు
హంత చేతి కత్తి గొంతులు కోయదా
నవయుగాల...
పత్రికే నియంత పక్కలో బల్లెమ్ము
పత్రికే ప్రజాళి పట్టుగొమ్మ
ప్రభుత వక్రమౌను పత్రిక లేనిచో
నవయుగాల...
పత్రి కొక్కటైన ప్రతీహారిగా నిల్వ
అవని నిద్రపోవు ఆద మఱచి
పత్రిక నిదురింప భద్రత తొలగురా
నవయుగాల... 
పత్రి కొక్కటున్న పదివేల సైన్యము
పత్రి కొక్కటున్న మిత్రకోటి
ప్రజకు రక్ష లేదు పత్రిక లేనిచో
నవయుగాల....
నిజము కప్పిపుచ్చి, నీతిని విడనాది
స్వామిసేవ  చేయు జర్నలిస్టు
తార్చువానికంటె తక్కువ వాడురా
నవయుగాల...
ఎడిటరైన వాడు ఏమైనవ్రాయును
ముల్లె యొకటె తనకు ముఖ్యమైన
పడపు వృత్తిలోన పట్టింపులుండునా
నవయుగాల...
పత్రికా రచననుపడపువృత్తిగ మార్చు
వెధవకంటె పచ్చి వేశ్య మేలు
తనువునమ్ము వేశ్య, మనసును కాదురా
నవయుగాల... 

🙏🙏🙏

9, మే 2021, ఆదివారం

చిత్రం: పాండురంగ మహత్యంగానం: ఘంటసాలసంగీతం: టీవీ రాజుసాహిత్యం: సముద్రాల రాఘవాచార్యఅమ్మా నాన్నాఅమ్మా అని అరచినా ఆలకించవేమమ్మాఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదాపది నెలలు నను మోసి పాలిచ్చి పెంచీమది రోయక నాకెన్నో ఊడిగాలు జేసినఓ తల్లీ నిను నలుగురిలో నగుబాటు జేసితితలపకమ్మ తనయుని తప్పులు క్షమియించవమ్మ అమ్మా అమ్మాదేహము విఙ్ఞానమూ బ్రహ్మోపదేశమిచ్చిఇహ పరాలు సాధించే హితమిచ్చిన తండ్రినికను గానని కామమున ఇలువెడలా నడిపితికనిపిస్తే కన్నీళ్ళతో కాళ్ళు కడుగుతా నాన్నానాన్నా నాన్నామారిపోతినమ్మా నా గతి యెరిగితినమ్మామీ మాట దాటనమ్మ ఒకమారు కనరమ్మామాతా పిత పాద సేవే మాధవ సేవేయని మరువనమ్మానన్ను మన్నించగ రారమ్మా అమ్మా అమ్మాయే పాద సీమ కాశీ ప్రయాగాది పవిత్ర భూముల కన్న విమల తరముయే పాద పూజ రమాపతి చరణాబ్జ పూజల కన్నను పుణ్య తమముయే పాద తీర్ధము పాప సంతాపాగ్ని ఆర్పగా జాలిన అమృత ఝరముయే పాద స్మరణ నాగేంద్రశయను ధ్యానమ్ము కన్నను మహానందకరముఅట్టి పితరుల పద సేవ ఆత్మ మరచి ఇహ పరంబులకెడమైతపించువారి కావగల వారు లేరు, లేరు ఈ జగాన వేరేనన్ను మన్నించి బ్రోవుమో అమ్మా నాన్నా, అమ్మా నాన్నా



అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా
ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా

పది నెలలు నను మోసి పాలిచ్చి పెంచీ
మది రోయక నాకెన్నో ఊడిగాలు జేసిన
ఓ తల్లీ నిను నలుగురిలో నగుబాటు జేసితి
తలపకమ్మ తనయుని తప్పులు క్షమియించవమ్మ అమ్మా అమ్మా

దేహము విఙ్ఞానమూ బ్రహ్మోపదేశమిచ్చి
ఇహ పరాలు సాధించే హితమిచ్చిన తండ్రిని
కను గానని కామమున ఇలువెడలా నడిపితి
కనిపిస్తే కన్నీళ్ళతో కాళ్ళు కడుగుతా నాన్నా
నాన్నా నాన్నా

మారిపోతినమ్మా నా గతి యెరిగితినమ్మా
మీ మాట దాటనమ్మ ఒకమారు కనరమ్మా
మాతా పిత పాద సేవే మాధవ సేవేయని మరువనమ్మా
నన్ను మన్నించగ రారమ్మా అమ్మా అమ్మా

యే పాద సీమ కాశీ ప్రయాగాది పవిత్ర భూముల కన్న విమల తరము
యే పాద పూజ రమాపతి చరణాబ్జ పూజల కన్నను పుణ్య తమము
యే పాద తీర్ధము పాప సంతాపాగ్ని ఆర్పగా జాలిన అమృత ఝరము
యే పాద స్మరణ నాగేంద్రశయను ధ్యానమ్ము కన్నను మహానందకరము

అట్టి పితరుల పద సేవ ఆత్మ మరచి ఇహ పరంబులకెడమై
తపించువారి కావగల వారు లేరు, లేరు ఈ జగాన వేరే
నన్ను మన్నించి బ్రోవుమో అమ్మా నాన్నా, అమ్మా నాన్నా

6, మే 2021, గురువారం

పురిటి నొప్పులు భరియించి పుణ్యమూర్తి

మాతృదేవోభవ - 2

పురిటి నొప్పులు భరియించి పుణ్యమూర్తి
చావు మాటకు వెరవక జన్మనిచ్చె,
రొమ్ము పాలను తాగించె 'రోత'యనక
తల్లి ఋణమును తీర్చగా తరము కాదు!

పుటుక తోడనె మొదలగు పుడమిలోన
ప్రాణులందరి బతుకులు మాత వలన,
తల్లి లేకుండ దేవుడి తాతకైన
తరము కాదుగా ధరణిలో తనువుదాల్చ!

26, ఏప్రిల్ 2021, సోమవారం

భండన భీముడా ర్తజన బాంధవుడుజ్జ్వల !

భండన భీముడా ర్తజన బాంధవుడుజ్జ్వల బాణతూణకో
దండకళాప్రచండ భుజ తాండవకీర్తికి రామమూర్తికిన్
రెండవ సాటిదైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా
దాండద దాండ దాండ నిన దంబులజాండము నిండమత్తవే
దండము నెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధీ!

21, ఫిబ్రవరి 2021, ఆదివారం

అందుకే మిత్రుడే గొప్ప పెన్నిధి. *మిత్రాయనమః* 💞"అరే, ఒరే, ఒసే, ఏమే, ఏరా, /అనెడి మిత్రుండొకడుండిన చాలు/వృద్ధాప్యంబున ఉన్న, అదెనొసంగునారోగ్యంబు/మిత్రాయనమః/(1)స్నేహితుండులేని జీవితంబు/తైలంబు లేని దీపంబు, దినకరుండు లేని/దినంబు, ఉప్పులేని పప్పు వ్యర్ధంబు/మిత్రాయనమః!/(2)"ఔషధంబుకానౌషధౌంబు/మనంబునకు శాంతినొసంగు/తెలతెలవారంగ 'ఏరా, ఏమే' అని వినంగ/మిత్రాయనమః/(3)"దేశంబులనున్న, దేవళంబుననున్న/సంతలోననున్న, సభలలోననున్న/'ఏరా'యని వినంగ తృళ్ళిపడు తేటపడు/మానసంబు, మిత్రుని పలుకు చెవిని పడ/మిత్రాయనమః/(4)"పూర్వజనమ పుణ్యంబున దొరకు/ఏరాయను బాల్యమిత్రుండు,/వృద్ధాప్యంబున పలుకరించ/అమృతము చిలకరించు పలుకు/అదిలేని జనమంబు దరిద్రమ్ము/మిత్రాయనమః/(5)॥"నిదుర లేవంగ 'ఏరా' లేనిచో/సగము ప్రాణంబులు పోవు/తీపి గురుతులే మిగులు/దిగులు చెంద దినంబులు భారంబుగ/మిత్రాయనమః!"🙏

3, ఫిబ్రవరి 2021, బుధవారం

కవి జాషువా"తల్లి"

అమ్మంటే.. ఎందరికో బాగా ఇష్టం..

దిగ్గజంలాంటి కవి జాషువా"తల్లి" అంటే..ఎంతగానో తల్లడిల్లిపోయేవాడు. తల్లంటే అల్లల్లాడే వాళ్ళు లోకంలో చాలమంది ఉన్నారు. అందుకే ఆయన కవిత "కన్నతల్లి" లో ఇలా కన్నీళ్లెట్టుకున్నాడు.  సహనంతో మొత్తం చదవండి!!

ఇల్లున్ వాకిలి లేనిదానివలె నేడీ శాకినీ ఢాకినుల్ 
బిల్లలసేయు శ్మశాన భూములను బ్రాపింపగనేలా!జగం 
బెల్లన్ జీకటి ముద్దయై పొడమె తల్లీ! నీవియోగంబునన్
జిల్లులు వడ్దది మానసంబుబికి వచ్చెన్ వేదనానీరధుల్.

కొడుకులను మమ్ము నిర్వాహకులను జేసి 
మురిసికొని చంద్రశిలలీల గరగినావు 
పుణ్యముల తల్లి నీ పాలపుష్టి కతన 
కవన బాలిక నాజిహ్వ నవతరించె.

తరుగింతేనియు లేని నీమహిత పుత్రప్రేమ యేతల్లికిన్ 
బురమాయించి త్యజించి పోయితివి మమ్మున్ నీ శరీరంబుతో 
మరణాంతంబున జన్మమే కలిగినన్ మా తల్లి! నీకడ్పునన్ 
మరలన్ బుట్టెద వేయిజన్మములకున్ దమ్ముండు వెంటాడగన్.

నిరుడీనాటికి గల్గు నీ మహిత సాన్నిధ్యంబు నే డక్కటా! 
మరుగై నీవు పరుండు మంచమొకటే మాకిందు బ్రత్యక్షమై 
పురిగొల్పున్ బరితాపవహ్ని ననయంబున్ గర్భదేశంబునన్ 
దిరిపెంబెత్తిన జూపువారెవరు? ధాత్రిన్ నీ శుభాకారమున్.

ఎనుబదేడుల వయసున దర్పితంబైన 
నీ పెద్ద తలకు మాణిక్య పూజ
జీవితేశుడు మన్నుజేయు నీ దివ్య మం 
గళ సూత్రమునకు నిక్కంపు వినతి

అమ్మల కాదర్శమై ఱాలుగరచు నీ 
మాతృత్వమునకు నమశ్శతంబు 
బలగంపు పూల పూజల దెల్ల వారిన 
నీ దీర్ఘ నిద్రకు నీలి గొడుగు..

నిన్ను దమిమీఱ ఱొమ్మున నిలుపుకొన్న
నీ సమాధికి వేడి కన్నీటి పూత 
కొడుకుల సుఖంబునకు మేను కొల్లబెట్టు 
జీర్ణమూర్తికి నెత్తురు చిలుకరింపు.

నిత్య విశ్రాంతినానందనిలయ మంచు 
దిరుగుచున్నావు గాబోలు దిగులు లేక 
సర్వ సంసార బాధా విష జ్వరమున 
కౌషధంబైన మరణంబు నభినుతింతు.

16, జనవరి 2021, శనివారం

తలనిండ పూదండ దాల్చిన రాణి


ఆ రజనీకర మోహన బింబము
నీ నగుమోమును బోలునటె
కొలనిలోని నవకమల దళమ్ములు
నీ నయనమ్ముల బోలునటే..
ఎచట చూచినా, ఎచట వేచినా
నీ రూపమదే కనిపించినదే..

తలనిండ పూదండ దాల్చిన రాణి
మొలక నవ్వులతోడ మురిపించబోకె

తలనిండ పూదండ దాల్చిన రాణి
మొలక నవ్వులతోడ మురిపించబోకె

పూలవానలు కురియు మొయిలువో
మొగలి రేకులలోని సొగసువో..

పూలవానలు కురియు మొయిలువో
మొగలి రేకులలోని సొగసువో..

నారాణి తలనిండ పూదండ దాల్చిన రాణి
మొలక నవ్వుల తోడ మురిపించబోకే

నీ మాట బాటలో నిండే మందారాలు
నీ పాట తోటలో నిగిడే శృంగారాలు

నీ మాట బాటలో నిండే మందారాలు
నీ పాట తోటలో నిగిడే శృంగారాలు

నీ మేనిలో పచ్చ చేమంతి అందాలు...
నీ మేనిలో పచ్చ చేమంతి అందాలు...
నీ నీలవేణిలో నిలిచే ఆకాశాలు

తలనిండ పూదండ దాల్చిన రాణి
మొలక నవ్వుల తోడ మురిపించబోకే
మొలక నవ్వుల తోడ మురిపించబోకే

9, జనవరి 2021, శనివారం

పూత మెఱుంగులుం బసరు పూప బెడంగులు జూపునట్టి వా

కైతలు? జగ్గు నిగ్గు నెనగావలె గమ్మన గమ్మనన్వలెన్

రాతిరియున్ బవల్ మఱపురానిహొయల్ చెలి యారజంపు ని

ద్దాతరితీపులో యనగ దారసిలన్వలె లో దలంచినన్

బాతిగ బైకొనన్ వలెను బైదలికుత్తుకలోనిపల్లటీ

కూత లనన్వలెన్ సొగసు కోర్కులు రావలె నాలకించినన్

జేతికొలంది గౌగిటనుజేర్చినకన్నియ చిన్నిపొన్ని మే

ల్మూతలచన్నుదోయివలె ముచ్చట గావలె బట్టి జూచినన్

డాతొడనున్న మిన్నులమిటారపుముద్దులగుమ్మ కమ్మనౌ

వాతెఱ దొండపండువలె వాచవిగావలె బంటనూదినన్

గాతల దమ్మిచూలిదొర కైవసపుంజవరాలి సిబ్బెపు

న్మే తెలియబ్బురంపుజిగి నిబ్బర పుబ్బగుగబ్బిగుబ్బపొం

బూతలనున్నకాయసరిపోడిమి కిన్నెర మెట్లబంతి సం

గాతపు సన్నతంతి బయకారపు గన్నడగౌళపంతుకా

సాతతతానతానలపసన్ దివుటాడెడు గోటమీటుబల్

మ్రోతలునుంబలెన్ హరువు మొల్లము గావలె నచ్చ తెన్గు లీ

రీతిగ, సంస్కృతంబు పచరించెడుపట్టున భారతీవధూ

టీతపనీయగర్భనికటీభవదాననపర్వసాహితీ

భౌతికనాటక ప్రకరభారతభారతసమ్మతప్రభా

శీత నగాత్మజా గిరిజ శేఖర శీతమయూఖ రేఖికా

పాతసుధా ప్రపూరబహుభంగఘుమంఘుమఘుంఘుమార్భటీ

జాతకతాళయుగ్మ లయసంగతి చుంచువిపంచికామృదం

గాతతతేహితత్తహితహాధితధంధణుధాణుధింధిమి

వ్రాతనయానుకూలపదవారకుహూద్వహహారికింకిణీ

నూతన ఘల్ఘలాచరణనూపురఝాళఝళీమరందసం

ఘాతవియధ్ధునీ చకచకద్వికచోత్పలసారసంగ్రహా

యాతకుమారగంధవహహారిసుగంధవిలాసయుక్తమై

చేతము చల్లజేయవలె జిల్లన జల్లవలెన్ మనోహర

ద్యోతకగోస్తనీఫలమధుద్రవగోఘృతపాయస ప్రసా

రాతిరసప్రసారరుచిరప్రసరంబుగ సారెసారెకున్

21, డిసెంబర్ 2020, సోమవారం

శ్మశానవాటిక (జాషువా )

శ్మశానవాటిక (జాషువా విశ్లేషణ)
జాషువా కవీంద్రుని కలంనుండి జాలువారిన మరో అద్భుత ఖండకావ్యం శ్మశానవాటిక.

మానవులు జీవించి వుండగా వెళ్ళటానికి చూడటానికి యిష్టపడని ప్రదేశాలు రెండు.ఒకటి వైద్యశాల.రెండు శ్మశానం,/వల్లకాడు,/రుద్రభూమి.జాతస్య హి ద్రువం మృత్యు. పుట్టిన ప్రతి వాడు గిట్టక తప్పదు.చావును తప్పించుకున్న వాడెవ్వడూ లేడు ధరణిలో.అందరు ప్రస్దానముకేగవలసిన వారే.అయినను శ్మశానం అనే పేరు వినగానే మనస్సు కీడు శంకిస్తుంది.ఏదో భీతి,మదిలో గుబులు. రాత్రుళ్ళూ, మధ్యాహ్నం అటువైపు వెళ్ళటానికే జంకు. అట్టి శ్మశానాన్ని తన కవితా వస్తువుగా ఎంచుకున్నాడు జాషువా కవి. కవి ఎప్పుడూ తనచుట్టూ ఉన్న లోకాన్ని ఇతరులకన్న భిన్నంగా, లోతుగా గమనిస్తాడు, అర్ధం చేసుకుంటాడు. తన భావాలను అక్షరరూపంలో పాఠకుల ముందుంచుతాడు.

శ్రీశ్రీ తన మహప్రస్ధానములో ఒకచోట అంటాడు కుక్కపిల్ల,సబ్బుబిళ్ల,అగ్గిపుల్ల.... కాదేది కవిత కనర్హం..."'.

అంతకు కొన్ని దశాబ్దాలముందే,అవునవును శ్మశానం కవితకు అర్హం అంటూ జాషువా ఈ ఖండకావ్యాన్ని లిఖించాడు.ఈ కావ్యంలోని పద్యాలలోని పదభావం సూటిగా పాఠకుని హ్రుదయం లోతుల్లోనికి చొచ్చుకెళ్లి,గుండె బరువెక్కుతుంది,వైరాగ్యభావం దోబుచులాడుతుంది.జీవిత చరమాంకసత్యాన్ని కళ్ళెదుట నిలుపుతుంది.ఈ ఖండకావ్యంలో 8 పద్యాలున్నాయి.అన్ని అణిముత్యాలాంటి పద్యాలే.

దువ్వురి వారి పానశాలలో ఒకచోట కవి...అంతం లేని ఈభువనమంతయు ఒకవిశాల పాంధశాల, విశ్రాంతి గృహం,అందు ఇరుసంజెలు రంగుల వాకిలిల్.........కొంత సుఖించి పోయిరెటకో , అంటాడు.

జాషువ ఈకావ్యం మొదటీ పద్యంలో ఈవిషయాన్నే ప్రస్తావిస్తు,ఈ శ్మశానవాటికలో కొన్నివందల,వేల ఏండ్లగా నిద్రిస్తున్నవారు ఒక్కరుకూడా లేచి రాలేదు కదా అంటు ప్రారంభించాడు.ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈచలనంలేని నిద్ర అంటూ వాపోతున్నాడు.ఈ రుద్రభూమిలో తమబిడ్దలను పొగొట్టుకున్న తల్లుల రోదనలతో నిండిన కన్నీళ్ళకు వల్లకాడులోని రాళ్లు క్రాగిపోయ్యాయి అని చింతిస్తున్నాడు. కవిహృదయం చూడండి.

   ఎన్నో యేండ్లు గతించిపోయినవి గానీ,యీ శ్మశానస్ధలిన్
   గన్నుల్ మోడ్చిన మందభాగ్యుడొకఁడైనన్ లేచిరాఁ,డక్కటా!
   యెన్నాళ్ళీచలనంబులేని శయనం? బేతల్లు లల్లాడిరో!
   కన్నీటంబడి క్రాఁగిపోయినవి నిక్కంబిందు పాషాణముల్

ప్రకృతిగతి తప్పి,ఆకాశంలో కారుమబ్బులు కమ్మిచిమ్మచీకటీ నిండి,దయ్యాలు,గూడ్లగూబలు చెరలాడుచు,కాకులు ముకమ్మిడిగా గోలచేసిన జనవాసం భితిల్లుతుంది.కాని ఈ శ్మశానవాటికలో భీతికి తావేలేదు.అంతా నిశ్సబ్దం....శ్మాశాన నిశ్సబ్దం.....

కవికలం ఎమంటున్నది.?

   ఆకాశంబున కారుమబ్బుగము లాహారించె,దయ్యాలతో
   ఘూకంబుల్ చెరలాడసాఁగినవి;వ్యాఘోషించె నల్దిక్కులన్
   గాకోలంబులు ; గుండెఝల్లుమనుచున్నంగాని యిక్కాటియం
   దా కల్లాడిన జాడలే;దిచ్చట సౌఖ్యం బెంత క్రీడించునో!

ఈ రుద్రభూమికి చెడ్డవాడు,మంచివాడనే తేడాలేదు.యాజమాని,సేవకుడనే వ్యత్యాసంలేదు.హతుడు హంతకుడు యిద్దరు సమానమే ఈ నేలలో.కవి,రాజు,లేత యిల్లాలి మాంగల్యం,చిత్రకారుడు ఎవ్వరైతేనేమి ఆయ్యుస్సు తీరాక యిక్కడ విశ్రమించవలసిన వారే!.సృష్టికి లయకారుడు శివుడు.ఆయనకిష్టమైనది తాండవం.అట్టి శివతాండవానికి అనువైనది ఈ శ్మశానవాటిక కన్నమిన్న ఏమున్నది. ఈ వాటిక శివుడు తన పిశాచఅనుచరగణంతో నాట్యమాడు రంగస్ధలమంటున్నడు కవి. అంతేకాదు ఈ రుద్రభూమి మరణదూత భూమిని పాలించు బూడితతో చేసిన సింహసనమట! ఎంతలోతు భావం కవిది.

కవిహృదయం ఏమంటుందో చూడండి.

  ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని
     కలము,నిప్పులలోనఁగఱగిఁపోయె !
  యిచ్చోట;నే భూము లేలు రాజన్యుని
    యధికారముద్రిక లంతరించె!
  యిచ్చోట; నే లేఁత యిల్లాలి నల్లపూ
    సలసౌరు,గంగలోఁగలిసిపోయె!
  యిచ్చోట; నెట్టి పేరెన్నికం గనుఁగొన్న
    చిత్రలేఖకుని కుంచియ,నశించె!

  ఇది పిశాచులతో నిటాలేక్షణుండు
  గజ్జె గదలించి యాడు రంగస్ధలంబు;
  ఇది మరణదూత తీక్షణమౌ దృష్టు లొలయ
  నవనిఁ బాలించు భస్మసింహాసనంబు

రాత్రి సమయం...తిమిరం నిండిన శ్మశానం....నిశ్శభ్దం రాజ్యమేలు వేళ....ఆ మూల కొత్తసమాధి....సమాధిపై ఆముదపుదీపం, కదులుతున్న మిణుగురులా రెపరెపలాడుచూ వెలుగు చున్నది. అరే! అదేమిటి? ప్రమిదలో అముదం నిండుకున్నను ఇంకా దివ్వె వెలుగుచున్నదేమి?! ఆ సమాధిలో నిద్రిస్తున్న అభాగ్యురాల యొక్కహృదయం కాబోలు ఆ దివ్వె వెలుగు!?....పాఠకుని గుండెను సూటిగా తాకి ఆర్ధ్రమైయ్యే భావం.ఈలాంటి భావన చెయ్యడం చేయ్యితిరిగిన కవికే సాధ్యం.

  ముదురు తమస్సులో మునిఁగిపోయిన క్రొత్త సమాధిమీదఁ బై
  బొదలు మిణుంగురుబురువు పోలిక వెల్గుచున్నదివ్వె,ఆ
  ముద ముడివోయినన్ సమసిపోవుట లేదది దీప మందుమా?
  హృదయము సుమ్మి,నిల్పిచనియె న్గతపుత్రిక,యే యభాగ్యయో

కవితా సుధలోలికించిన కవులకలాలు, శ్రవణాందకరమైన గాయకుల కమ్మని కంఠస్వరాలు ... ఇదిగో ఈ శ్మశాన పూవాటికలో విశ్రమించాయి.పంచభౌతికమైన ఈ మేను కడకు ప్రకృతిలో కలసి పోవల్సినదే.అందులో మమైకం కావలసినదే.పుట్టుక కూడా తల్లిగర్భం నుంచే అయ్యినను,తల్లికూడా ప్రకృతి జనీతమే కదా.మట్టిలో ఖననము చెయ్యబడిన తనువు క్రమంగా కృషించి,నశించి,జీర్ణించి మట్టీలో మట్టిగా కలసిపోతుంది.మట్టిరేణువులలలో రేణువులుగా కలసిపోవును.ఔను నిక్కమే కదా!.అదిగో ఆ కుమ్మరి సారె మీదున్న మట్టిముద్దలో అల్నాటి సుకవులు కాళిదాసు,భారవుల మృతరేణువులు కలసి వున్నాయేమో కదా!.

మరి కవిమనస్సు ఏమంటున్నది.

  కవుల కలాలు,గాయకుల కమ్మని కంఠము లీ సశ్మశానపుం
  గవనులఁ ద్రొక్కి చూచెడి;నొకానొకనాఁడల కాళిదాస భా
  రవుల శరీరముల్ ప్రకృతిరంగమునం దిపు డెంత లేసి రే
  ణువు లయి మృత్తికం కలిసెనో కద! కుమ్మరి వాని సారె పై.

శ్మశానవాటిక వాకిటనుంచొని ఒకపర్యాయం పరికించి చూచిన మనగుండెలు తర్కుపోతాయి.మన మనస్సు కరిగినీరై పోతుంది ఆమూలనున్న అన్నెం పున్నెం ఎరుగని వయస్సులోనే మృత్యువు గర్భంలో చేరిన చిన్నారుల గోరిలను చూస్తే.ఆ పిల్లల సమాధులలో ఏచిన్నారి పొన్నారిరూపసి తనువు చాలించిందో? ఏ ముద్దులు మూటలుకట్టు రూపసి అలసిసొలసి నిద్రిస్తున్నదో.ఏ తల్లి లీలావతి కడుపుతీపి దాగున్నదో?

  ఆలోకించిన గుండిల్గరగు; నాయా పిల్ల గోరీలలో
  నే లేబుగ్గల సౌరు రూపరియెనో!యేముద్దు నిద్రించెనో!
  యే లీలావతి గర్భగోళమున వహ్నిజ్వాల జీవించునో?
  యీలోకంబున వృద్ధిగాదగిన యేయే విద్య లల్లాడునో?

వల్లకాడులో అస్పృశ్యతకు తావు లేదు.ఏ మతమైన,ఏ కులమైన,ఏ వర్ణమైన ఇక్కడ ఒక్కటే. అందరిని స్వీకరించడంలో సమతా భావం.పులిపక్కన సాధుజంతువు మేకను జేర్చి బుజ్జగించి,వూరడించు అభేదభావనావని ఈ శ్మశానభూమి.

  ఇట నస్పృశ్యత సంచరించుటకు దావేలేదు;విశ్వంభరా
  నటనంబున్ గబలించి గర్భమున విన్యస్తంబు గావించి, య
  త్కటంపు బెబ్బులితోడ మేకఁ నొక్క పక్కజేర్చి జోకొట్టి యూ
  ఱట గల్పించు నభేదభావమును, ధర్మం బిందుఁ గారాడెడిన్

మారుతున్న,పరిగెడుతున్న కలికాలంలో ఆర్థికఅవసరాలు,ధనవ్యామోహం-రక్తబంధాలను,పాశాలను త్రెంచుతున్నాయి.తమను కని,అల్లారు ముద్దుగా పెంచి,పోషించిన తల్లిదండ్రులను వృధ్యాపంలో,బ్రతికి వుండగానే వల్లకాటిలో అర్ధరాత్రి వదలివెళ్ళూచున్న రోజులివి.ఆలాంటప్పుడు అనాథ పేదవాని మృతశరీరాన్ని పట్టించుకొని,ఖననముచెయ్యు దాతలెందరు?.అన్నింటికన్న దారుణమైనది,భయంకరమైనది దరిద్రం/పేదరికం. శ్మశానంలో ఖననానికి నోచుకోని ఒక అనాథపీనుగను గూర్చి కవి ఎంత హృదయఆర్తితో వర్ణించాడో.అది కవి వేదనకాదు...పాఠకుని హృదయ ఘోష...కాదందురా?

  వాకొనరాని గొప్ప ధనవంతుని నిద్దపుఁ బాలరాతి గో
  రీకడఁ బారవేయబడి ప్రేలికలం బొరలాడు ప్రేత మే
  యాకటి చిచ్చునన్ గుమిలి,యార్చి,గతించిన పేదవాని దౌ
  నో కద! వానికై వగవఁ డొక్కదండు; దాఁచదు కాటినేలయున్

20, డిసెంబర్ 2020, ఆదివారం

తిన్నవా లేదా అనిఅడిగానా ఎపుడైనా..

శ్రీమతి గారికి జన్మదిన శుభాకాంక్షలు
పన్నెండేండ్ల మన జీవన ప్రయాణంలో నేను...

తిన్నవా లేదా అనిఅడిగానా ఎపుడైనా..
నడుం వాల్చలేదేమని అన్నానా ఎపుడైనా..

ముసురువేళ వేడివంట తిన్నానేగానీ
నీ ప్రేమకింత రుచిఉందని అన్నానా ఎపుడైనా..

జడలో మల్లెల వాసన పీల్చానే గానీ
తన మనసులోని పరిమళాన్ని చూసానా ఎపుడైనా..

బండచాకిరీ నీదని భావించానే గానీ
తన అలసట తుడిచి ముద్దు పెట్టానా ఎపుడైనా..

అర్దాంగివి కావు నీవు అనురాగ దేవతవు
రసరాజై ఈ నిజాన్ని రాస్తానా ఎపుడైనా..
ఈ గజలును నేనై కూస్తానా ఎపుడైనా...

రచన: శ్రీ రసరాజు

జన్మదిన సందర్భంగా గురువుగారు రచించిన ఈ గజల్ నా ప్రేమ కానుకగా నీకోసం...

13, డిసెంబర్ 2020, ఆదివారం

తెలుగు వాడు.. వెలుగు వాడు..

తెలుగు వాడు.. వెలుగు వాడు..
అరయ తెలుగువాడు – వరి వంగడము వోలె
వేరు చోట నాట వృద్దిచెందు
అభ్యుదయము నందు –అన్యదేశము నందు 
ఆంధ్ర ప్రతిభ వేగ  అతిశయించు!!

(---నండూరి రామకృష్ణమాచార్య)

12, డిసెంబర్ 2020, శనివారం

వీరగంధముఁ దెచ్చినారము

న భూతో న భ భవిష్యతి.......                                                         'కవిరాజు' త్రిపురనేని రామస్వామి చౌదరి

వీరగంధము....

వీరగంధముఁ దెచ్చినారము
వీరుఁ డెవ్వఁడొ తెల్పుఁడీ!
పూసి పోదుము, మెడను వైతుము
పూలదండలు భక్తితో!!

తెలుఁగు బావుట కన్ను చెదరఁగ
కొండవీఁటను నెగిరినప్పుడు
తెలుఁగువారల కత్తిదెబ్బలు
గండికోటను కాచినప్పుడు

తెలుఁగువారల వేఁడినెత్తురు
తుంగభద్రను గలసినప్పుడు
దూరమందున నున్న సహ్యజ
కత్తినెత్తురు కడిగినప్పుడు

ఇట్టి సందియ మెన్నఁడేనియుఁ
బుట్టలేదు రవంతయున్‌!
ఇట్టి ప్రశ్నల నడుగువారలు
లేకపోయిరి సుంతయున్‌.

నడుముగట్టిన తెలుఁగుబాలుఁడు
వెనుక తిరుగం డెన్నఁడున్‌,
బాసయిచ్చిన తెలుఁగుబాలుఁడు
పాఱిపోవం డెన్నఁడున్‌.

ఇదిగొ! యున్నది వీరగంధము
మై నలందుము మైనలందుము;
శాంతిపర్వముఁ జదువవచ్చును
శాంతిసమరం బైనపిమ్మట.

తెలుఁగునాఁటిని వీరమాతను
జేసిమాత్రము తిరిగి రమ్మిఁక,
పలుతుపాకులు పలు ఫిరంగులు
దారి కడ్డము రాకతప్పవు

వీరగంధముఁ దెచ్చినారము
వీరుఁ డెవ్వఁడొ తెల్పుఁడీ!
పూసిపోదుము, మెడను వైతుము
పూలదండలు భక్తితో!!

(ఏవీ నాటి ఆ సౌరభాలు ?)

8, డిసెంబర్ 2020, మంగళవారం

శ్యామలా దండకం

మాణిక్యవీణా.. ముఫలాలయంతీం
మదాలసాం మంజులవాగ్విలాసామ్
మాహేంద్రనీలద్యుతి కోమలాంగీమ్
మాతంగకన్యామ్ మనసా స్మరామి
చతుర్భుజే చంద్రకళావతంసే.. ఏ..
కుచోన్నతే కుంకుమరాగశోణే.. ఏ..
పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే
నమస్తే... జగదేకమాతః... జగదేకమాతః
మాతా.. మరకతశ్యామా మాతంగీ మధుశాలినీ
కుర్యాత్కటాక్షం కళ్యాణీ కదంబవనవాసినీ
జయ మాతంగతనయే.. జయ నీలోత్పలద్యుతే
జయ సంగీతరసికే.. జయ లీలాశుకప్రియే
జయ జనని...
సుధాసముద్రాంతరుద్యన్మణీద్వీపసంరూఢ
బిల్వాటవీమధ్యకల్పద్రుమాకల్ప
కాదంబ కాంతారవాసప్రియే... కృత్తివాసప్రియే
సాదరారబ్ధ సంగీతసంభావనాసంభ్రమాలోలనీపస్రగాబద్ధచూలీసనాథత్రికే సానుమత్పుత్రికే శేఖరీభూతశీతాంశురేఖామయూఖావలీబద్ధసుస్నిగ్ధనీలాలకశ్రేణిశృంగారితే లోకసంభావితే
కామలీలా ధనుస్సన్నిభ భ్రూ లతా పుష్ప సందేహ కృచ్చారు గోరోచనా పంకకేళీ లలామాభిరామే.. సురామే.. రమే
సర్వ యంత్రాత్మికే.. సర్వ తంత్రాత్మికే
సర్వ మంత్రాత్మికే.. సర్వా ముద్రాత్మికే
సర్వ శక్త్యాత్మికే.. సర్వ చక్రాత్మికే
సర్వ వర్ణాత్మికే.. సర్వ రూపే
జగన్మాతృకే... హే... జగన్మాతృకే
పాహి మాం.. పాహి మాం.. పాహి... పాహి

2, డిసెంబర్ 2020, బుధవారం

స్నేహితుండులేని జీవితంబు/

*మిత్రాయనమః* 

"అరే, ఒరే, ఒసే, ఏమే, ఏరా, /
అనెడి మిత్రుండొకడుండిన చాలు/
వృద్ధాప్యంబున, అదెనొసంగునారోగ్యంబు/
మిత్రాయనమః/(1)

స్నేహితుండులేని జీవితంబు/
తైలంబు లేని దీపంబు, దినకరుండు లేని/
దినంబు, ఉప్పులేని పప్పు వ్యర్ధంబు/
మిత్రాయనమః!/(2)

"ఔషధంబుకానౌషధౌంబు/
మనంబునకు శాంతినొసంగు/
తెలతెలవారంగ 'ఏరా, ఏమే' అని వినంగ/
మిత్రాయనమః/(3)

"దేశంబులనున్న, దేవళంబుననున్న/
సంతలోననున్న, సభలలోననున్న/
'ఏరా'యని వినంగ తృళ్ళిపడు తేటపడు/
మానసంబు, మిత్రుని పలుకు చెవిని పడ/
మిత్రాయనమః/(4)

"పూర్వజనమ పుణ్యంబున దొరకు/
ఏరాయను బాల్యమిత్రుండు,/
వృద్ధాప్యంబున పలుకరించ/
అమృతము చిలకరించు పలుకు/
అదిలేని జనమంబు దరిద్రమ్ము/
మిత్రాయనమః/(5)॥

"నిదుర లేవంగ 'ఏరా' లేనిచో/
సగము ప్రాణంబులు పోవు/
తీపి గురుతులే మిగులు/
దిగులు చెంద దినంబులు భారంబుగ/
మిత్రాయనమః!"(6).

 మితృలందరికీ అంకితం! 🙏

స్నేహితుండులేని జీవితంబు/

*మిత్రాయనమః* 

"అరే, ఒరే, ఒసే, ఏమే, ఏరా, /
అనెడి మిత్రుండొకడుండిన చాలు/
వృద్ధాప్యంబున, అదెనొసంగునారోగ్యంబు/
మిత్రాయనమః/(1)

స్నేహితుండులేని జీవితంబు/
తైలంబు లేని దీపంబు, దినకరుండు లేని/
దినంబు, ఉప్పులేని పప్పు వ్యర్ధంబు/
మిత్రాయనమః!/(2)

"ఔషధంబుకానౌషధౌంబు/
మనంబునకు శాంతినొసంగు/
తెలతెలవారంగ 'ఏరా, ఏమే' అని వినంగ/
మిత్రాయనమః/(3)

"దేశంబులనున్న, దేవళంబుననున్న/
సంతలోననున్న, సభలలోననున్న/
'ఏరా'యని వినంగ తృళ్ళిపడు తేటపడు/
మానసంబు, మిత్రుని పలుకు చెవిని పడ/
మిత్రాయనమః/(4)

"పూర్వజనమ పుణ్యంబున దొరకు/
ఏరాయను బాల్యమిత్రుండు,/
వృద్ధాప్యంబున పలుకరించ/
అమృతము చిలకరించు పలుకు/
అదిలేని జనమంబు దరిద్రమ్ము/
మిత్రాయనమః/(5)॥

"నిదుర లేవంగ 'ఏరా' లేనిచో/
సగము ప్రాణంబులు పోవు/
తీపి గురుతులే మిగులు/
దిగులు చెంద దినంబులు భారంబుగ/
మిత్రాయనమః!"(6).

 మితృలందరికీ అంకితం! 🙏

28, నవంబర్ 2020, శనివారం

జిడ్డు కృష్ణమూర్తి గారి పై బుర్రకధ

జిడ్డుకృష్ణమూర్తి గారి కథని బుర్రకథగా రాశాను.  రాజశేఖర్ (మా ఆయన) పాట బీట్ కి లేదా ట్యూన్ కి  తగినట్లుగా కొంత మార్చాడు పాటలని.  కొద్దిగా సంగీతం తెలిసిన వారికి వీటిని పాడటం చాలా ఈజీ.  తెలియకపోయినా పాడుతూ బుర్రకథని రక్తి కట్టించవచ్చు.

ఆ పరిపూర్ణ మానవతామూర్తి జిడ్డు కృష్ణమూర్తి గురించి ఈనాటి తరం పిల్లలు అందరికీ తెలియాలి.  టీచర్లూ, మీ స్కూల్లో పిల్లల చేత ఈ  బుర్రకథని చెప్పించాలని కోరుకుంటున్నాను.      

కళాకారులందరికీ ఈ బుర్రకథని షేర్ చేయండి ఫ్రెండ్స్!      - మీ రాధ మండువ 

******************************************** 

పరిపూర్ణ మానవతామూర్తి - జిడ్డు కృష్ణమూర్తి  
బుర్రకథ – రచన : రాధ మండువ

పాత్రలు : 
కథకురాలు - రాధక్క
వంతలు    -  రమ, రాజు ("తందాన తాన" ఇంకా "సై" అని అంటూ ఉంటారు)

***

రాధక్క :  జయము జయము తెలుగుతల్లీ జయము జయమూ నీకమ్మా - తందాన తాన
               జయము జయము ఆంధ్రమాతా జయము శుభములనివ్వమ్మా - తందాన తాన
               చదువులనిచ్చేటి దయగలతల్లీ - జ్ఞానము నీవమ్మా - తందాన తాన
               సంపదలిచ్చేటి శ్రీ మహాలక్ష్మి కరుణజూపవమ్మా  తందాన తాన 
               తరికిట ఝం తరిత .. త.. త.. త..

రమ,రాజు :  తందాన  తానా దేవనందనా,  దేవనందనానా 
                   తందాన తానా  దేవనందనా,  దేవనందనానా
                   తరికిట ఝం తరిత .. త.. త.. త..

రాజు :  రాధక్కా,  ఈరోజు ఏం కథ చెప్పబోతున్నావు?
రమ :  మదనపల్లి లో పేరొందిన ఒక బడి ఉంది కదా తమ్ముడూ, ఆ బడి పేరేమిటో తెలుసా?  
రాజు :  తెలియదు.  ఏం పేరు?
రమ :  చిత్తూరు జిల్లాకి గౌరవాన్ని తెచ్చిన బడి - రిషీవ్యాలీ బడి.
రాజు :  హేమిటీ!?  ప్రేమ కార్యాలు జరిపే మదనుడి పేరు పెట్టుకున్న మదనపల్లిలో రుషుల పేరుతో రిషీవ్యాలీ స్కూలా?  అదెట్లా కుదురుతుందీ?  ఏందక్కా, చెల్లి అనేది?

రాధక్క :  మంచి జోక్ తమ్ముడూ.  నిజంగానే మన చెల్లి చెప్పింది నిజం.  ఆ బడి చిత్తూరు జిల్లాకే గర్వకారణం.  భారతదేశం నించే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా విద్యార్థులు వచ్చి ఆ బడిలో చదువుకుంటారు.   అదే రిషీవ్యాలీ బడి.  దాన్ని ‘World Teacher’ అని పిలవబడే పరిపూర్ణ మానవతామూర్తి జిడ్డు కృష్ణమూర్తి గారు స్థాపించారు.  

పుణ్యక్షేత్రమైన తిరుపతి నుండి మదనపల్లి గుండా అనంతపురం వరకు వ్యాపించిన కొండలు, ఆ కొండల మధ్య లోయలు - ఆ లోయల్లో ఒక లోయ రిషీవ్యాలీ లోయ.  అక్కడ చింత, కానుగ, మద్ది, తంగేడు, పలవరేణి, ఆకాశమల్లి లాంటి అనేక రకాలైన చెట్లు చిక్కటి ఛాయలను పరచి వాతావరణాన్ని చల్లగా ఉంచుతాయి.  అక్కడ గడ్డిపువ్వులు కూడా వివిధ వర్ణాలతో అలరారుతుంటాయి.  ఆ ప్రదేశంలో ఉన్న ఓ బ్రహ్మాండమైన మర్రిచెట్టుని చూసిన కృష్ణమూర్తిగారు బడికి అదే అనువైన ప్రదేశం అనుకున్నారు.  అక్కడ రిషీవ్యాలీ బడిని స్థాపించారు.  

రాజు :  నువ్వు చెప్తుంటేనే ఆ ప్రదేశాన్ని చూడాలనిపిస్తోందక్కా.   ఆ ప్రేమమూర్తి కథ చెప్తావా వింటాము.

రాధక్క :  అలాగే తమ్ముడూ,
               బంగరుఛాయల బిడ్డల్లారా - బిడ్డలగన్న తల్లుల్లారా
               అయ్యల్లారా అమ్మల్లారా - వింటారా ఈ కథనూ...  వింటారా ఈ కథనూ...
          
రమ, రాజు :  ఊఁ ఎందుకు వినం ?  

రాధక్క :  మీరు కూడా వినండి ప్రజలారా ఆ కరుణామూర్తి కృష్ణమూర్తి గాథ - జిడ్డు కృష్ణమూర్తి గాథ //తందాన తానా// 

రాధక్క :  దక్షిణభారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లా ఉన్నది.  ఆ జిల్లాలో అతి పురాతన శిలారూపాలుగా భావించబడుతున్న రాతికొండల మధ్య ఒదిగి ఉండే ఊరు మదనపల్లి.   మదనపల్లిలో కాపురముంటున్న నారాయణయ్య, సంజీవమ్మ దంపతులకు ఎనిమిదవ సంతానంగా జన్మించాడు మన కృష్ణమూర్తి.

రమ :  దేవకీ వసుదేవులకి అష్టమసంతానం సాక్షాత్తూ శ్రీ కృష్ణుడు, అందుకేనేమో ఈయనకి కూడా కృష్ణమూర్తి అని పేరు పెట్టుకున్నారు.  

రాజు: ఆ కృష్ణుడు భగవద్గీతను బోధించి మనుషులకి మోక్షాన్ని ప్రసాదించాడు.  మరి ఈయనో...!?

రాధక్క :  ఈయన కూడా అంతటి గొప్పవాడే తమ్ముడూ.  మనుషులకుండే అనేక రకాలైన బాధల్నించి, భయాల్నించి - తమ ఆలోచనలతో తామే తయారుచేసుకున్న పంజరాల నించి - వారిని విముక్తులని చేయాలన్నదే లక్ష్యంగా బ్రతికారు.  

రాజు :  ఎంత గొప్ప విషయం అక్కా!  ఇప్పుడు, ఆయన్ని గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది.

రమ :  అయితే శ్రద్ధగా విను.  వసపిట్టలా ఒకటే ప్రశ్నలు అడుగుతుంటివి.  కథ సాగేదెలా?

రాజు :  నువ్వే కదా కృష్ణుడు - కృష్ణమూర్తి అని పేర్లు ఎత్తి మధ్యలో అడ్డుపడిందీ?  నన్నంటావు అదేమంటే.  (బుంగమూతి పెట్టుకుంటాడు.  రమ ఏదో చెప్పబోతుంటే రాధక్క అడ్డుపడి) - 

రాధక్క :  ఊరుకో చెల్లీ!  తమ్ముడూ, మీరిట్లా వాదులాడుకుంటుంటే ఎలా?  మీరు ఆపితే కథ చెప్పడం మొదలుపెట్టుకుందాం!  

(సరే అక్కా అంటూ ఇద్దరూ తలలు ఊపుతారు)

రాధక్క : వినరా సోదరా ఈ పుణ్యమూర్తి,  కృష్ణమూర్తి గాథా //తందాన తానా//
మానవ జాతికి మంచిని చెప్పిన  తత్త్వవేత్త గాథా //తందాన తానా//
తరికిట ఝం తరిత!

ఆ నారాయణయ్య సంజీవమ్మ దంపతులకు మే 11, 1895 న కృష్ణమూర్తి గారు జన్మించారు.  ఆ తర్వాత వాళ్ళకి మరో అబ్బాయి పుట్టాడు.  అతని పేరు నిత్యానంద.  కృష్ణమూర్తిగారికి పదేళ్ళ వయసు ఉన్నప్పుడు పాపం తల్లి సంజీవమ్మ మరణించింది.

రమ, రాజు :  అయ్యో పాపం!

రాధక్క :  గొప్పా ఇంటా పుట్టిన బిడ్డా...  //ఆఁ...//
               అభం శుభం ఎరుగని బిడ్డా...  //ఆయ్ ...//
               ముందు వెనకా చూడకుండా...  //ఆఁ...//
               చేతిన ఉన్నది ఇచ్చే బిడ్డా...  //ఆయ్ ...// 
               
అలాంటి ఆ బిడ్డకి అంత చిన్న వయసులోనే తల్లి మరణించడం - ఎంత కష్టం తండ్రీ!

రమ, రాజు :  అయ్యో, అయ్యొయ్యో!  ఎంత కష్టం వచ్చింది తండ్రీ!!

రాధక్క : తండ్రి సంరక్షణలోనే బిడ్డలందరూ పెరిగి పెద్దవాళ్ళవుతున్నారు.   తమ్ముడు నిత్యానందని కృష్ణమూర్తి ఎప్పుడూ విడిచి ఉండేవాడు కాడు.  ఇద్దరూ కలసిమెలసి ఆడుకునేవారు.  ఇలా ఉండగా కొన్నాళ్ళకి తహసిల్దారైన నారాయణయ్య  రిటైరై పోయారు.  

పిల్లలు చూస్తే చిన్నపిల్లలాయె.  బాధ్యతలు తీరలేదయ్యే.  అందుకని నారాయణయ్య మద్రాసు లోని థియోసాఫికల్ సొసైటీలో చిరుద్యోగిగా చేరాడు.

రాజు :  థియోసాఫికల్ సొసైటీనా?  ఏమిటక్కా అది?

రాధక్క :  అదొక ఆధ్యాత్మిక సంస్థ నాయనా.  ఒకే ఆలోచన కలిగిన వాళ్ళంతా పెట్టుకున్న సంస్థ.  దాన్నే దివ్యజ్ఞాన సమాజం అని కూడా పిలుస్తారు.  నారాయణయ్య అక్కడ ఉద్యోగంలో చేరినప్పుడు ఆ సంస్థకి అధ్యక్షురాలు అనిబిసెంట్ అనే ఆవిడ.  ఆవిడ గురించి కూడా మనం చెప్పుకోవాలి రా తమ్ముడూ...   

ఆమె బ్రిటీష్ దేశ వనిత.  అయినా కూడా...
             
     భారతదేశం క్షేమం కోరెను  // తళాంగు తకథిమి తకిట తకిట తకతా//
     తెల్లదొరలకి ఎదురు తిరిగెను //తళాంగు తకథిమి తకిట తకిట తకతా// 
     తిలక్ గారితో కలిసి నడిచెను //తళాంగు తకథిమి తకిట తకిట తకతా//
     హోమ్ రూలును ప్రారంభించెను //తళాంగు తకథిమి తకిట తకిట తకతా//

అంతకంటే ముఖ్యంగా ఈమె గొప్ప తాత్త్వికవేత్త.  నిరంతరం యోగసాధన, ధ్యానసాధన చేసుకుంటూ ఉండటమే కాక దేశదేశాల్లో ఉపన్యాసాలు ఇస్తూ ఉండేది.  చురుకైన మహిళ.  కృష్ణమూర్తిని పెంచిన తల్లి.  

రాజు :  అవునవును ఈమె నాకు తెలుసు.  స్వాతంత్య్రోద్యమంలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా హోమ్ రూల్ ఉద్యమాన్ని చేపట్టిన వనిత అని చదువుకున్నాను.  అయితే ఈమేనా కృష్ణమూర్తిగారిని పెంచిందీ!?

రాధక్క :  అవును తమ్ముడూ.  అందరి కష్టాలూ తీర్చే జగద్గురువు లోకంలోకి రాబోతున్నాడనీ, అతన్ని దివ్యజ్ఞాన సమాజం వెతికి, గుర్తించి, ప్రపంచానికి పరిచయం చేయాలని అనిబిసెంట్ నమ్మింది.  ఈ సంస్థలోనే మరో ప్రముఖవ్యక్తి లెడ్ బీటర్ అనే అతను.  ఇతను చాలా అద్భుత శక్తులు కలవాడు అని అందరూ అనుకునేవారు.  అనిబిసెంట్ తో పాటు లెడ్ బీటర్ ఇంకా ఇతర సభ్యులు - అందరూ కూడా రాబోయే జగద్గురువు కోసం చూస్తున్న తరుణం అది.

ఆ సమయంలో లెడ్ బీటర్ - చూశాడండీ కృష్ణమూర్తిని.  ఆ బంగారు తండ్రి ని చూడగానే ఎలా అనిపించదయ్యా లెడ్ బీటర్ గారికి - 
            
 విశాలమైనా ఫాలభాగము // థిమికిట థిమికిట థిమికిట థా //
 అనంతమైన నిర్మలత్వమూ // కిటథిమి కిటథిమి కిటథిమి థా //
            సున్నితమైన శరీర తత్త్వం // థిమికిట థిమికిట థిమికిట థా // 
            లోక మనోహర చిద్వీ లాసం // కిటథిమి కిటథిమి కిటథిమి థా //

రాజు : అయితే చూడ్డానికి ముద్దుగా, మురిపెంగా ఉన్నాడంటావ్...అంతేనా

రాధక్క :  అంతేనా అంటే అంతే కాదు... అసలు విషయం వినండి మరి...
 
               వెలుగులీనుతున్న కాంతి // సై // 
               వేరే లోకపు భ్రాంతి // సై //
               మెరిసిపోతున్నా తేజస్సూ కల్మషం లేని ఓజస్సూ
               // తరికిట ఝం తరిత//

బీచ్ లో తమ్ముడు నిత్యానందతో కలిసి ఆడుకుంటున్న కృష్ణమూర్తిని చూశాడు లెడ్ బీటర్. చూడగానే ఈ బాలుడు సామాన్యుడు కాదని అనుకున్నాడు.  ఇతడే లోకానికి వచ్చిన జగద్గురువు అని నిర్ణయం చేసేశాడు.  సభ్యులందరికీ ఈ బాలుని చూపించి విషయం చెప్పాడు.  

రాజు :  తర్వాతేం జరిగిందక్కా? 

రాధక్క :  ఎంతో కాలంగా ఎదురు చూసి చూసి ఇప్పటికి దొరికిన ఈ ప్రపంచగురువుని అనిబిసెంట్ తల్లిలా ఆదరించింది.  ఆధ్యాత్మిక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకుని, నారాయణయ్య గారి అనుమతితో కృష్ణమూర్తిని, నిత్యానందని దత్తత తీసుకుంది.   

జగద్గురువు అవబోతున్న కృష్ణమూర్తి లోకానికి తన బోధలని వినిపించాలంటే అతను శక్తివంతమైన, అపురూపమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలని అనిబిసెంట్ అనుకుంది.  

రాజు :  ఆధ్యాత్మిక శిక్షణ అంటే ఏమిటక్కా

రాధక్క :  పూర్వం లోకంలో ఉండే యోగుల గురించీ, వారి జీవన విధానాల గురించీ, ధ్యాన యోగ సాధనల గురించి  - ఇలా ఎన్నో తాత్త్విక విషయాల గురించి తెలియచెప్పడం తమ్ముడూ.

శిక్షణ మొదలైంది.  ఈలోపు, జగద్గురువు తన కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రత్యేక సంస్థని, ఆయన బోధనలని ప్రజలు వసతిగా కూర్చుని వినడానికి గాను  అనేక నగరాల్లో సభాప్రాంగణాలను నిర్మించాలని అనిబిసెంట్ నిర్ణయించుకుంది.  'ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ది ఈస్ట్' అనే పేరుతో ఒక సంస్థని స్థాపించింది.  

రమ :  ముందు చూపున్న స్త్రీ.  ఎంత చురుకైన మనిషి!?  మదనపల్లిలో ఆమె నిర్మించినదే కదక్కా బెసెంట్ కాలేజీ?  

రాధక్క :  అవును చెల్లీ.  'ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ది ఈస్ట్' సంస్థకి  వేల రూపాయల విరాళాలు సేకరించింది.  కృష్ణమూర్తిగారిని ఆ సంస్థకి అధిపతిని చేసింది.  

రాజు :  ఆహా, ఏమదృష్టం! వంద సంవత్సరాలకి ముందే వేల రూపాయలంటే, ఈ నాడు కోట్ల లెక్కన్నమాట!!

రమ, రాజు :  వినరా సోదరా ఈ పుణ్యమూర్తి,  కృష్ణమూర్తి గాథా  //తందాన తానా//
                    మానవ జాతికి మంచిని చెప్పిన  తత్త్వవేత్త గాథా   //తందాన తానా//
                    తరికిట ఝం తరిత!

రాధక్క :  ఇక మద్రాస్ లో థియోసాఫికల్ సొసైటీలో కృష్ణమూర్తి -        
                
                శిక్షణాపూర్తి చేసెరా //సై//
                జ్ఞానమూర్తీ  ఆయెరా //సై//
                ప్రగతి మార్గము పట్టెరా //సై//
                మార్గదర్శిగా మారెరా //సై//
                               
రాజు :  తర్వాతేమైందో తెలిసిపోయిందిగా అక్కా.  ప్రపంచానికి గొప్ప గురువు అయ్యాడు.  మదనపల్లిలో రిషీవ్యాలీ బడి స్థాపించాడు.  అంతేగా.

రాధక్క :  (నవ్వి)  అయ్యాడు తమ్ముడూ.  అయితే దివ్యజ్ఞాన సమాజం అనుకున్నట్లుగా కాదు.  ఆ సమాజాన్ని, సంస్థలనీ, ఆ వ్యక్తులనీ కాదని, తను అధిపతి గా ఉన్న సంస్థ 'ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ది ఈస్ట్' ని రద్దు చేసేసి కట్టుబట్టలతో బయటకి వచ్చేశారు.   

రాజు : ఆఁ ...  (ఆశ్చర్యపోతాడు)

రాధక్క :  అవును.  జగద్గురువు అంటే మంత్రతంత్రాలు తెలిసి ఉంటాయనీ తద్వారా ఆ అదృశ్యశక్తులు, అద్భుత శక్తులు ప్రదర్శించి తన భక్తులకు ముక్తి, మోక్షం ప్రసాదిస్తాడనీ దివ్యజ్ఞాన సమాజం నమ్ముతుంది.  ఈ ధోరణి, భావజాలం కృష్ణమూర్తికి నచ్చలేదు.

ఆయన ధ్యానసాధనలో ఒక్కో మెట్టూ ఎక్కుతున్నకొద్దీ ఈ సంస్థ వారి తీరు, విధానాలు నచ్చక విపరీతంగా బాధపడేవారు.  సరిగ్గా ఆ సమయంలోనే ఆయనకి ధ్యానంలో అనేక దివ్య అనుభూతులు కలిగాయి.  ఓర్చుకోలేనంతగా శారీరక బాధలు కూడా కలిగాయి.  అతని లోలోపల మానసిక క్షేత్రంలో తీవ్రమైన మార్పులు కలిగాయి.  

రమ :  ఎంత అదృష్టం అక్కా!  పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఆ అనుభవాలు కలుగుతాయి అంటారు.
రాజు :  అయ్యో పాపం.  శారీరక బాధలు కూడానా?  అప్పుడేమైందో త్వరగా చెప్పక్కా.

రాధక్క :  ఈ మానసిక స్థితిలో ఉన్నప్పుడే తనకి ఎంతో ఇష్టుడైన తమ్ముడు నిత్యానందకి జబ్బుచేసి మరణించాడు.

రాజు :  అయ్యో, రామా,  అయ్యొయ్యో!! // తందాన తానా //  
            ఏమిటీ కష్టాలు తండ్రీ!! // తందాన తానా//

రాధక్క :  ఇక అప్పుడు -  

               గురువులు, మంత్రాలు, పూజలు నిన్ను
               రక్షించాలేవూ  //తందా...నా  దేవనందనాన//

               సంస్థలు, ఆస్తులు, హోదాలు, పదవులు
               ఎందుకూ కొరగావు //తందా...నా  దేవనందనాన//

రమ, రాజు :  ఆ ఇంకా....

(వేగంగా)
రాధక్క :        మనసులలోన మాయలు జూడు - మారేదానికి గోడలు జూడు  

రమ, రాజు :  భళా భళా రోయ్ తమ్ముడా మేలు భళారోయ్ తందానా

రాధక్క :       గురువుల లోనా మోసము జూడు - మాటచేతలకు తేడా జూడు

రమ, రాజు :  భళా భళా రోయ్ తమ్ముడా మేలు భళారోయ్ తందానా
                   
అందరూ :  వినరా సోదరా ఈ పుణ్యమూర్తి,  కృష్ణమూర్తి గాథా  //తందాన తానా//
                   మానవ జాతికి మంచిని చెప్పిన  తత్త్వవేత్త గాథా   //తందాన తానా//
                   తరికిట ఝం తరిత!

రాధక్క :  ఇంకా ఏం చెప్పాడయ్యా అంటే - 'ఎవరికి వారు తమంతట తాము సత్యాన్ని కనుగొంటేనే విముక్తి లభిస్తుంది. అప్పుడే ఈ దేశాల విభజనలూ, జాతి విభజనలూ మాయమవుతాయి' అన్నారు.  

స్వతంత్రంగా నీలాకాశంలో పక్షిలా ఆనందంగా జీవించాలంటే గురువులు, శక్తులు, మహత్తులు, సంస్థలు మీద ఆధారపడకుండా ఎవరికి వారు స్వీయజ్ఞానాన్ని పొందితేనే సాధ్యమవుతుంది అని గ్రహించారు.  

(నిదానంగా)  ఆహాహా....
మనసుని నమ్మీ చేసే సాధన 
మార్గము చూపదూ  //తందాన తానా//

మనసు మాయమై మర్మము ఎరిగితె
ముక్తి కలుగు నీకు  //తందాన తానా//

తలపుల వల్లే కాలభావనలు 
ఏర్పడుతున్నాయీ //తందాన తానా//

రమ, రాజు : తరికిట ఝం తరితా

రమ :  అది కదా నిజమైన మోక్ష మార్గం!

రాధక్క :  అవును చెల్లీ.  ఇక అయన వెంటనే తన అభిప్రాయాన్ని సభ్యులందరికీ తెలియచేశారు.  ఎవరికీ ఆయన ధోరణి నచ్చలేదు.  అతన్ని వ్యతిరేకించారు.  అయినా సరే తను నమ్మినది ఆచరణలో పెట్టడానికే నిర్ణయించుకున్న ఆయన తన ఆధిపత్యం లో ఉన్న సంస్థ - 'ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ది ఈస్ట్' ని రద్దు చేసేశారు.  ఆ సందర్భంగా ఆయన ఇచ్చిన ఉపన్యాసం చాలా గొప్పది.  తర్వాత చదువుకోండి చెల్లీ, తమ్ముడూ. 

రమ, రాజు : వినరా సోదరా ఈ పుణ్యమూర్తి,  కృష్ణమూర్తి గాథా తందాన తానా
                   మానవ జాతికి మంచిని చెప్పిన తత్త్వవేత్త గాథా తందాన తానా
                   తరికిట ఝం తరిత!

రాజు : అలాగే అక్కా.  అనిబిసెంట్ గారు కూడా ఆయన్ని వ్యతిరేకించారా?  

రాధక్క :  మంచి ప్రశ్న తమ్ముడూ...  మొదట వ్యతిరేకించినా తర్వాత ఆయన మాటల్లో నిజాన్ని గ్రహించి ఆయన్ని ఎంతో గౌరవించింది. 

"నిజమైన విద్య అంటే ఎవరి గురించి వారు తెలుసుకోవడం తద్వారా జీవితాన్ని గురించి అర్థం చేసుకోవడం.  అప్పుడే విద్యార్థులు సమగ్ర వికాసం చెంది పరిపూర్ణ వ్యక్తులుగా ఎదుగుతారు" అని అనుకున్న ఆయన ప్రపంచ వ్యాప్తంగా పాఠశాలలను స్థాపించారు.

వాటిని ప్రకృతి ఒడిలో విశాలమైన స్థలాలలో నెలకొల్పి,  విద్యార్థులు భయరహిత వాతావరణం లో 
పెరుగుతూ స్వీయజ్ఙానంతో ఎదగాలని కోరుకున్నారు. 

రమ, రాజు  : వినరా సోదరా వీర కుమారా కృష్ణమూర్తి గాథా
                     తందాన తాన

రాధక్క : మానవులంతా ఒక్కటేననీ //తందాన తానా//
              జాతీమతాలూ వద్దు పొమ్మనీ //తందాన తానా//
             
              సత్యం కోసం అన్వేషిస్తే //తందాన తానా//
              ఎవరికి వారికె దొరుకుతుందనీ //తందాన తానా//
             
              కాలమనేదే లేదు పొమ్మనీ //తందాన తానా//
              ఉన్నదున్నట్టే చూడాలనీ //తందాన తానా//
              
              దేశదేశాల ఖండాంతరాల మానవులందరి క్షేమం కోసం
              హితవు పలికాడు, వెలుగై నిలిచాడు - తరికట ఝం తరిత

ఈ విధంగా తన ఆఖరి శ్వాస విడిచేవరకూ దేశ దేశాలు తిరిగి ఈ విషయాలని గురించి పదే పదే నొక్కి చెప్తూ అనేక ఉపన్యాసాలు ఇచ్చారు. 

రమ, రాజు : వినరా సోదరా ఈ పుణ్యమూర్తి,  కృష్ణమూర్తి గాథా తందాన తానా
                   మానవ జాతికి మంచిని చెప్పిన తత్త్వవేత్త గాథా తందాన తానా తరికిట ఝం తరిత!

రాజు :  ఇంతకంటే మంచి పని ఇంకేం ఉంటుంది అక్కా?  నేటి విద్యార్థులే రేపటి మంచి పౌరులు అవుతారు కదా!?   అక్కా,  ఆయన ఎప్పుడు మరణించారు?  

రాధక్క :  జిడ్డు కృష్ణమూర్తి ఫిబ్రవరి 17, 1986 న అమెరికాలో లో మరణించారు.  తను జీవించినంత కాలం ఆయన మిత్రులూ, అభిమానులూ ఆయన బాగోగులు చూసుకున్నారు.  

కోటానుకోట్ల విలువ చేసే ఆస్తిపాస్తులని, వేల మంది అనుయాయులని త్యజించి 'సత్యానికి ఇది మార్గం కాదు' అంటూ ఒంటరిగా నిలబడిన అతన్ని చూసి అనేకమంది ఆశ్చర్యపోయారు.  అయితేనేం ఆయన ఇప్పుడు నిజమైన "ప్రపంచ గురువు - The World Teacher”.

ప్రకృతిని ముఖ్యంగా మానవ నైజాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వారికున్న అన్ని బాధలనించీ విముక్తి కలిగించాలని తపన పడిన ఏకైక వ్యక్తి.  ఆధునిక యుగపు తత్త్వవేత్త.  జీవన్ముక్తుడు.  ధార్మిక జీవనానికి మార్గదర్శి, పరిపూర్ణ మానవతామూర్తి జిడ్డు కృష్ణమూర్తి.

అందరు :                  మంగళంబగు నిత్యంబు మంగళంబగు
                                  ఆదర్శమూర్తి కృష్ణమూర్తికి మంగళంబగు
                                  మంగళం జయ మంగళం - తరికిట తరికిట ఝం తరిత
                                  మంగళం జయ మంగళం - మంగళం జయ మంగళం

                                                        ***