“సీతా-స్వయంవర-సత్కథ”
(ఫేస్ బుక్ వారి సౌజన్యంతో - నిరుడు “ప్రచురింపబడిన” హరికథ)
'వాగ్దానం' సినిమా-లోని 'సీతా-స్వయంవర-సత్కథను' (హరికథ) వ్రాసినది విప్లవకవి, నాస్తికుడు అయిన శ్రీ- 'శ్రీశ్రీ' అంటే చాలామందికి వింతగా తోచవచ్చు. అంతే కాదు ఆ సినిమా లో ఒక్కొక్క కవికి ఒక్కొక్క పాటను వ్రాసే అవకాశాన్ని ఇచ్చిన నిర్మాత, దర్శకుడు ఎవరంటే - 'ఆత్రేయ!' దానితో ఆయన నష్టపోయినా అందులోని పాటలు 'నా కంటిపాపలో నిలిచిపోరా! (దాశరథి)” వంటివి ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాయి!
(సంగీతం పెండ్యాల)
ఈ హరికథ పాట రసజ్ఞులకు ఎంతో వీనులవిందు చేసింది. . హరికథలోనైతే ఘంటసాలవారి గొంతు (అన్నట్లు ఈ పాటను తెరపైన పాడినది 'రేలంగి’, వయొలిన్ సహకారం ‘సూర్యకాంతం’!) నవరసాలను గుప్పించింది. ఇందులో కవి చేసిన ప్రయోగం ఏమిటంటే - కొంత తన దిట్టతనాన్ని చూపిస్తూనే కొన్ని మంచి పద్యాలను కూడా వెతుక్కొని హరికథలో చొప్పించడం.
ఇక, కొంచెం వివరంగా ఈ హరికథను గమనించుదాం.
(ఈ తరంవాళ్ళకు ఉపయోగించేందుకై కొన్ని మాటలకు అర్థాలను ఇవ్వక తప్పడంలేదు!)
1) ఎత్తుకోవడం (కానడ రాగంలో) - గణపతి ప్రార్థన
'శ్రీనగజాతనయం సహృదయం చింతయామి సదయం; త్రిజగన్మహోదయమ్'
(మూడులోకాలకెల్లా శ్రేష్ఠుడు, దయాపూర్ణుడు, పార్వతీపుత్రుడు అయిన వినాయకుడిని స్మరిస్తాను.)
2) ఆ తరువాత 'శ్రీరామకథను' 'చెప్పిన కథ చెప్పినచోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను' అనే చమత్కారం; గాత్రసౌలభ్యంకోసం పాలూ, మిరియాలూ ...
3) ఆ సభకు విచ్చేసిన వీరాధివీరులలో అందరినీ ఆకర్షించిన ఒకే ఒక దివ్యసుందరమూర్తి -
'రఘురాముడు - రమణీయ వినీలఘనశ్యాముడు (అందమన నల్లనిమబ్బువంటి రంగు కలిగినవాడు)
వాడు; నెలరేడు (చంద్రుడే); సరిజోడు (ఇతడితో సరితూగగలిగినవాడు); మొనగాడు;
వాని కనులు మగమీలన్ (మగచేపలను - 'మీనులు +లు = మీలు' ) ఏలురా (మించిన అందం కలిగినవి); వాని నగవు రతనాల జాలురా (రత్నాలను తలపింపజేస్తుంది - రత్నాలలాంటి పలువరుస); వాని-జూచి మగవారలైన మైమరచి (మగవాళ్ళు కూడా తమను తామే మరచిపోయి - 'పుంసామోహనరూపం' అంటారు దీనిని); మరుల్-గొనెడు (మోహించే) మరో మరుడు (మన్మథుడు); మనోహరుడు (మనసులను దొంగిలించేవాడు) (ఇదంతా ‘శంకరాభరణం’ రాగంలో)
4) ఆ ప్రకారంబుగా .. (ఇక్కడ ఒక విషయం - వాల్మీకి రామాయణం ప్రకారం రాముడు శివధనుస్సును నిండు సభలో ఎక్కుపెట్టలేదు! కాని, దక్షిణాదిన, ఉత్తరాదిన కూడా తులసీదాస్ వంటివారి కల్పన ఇది. వాళ్ళ కథ ప్రకారం - సీతారాములది love at first sight!)
5) సీతాదేవి అంత:పుర గవాక్షమునుండి (కిటికీలోనుండి) వీక్షించినదై ఈ విధంగా అనుకొన్నది (మోహనరాగంలో) -
“ఎంత సొగసుగాడే! మనసింతలోనె దోచినాడె;
మోము కలువరేడే (సాక్షాత్తూ చంద్రుడే); నా నోముఫలము వీడే!
శ్యామలాభిరాముని (నల్లనిరంగుతో చక్కగా రంజింపజేస్తున్న ఇతడిని ) చూడగ, నా మది వివశమాయెనే (అదుపు తప్పింది!)”
6) అక్కడ స్వయంవరసభామంటపంలో (ధన్యాసి) జనకుడేమన్నాడంటే -
“అనియెనిట్లు ఓ యనఘులార!(పుణ్యచరితులారా!) నా అనుగుపుత్రి సీత; వినయాదికసద్గుణవ్రాత (వినయము మొ/ సద్గుణాలసమూహంతో కూడినది); ముఖ-విజిత-లలిత-జలజాత (లేతతామరపూవును తనముఖ-సౌందర్యంకారణంగా తలదన్నినది);
ముక్కంటి వింటి (శివుడి విల్లును) నెక్కిట (గొప్పగా) దాకిన (ఎక్కుపెట్టిన) ఎక్కటిజోదును (సాటిలేని - అసహాయశూరుడైన యోధుడిని) నేడు మక్కువమీరగ (ఇష్టం ఎక్కువయేటట్లు) మాల వైచి (దండను వేసి) పెండ్లాడు .. “
ఆ విల్లును చూచి ఎక్కడివాళ్ళు అక్కడే చల్లబడిపోయారట!
అక్కడకు వచ్చిన రావణుడు కూడా 'ఈ చాపమునెత్తుట పాపము' అని ఊరకుండిపోయాడట!
అప్పుడు -
7) ఇనకుల-తిలకుడు (సూర్యవంశములో శ్రేష్ఠుడు)
- నిలకడగల క్రొక్కారుమెరుపు వలె నిల్చి (కదలకుండా - స్థిరంగా ఉన్న) క్రొత్త కారుమబ్బు (నీలమేఘం) (మెరుపు చంచలంగా క్షణకాలమే ఉంటుంది, ఈయన స్థైర్యవంతుడు కదా!)
- తన గురువగు విశ్వామిత్రుని ఆశీర్వాదము తలదాల్చి,
- సదమల మదగజగమనముతోడ (ఈ శబ్దాలంకారపు సొంపును గమనించండి)
మెరసిపోతున్న మదపుటేనుగు నడకవంటి ఠీవితో (వాల్మీకి రాముడి నడకను ఏనుగు నడకతో పోల్చాడు - 'గజవిక్రాంతగమన, మదమాతంగగామీ' అనే ప్రయోగాలలో - అందుకనేనేమో త్యాగరాజుగారు కూడా 'సామజవరగమన!' అని పాడాడు.)
స్వయంవరవేదిక చెంత;
మదనవిరోధి-శరాసనమును (మన్మదుడిని కాల్చివేసిన శివుడి విల్లును)
తన కరమున పూనినయంత - చేతిలో 'అలా' పట్టుకోగానే
“ఫెళ్ళుమనె విల్లు; గంటలు ఘల్లుమనె; గు-
భిల్లుమనె గుండె నృపులకు; ఝల్లుమనియె
జానకీదేహ మొక్క నిమేషమందె
నయము; భయము జయమును వి-స్మయము గదుర!”
(ఆ విల్లు విరిగినప్పుడు గొప్పతనం (విరగడంలో); భయం (మిగిలిన రాజుల గుండెల్లో);
జయసూచన (గంటలు మ్రోగడంలో); ఆశ్చర్యం (జానకీదేహం ఝల్లుమనడంలో) - ఇవన్నీ ఏకకాలంలోనే కలిగాయట! (వరుసగా చెప్పుకొచ్చాడు కాబట్టి క్రమాలంకారం, కేదారగౌళరాగంలో పాడబడింది!)
(ఈ పద్యం కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రిగారిది!)
ఆ పిమ్మట (కల్యాణీరాగంలో)-
భూతలనాథుడు రాముడు
ప్రీతుండై పెండ్లియాడె పృథుగుణమణిసం
ఘాతన్, భాగ్యోపేతన్,
సీతన్, ముఖకాంతివిజిత-సితఖద్యోతన్ \\
(భూపతియైన రాముడు); (పృథుగుణమణిసంఘాతన్ - దొడ్దగుణాలనే మణులతో కూడినట్టిది; భాగ్యోపేతన్ = అదృష్టంతో కూడినది (లక్ష్మీదేవి) ; ముఖకాంతివిజిత-సితఖద్యోతన్ - తన ముఖకాంతివలన గెలువబడిన తెల్లని చంద్రుడిని కలిగినది, అయిన సీతను ; ప్రీతుండై = ఎంతో ఇష్టపడి ; పెండ్లియాడె)
(ఈ పద్యంలోని అంత్యప్రాసలను గమనించారా? - తెలుగులో అలాంటి ప్రయోగాలను పుష్కలంగా చేసిన సహజకవి ఎవరంటే - తెలుగువారు గర్వించవలసిన పోతనామాత్యుడు (భాగవతం 9వ స్కంధంలో రామాయణకథ సంగ్రహంగా వస్తుంది. అక్కడిది ఈ పద్యం!)
మరి శ్రీశ్రీ అంటే ఆషామాషీ కవి కాదు! - ఆయన మేనల్లుడు ఆరుద్ర అయితే 'సమగ్ర- ఆంధ్రసాహిత్యాన్నే’ మనకు అందించాడు.
(ఆయనను కూడా ఎందుకు పేర్కొంటున్నానంటే, తనూ కమ్మ్యూనిస్టు భావాలు కలిగినవాడైనా 'అందాలరాముడు, ఇందీవరశ్యాముడు .. (ఉయ్యాలా-జంపాలా); 'శ్రీరామనామాలు శతకోటీ, ఒక్కొక్క పేరే బహు తీపీ (మీనా)' వంటి గొప్ప పాటలను రచించాడు!
('తరించారు' అంటే వాళ్ళ ఆత్మలు అంగీకరిస్తాయో లేదో?) - మనకి మాత్రం తరగని సంపదగా వీటిని ఇచ్చివెళ్ళారు.
సీతారాముల కల్యాణం అయింది కదా!
పోతనగారి మరొక పద్యాన్ని (9వ స్కంధంలోనిదే) తలచుకొని మురిసి, ఎవరిదారిని వాళ్ళు వెళ్దాం.
ఉ/ నల్లనివాడు పద్మనయనమ్ములవాడు; మహాశుగమ్ములున్
విల్లును దాల్చువాడు, కడు విప్పగు వక్షమువాడు, మేలు పై
జల్లెడువాడు, నిక్కిన భుజంబులవాడు, యశంబు దిక్కులన్
జల్లెడువాడు నైన రఘుసత్తముడిచ్చుత మాకభీష్టముల్ \\
మంగలం కోసలేంద్రాయ - మహనీయగుణాత్మనే \
చక్రవర్తీతనూజాయ - సార్వభౌమాయ మంగళం \\
సర్వే జనా: సుఖినో భవన్తు /