14, అక్టోబర్ 2014, మంగళవారం

గోదారొడ్డున రెల్లుగడ్డితో పాకొకటి వెయ్యాలి...ఆ పాకకి ఆనంద కుటీరమని పేరొకటి పెట్టాలి...పాపికొండలమీంచి పాక్కుంటూ పైకొచ్చే

నిన్న పోలవరం లో అచ్చం అలాంటి ఆశ్రమం నన్ను అహ్వానించింది.
నవంబర్ నుండి అది మా ట్రస్ట్ కార్యకలాపాలకు కేంద్రం కాబోతోంది.
అచ్చం నేను కలగన్నట్లే గోదావరి ఒడ్డు...ఇసుక తిన్నెలు...ఆకుపచ్చటి కొండలు...విస్తారంగా విరగబూసిన రెల్లు పూలు.భలే ఆనందం గా ఉంది.)
గోదారొడ్డున రెల్లుగడ్డితో పాకొకటి వెయ్యాలి...ఆ పాకకి ఆనంద కుటీరమని పేరొకటి పెట్టాలి...పాపికొండలమీంచి పాక్కుంటూ పైకొచ్చే
చందమామనో,సూర్యమామనో చూస్తూ కూర్చోవాలి.....ఆకుపచ్చటి కొండల మీంచి జల జల పారే జలపాతంలో నిలువెల్లా స్నానించాలి....
రెల్లుపూల పానుపుపై జల్లు జల్లుగా ఎవరో చల్లినారమ్మా వెన్నెల చల్లినారమ్మా అంటూ హాయిగా పాడుకోవాలి.....బంగారు వర్ణంలో మెరిసిపోయే ఇసుకతిన్నెల మీద ఎదురెదురుగా కూర్చుని పిచ్చుక గూళ్ళు కట్టుకోవాలి.....అమావాశ్యనాటి రాత్రి ఆకాశం నిండా వెలిగిపోయే నక్షత్రాల సొగసును తనివితీరా చూసెయ్యాలి.....నిండుపున్నమి రాత్రి వెన్నెల్లో పాపిడి కొండల మధ్య పడవ ప్రయాణం చెయ్యాలి......
నేస్తమా...నా ప్రాణ నేస్తమా...నా ఆనంద కుటీరం లో నీ రాక కోసం ఎదురుచూస్తున్నాను.ఎవరి పనుల్లో వాళ్ళం బిజినే....ఎవరి జీవితానికి వాళ్ళం బాధ్యులమే.
అయితేనేం.....మనిద్దరం కలగంటున్న గోదారొడ్డున ఆనంద కుటీరం....అబ్బ!!! ఎంత సమ్మోహనపరుస్తుందో!!!
నువ్వూ నేనూ కలిసి పంచుకునే కబుర్ల జలపాతం లో తన్మయమవ్వాలని.....
గోదారొడ్డున మన ఆనంద కుటీరం ఆత్రుతగా ఎదురు చూస్తోంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి