25, జులై 2020, శనివారం
🌺పద్యానికి పట్టాభిషేకం🌺 పద్యాలను తప్పక వినండి"లవకుశ"భారతీయ చరిత్రలో నిత్యజీవన స్రవంతిలా మమేకమైన ఒక దివ్య చరితమ్. అలాగే సినిమా చరిత్రలో సి.పుల్లయ్యగారి లవకుశ చిత్రం కూడా అజరామరం... ఈ చిత్రానికి ఘంటసాల గారి సంగీతం సుధా స్రోతస్విని. ఉత్తర రామాయణ మాధుర్యాన్ని, మహాత్మ్యాన్ని తెలిపే దృశ్యకావ్యం"లవకుశ"అయితే లవకుశ చిత్ర మాధుర్యాన్ని మరిచిపోకుండా,మరువనియ్యకుండా ఈనాటికీ ఆ చిత్రం లోని పాటలు,పద్యాలు ప్రతి తరాన్ని,ప్రతి వర్గాన్ని ఎంత సొంతం చేసుకున్నాయో తెలియజేయటానికే ఈ పోస్ట్... "ఏకోరసః కరుణ ఏవ"అన్న భావనతో కరుణరసానికి అగ్రతాంబూలమిచ్చిన మహాకవి భవభూతి సంస్కృతంలో రచించిన నాటకం"ఉత్తర రామచరితమ్"ఎంతో కరుణరసాభరితమైన ఈ ఉత్తర రామచరితను తెనుగుసేత చేసిన వారు ఇద్దరు. ఒకరు తిక్కన.మరొకరు కంకంటి పాపరాజు...ఉత్తర రామచరిత ప్రబంధ కార్యకర్త... ఇందులో సీతమ్మవారి ప్రతి కన్నీటి చుక్కలోని అంతరార్ధానికి అక్షరరూపాన్ని ఇచ్చిన మహనీయుడు కంకంటి పాపారాజు.. దీన్నే ఆధారంగా తీసుకొని లవకుశ చిత్రాన్ని ఆబాలగోపాలాన్ని అలరించే విధంగా నిర్మించి తెలుగు సినిమా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేలా చేసారు నిర్మాత శంకర రెడ్డి... మరెవరూ రాయలేనంత హృద్యంగా, అందరికీ అర్థమయ్యే భాషలో పాపరాజు తీర్చిదిద్దిన ఉత్తర రామాయణాన్ని రమణీయ దృశ్యకావ్యంగా ‘లవకుశ’లో సందర్భానికి తగినట్లు ఆయన పద్యాల్నే యథాతథంగా వినియోగించుకున్నారు. 'ఇంతకుఁ బూనివచ్చి వచియింపక పోదునె విన్ముతల్లి...’, ‘రామస్వామి పదాంబుజంబు లెద నారాధింతునేనిన్ సదా...’, ‘రంగారు బంగారు చెంగావులు ధరించు శృంగారవతి...’’ లాంటి పాపరాజు పద్యాలు వెండితెర ద్యశ్యాలకు ప్రాణంపోశాయి. ‘‘పాపరాజుగారి సీతమ్మ నిజంగా కరుణా ప్రబంధమే. బమ్మెర పోతరాజుగారంత ఆవేశంతోనూ పాపరాజుగారు రచన చేస్తారు. వారి పద్యాలు వెంటనే హృదయానికి హత్తుకుంటాయి’’ అన్నారు ఆరుద్ర. ‘‘మృదుపదవిన్యాసం, అర్థసందర్భం, రస సంపద వంటి కవితా గుణాలు ఉన్న ఉత్తమకవిత్వమ’’ని కంకంటి కవితావైభవాన్ని ప్రస్తుతించారు ‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్యశాస్త్రి. సీతారాములిద్దరూ ధర్మప్రతిష్ఠాపన కోసం నెరిపిన ఆదర్శ దాంపత్యాన్ని, లోకకల్యాణం కోసం అనుభవించిన వియోగాన్ని ఆర్ద్రంగా అక్షరీకరించి పాఠకుల హృదయాలను కరిగించిన కవి కంకంటి పాపరాజు.. ఇక ఈ సినిమాలోని పద్యాలు లవకుశ పద్యాలుగానేప్రసిద్ధిచెందినయి.. *సేకరణ*లవకుశ పద్యాలు అంటే లవకుశులు పాడినవి కావుఁగాని లవకుశ పేరుఁగల సచ్చిత్రరాజ నిక్షిప్త పద్యాలని నా భావన. నేను విన్నవీ, వింటూన్నవీ, నా మనస్సును హత్తుకున్నవీ ఈ పద్యరత్నాలు. పైగా ఘంటసాల గారి అసదృశగాత్ర సుధారసాన్విత పద్యాధారస్వాదన నిరుపమాన భాగ్యమే కదా.మ. నవరత్నోజ్జ్వల కాంతివంతమిది ధన్యంబైన సూర్యాన్వయోధ్భవ రాజన్యులు మున్నుదాల్చి గరిమన్ పాలించిరీ భూమి సంస్తవనీయంబగు నీ కిరీటము శిరోధార్యంబు నీ కీయెడన్భువి పాలింపు ప్రజాను రంజకముగా మోదంబుతో రాఘవా(అన్వయము = వంశము)తా. వశిష్ఠుడు రాముణ్ణి సంహాసనారూఢునిఁ జేసి పల్కిన వాక్కులివి. "నవరత్న ప్రభాజితమైన ఈ కిరీటము పూర్వము సూర్వవంశీయ రాజులు ధరించి రాజ్యాన్ని ఎంతో గొప్పగా పాలించారు. ఈ ఘనమైన కిరీటము నీవు ధరింపఁదగినది. ధరించి ఇధ్ధరను మోదముతో ప్రజామోదగా పాలింపవయ్యా రఘువంశీయుడా"ఉ. ఏమహనీయ సాధ్వి జగదేక పవిత్రత బ్రహ్మ రుద్ర సుత్రాములు హవ్యవాహనుడు ప్రస్తుతిఁ జేసిరొ అట్టి తల్లి సీతా మహిళాశిరోమణిని దారుణ కానలవీధి కంపగానీ మది ఎట్టులొప్పె ఎట నేర్చితివీ కఠినత్వ మగ్రజా(సుత్రాముడు = ఇంద్రుడు, హవ్యవాహనుడు = అగ్ని)రఘువంశ కీర్తిప్రతిష్ఠలకు కళంకముఁ దెచ్చు నపవాదు ప్రజలలో వ్యాప్తము కాకమున్నె రాజ్యపరిత్యజమో, కళత్రపరిత్యాగమో చేయవలనని సంకల్పించియున్నవాడు శ్రీరాముడు. పట్టముఁ గట్టించుకొనుటకు తమ్ములెవ్వరూ ముందుకు రారయ్యె, భార్యావియోగమే మార్గమయ్యె. సీతను భగీరథీ నదతీరము వద్ద విడిచిరమ్మని లక్ష్మణుఁ నాజ్ఞాపించెను. ఆ క్షణమున లక్ష్మణుని ఆక్రోశమే ఈ పద్యముఉ. ఇంతకుఁ బూనివచ్చి వచియింపక పోదునె తల్లి దుశ్చింతులు దైత్యుచేఁబడిన సీతనుఁ గ్రమ్మఱ ఏలుచున్నవాడెంత విమోహి రాముఁడని ఎగ్గులు వల్కిన నాలకించి భూకాంతుడు నిందఁజెంది నిను కానలలోపల డించి రమ్మనెన్గర్భవతియైన సీతను, ఏమఱచియున్న అబలను అడవుల పాలుఁజేయు దుస్సహ కార్యము రామప్రియానుజుని పైబడినది. అడవిలో కీడు శంకించుచూ కారణమడిగిన సీతకు లక్ష్మణుని బదులు పద్యమిది. "ఇలాంటి ఘోరకృత్యము తలపెట్టి నిమిత్తము నీకు చెప్పకుండా ఉండగలనా? దురాలోచనా పరులైన రాక్షసుల వద్ద యుండిన సీతను తిరిగి స్వీకరించిని మోహితుడు రాముడను దుష్టనిందను విని, అపవాదు కలుగునని, అయోధ్యాధిపతి నిన్ను అడవులలో దించి రమ్మనెను"చ. ప్రతిదినమేనుఁ దొల్దొలుత పాదములంటి నమస్కరించి నీఅతులితమైన దీవనలనంది చరింతు తదీయ భాగ్యమేగతియెడమాయె నింకెపుడుఁ గాంతు భవత్పదపద్మముల్ నమశ్శతములు సేతునమ్మ కడసారి గ్రహింపుము జానకీ సతీతా. "అనుదినము నీ పాదములకు దండము పెట్టుకుని నీ ఆశీస్సుల తీసుకొని వెడలు వాడను, ఇక అట్టి భాగ్యము నాకు దూరమవుతున్నది కావున, చివరి సారి శతనమస్కారములు స్వీకరించుమమ్మా, సీతమ్మా" అని బాధపడు లక్ష్మణుడు.ఒక్క మాటు కిష్కింధకాండ గుర్తుతెచ్చుకోండి. ఆకాశము నుండి పూర్వము ఒక స్త్రీ పడవేసిన నగల మూటను రామసౌమిత్రుల వద్దకు తీసుకువస్తారు వానరులు. ఆ అబల సీతయై యుండవచ్చునని ఊహించిన రాముని మనస్సులో పెల్లుబికిన బాధవల్ల కన్నులు చెమర్చినాయి. నగలని చూడలేక, ప్రక్కనే ఉన్న లక్ష్మయ్య చేతఁబెట్టి గుర్తించమన్నాడు. నగలను పరికించి చూచి,నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురేత్వభి జానామి నిత్యమ్ పాదాభివందనాత్అని బదులు చెప్పాడు ఆ సౌశీల్య గుణగరిష్ఠుడు. పై పద్యం వింటూంటే ఈ శ్లోకం గుర్తుకు రాదూ?అదృష్ట వశాన వాల్మీకి ఆశ్రమఛాయలకు చేరుతుంది జానకి. అత్యంతాదరణానురక్తులతో ఆశ్రమవాసులు ఆమెకు స్వాగతము పలుకుతారు. అయోనిజ దురదృష్టానికి చింత కలిగినా, ఆమెకు ఆతిధ్యమిచ్చే భాగ్యము తమదైనందుకు ఆశ్రమవాసుల ఆనందానికి అవధులు లేవు. వాల్మీకి స్వాగత వచనా లివి.చ. ఇదెమన ఆశ్రమంబు ఇచట నీవు వశింపుము లోకపావనీసదమల వృత్తినీకు పరిచర్యలు సేయుదు రీ తపశ్వినుల్ముదముగ రామనామము తపోవనమెల్ల ప్రతిధ్వనించు నీపదములు సోకి మా యునికి పావనమైఁ జెలువొందు నమ్మరో... చదువుతుంటేనే కళ్ళు చెమర్చటం లేదు... ఇటువంటి అద్భుతమైన పద్యాలను ఘంటసాల గారి గుండె లోతుల్లోని ఆవేదనను, ఆర్ద్రతను,ఆప్యాయతను ఇలా ఎన్నో ఫీలింగ్స్ ను ఆ గళం ఎలా పలికిందో మనందరికీ ఇప్పటికీ జ్ఞాపకమేకదా... ఆయన దారిలోనే ఏకలవ్య శిష్యుడైన ఆయన భక్తుడు ఈ తరపు ఓ గ్రామీణ యువకుడు ఎంత చక్కగా ఘంటసాల వారికి స్వరార్చన చేసాడో... ఆ యువకుడిని ప్రత్యేకంగా అభినందిస్తూ...అతని పేరు శ్రీనివాస్...ఇవిగో పద్యాలు...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి