19, ఆగస్టు 2015, బుధవారం

కుల సమాజం...............చదువుకోకముందు కాకరకాయ అన్నవాడు,చదువుకున్న తరువాత కీకరకాయ అన్నాడట!అలావుంది నేటి పరిస్థితి.కులాల మధ్య సమన్వయం పూర్తిగా లోపించింది.మా కులం గొప్ప అంటే,మా కులం గొప్ప అని కొట్టుకుంటున్నారు.ఒక 50 సంవత్సరాలకు పూర్వం ఈ కులాల కుమ్ములాటలు లేవు.ఎవరి కులం మీద వారికి అభిమానం ఉండవచ్చు.అది దురభిమానం కాకూడదు.అర్హుడు కాని తమ కులం వాడిని అందలం ఎక్కించి,అర్హుడైన ఇతర కులంవాడిని అణగతొక్కటం అనేది పెద్ద అవినీతి.ప్రస్తుతం దేశంలో నడుస్తున్న చరిత్ర ఇది.ఈ కులదురభిమానులలో విద్యావంతులే ఎక్కువగా ఉండటం ఆశ్చర్య పరుస్తుంది.విశ్వవిద్యాలయాలలోని ప్రొఫెసర్లలో కూడా ఇది దారుణంగా ఉన్నట్టు తెలిసి విస్తుపోయాను.కులానికొక రాజకీయ పార్టీ,కులానికొక కుహనా నాయకుడు!ఆ రాజకీయ నాయకుడిని గుర్తించకపోతే,ఆకులం వారినందరినీ అవమానించినట్లుగా అతను ప్రచారం చేసుకుంటున్నాడు.నిజానికి ఏ కులానికీ ఎవరూ ప్రతినిదులు కారు .గత అన్నిఎన్నికలలో నమోదైన పోలింగ్ సరళిని పరిశీలిస్తే సామాన్య ప్రజలు ఈ 'కులపతులను' ఎక్కడా ఆదరించిన దాఖలాలు లేవు.కులందాక ఎందుకు-మతానికి కూడా ప్రజలు పట్టం కట్టలేదు.హిందూ మతాన్ని దత్తత తీసుకున్నట్లుగా మాట్లాడే బిజెపికి ఈ దేశంలోని అత్యధిక మతస్తులైన హిందువులు మొండిచెయ్యి చూపించి తమ గొప్పతనాన్ని, మత సహనాన్ని ఎన్నో సార్లు చాటుకున్నారు.చూడబోతే,శ్రీ రాముడు కూడా సెక్యులర్ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నవాడనిపిస్తుంది.కాకపొతే, ఎన్నోదెబ్బలు తిని కఠిన శిక్షను అనుభవించిన రామదాసుకు శ్రీ రాముడు కనపడలేదు.ఆ దర్శన భాగ్యం తానీషాకు కలిగింది. కారణాన్ని విశ్లేషిస్తే, రామదాసు ప్రభుత్వ ధనాన్ని(ప్రజలకోసం వినియోగించవలసిన ధనాన్ని)దుర్వినియోగ పరచి శ్రీ రాముడికి గుడి కట్టించి,తన బాధ్యతను పూర్తిగా విస్మరించాడు.తానీషా,తన కర్తవ్యనిర్వహణలో భాగంగా రామదాసును ఖైదీగా బంధించాడు.అలా,తన కర్తవ్యాన్ని అమలు పరచటం వల్లనే అతనికి రామదర్శనం అయ్యింది.కర్తవ్యాన్ని విస్మరించిన రామదాసుకు ఆ దివ్య దర్శన భాగ్యం కలుగలేదు.'శ్రీ రామదాసు' సినిమాలో నాటకీయత కోసం దర్శకుడు మరొక విధంగా చూపించి ఉండవచ్చు.భగవంతుని దృష్టిలో కులంలేదు, మతంలేదని పై సంఘటన తెలియచేస్తుంది.ఎన్ని రధయాత్రలు చేసినా రాముడు బిజెపి వారిని కూడా ఏ మాత్రం కరుణించలేదు. బహుశా:ఇప్పుడు వారికి 'రామతత్వం'అర్ధమయ్యి, రాముడి ఊసు కూడా ఎత్తటంలేదు.ఇంక కులాల సంగతికొస్తే, కులానికొక దేవుడిని కూడా సృష్టించుకున్నారు.ఈ దేశపు ప్రధమ సత్యాగ్రహి అయిన శ్రీ వాసవీ మాతను వైశ్యులకు పరిమితం చేసారు.సంస్కర్త అయిన వీరబ్రహ్మేంద్రస్వామిని విశ్వబ్రాహ్మణులకు పరిమితం చేసారు.తేటతెలుగు కవి,హేతువాది అయిన వేమనను రెడ్డి కులస్తులకు పరిమితం చేసారు.గీతాచార్యుడు,జగద్గురువు అయిన శ్రీ కృష్ణుడు మా కులస్తుడని యాదవులు చాటుకుంటున్నారు. లాలూప్రసాద్ కొంతకాలం అధికారంలో ఉన్నప్పుడు,బీహార్ లో ఆయన పెద్ద పెద్ద కటౌట్లు కృష్ణుడి రూపంలో వెలిసాయి.శ్రీ కృష్ణుడికీ ఆయనకు అసలు పోలికే లేదు.కృష్ణుడు వెన్నతింటే,ఈ మహానుభావుడు గడ్డికరిచాడు.ఎక్కడో,ఉత్తర ప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి అయితే, గుంటూరులో ఆయనకు అభినందనలతో పెద్ద పెద్ద బానర్లను కట్టి, ఆయన కులస్తులు ఉత్సవాలు చేసారు. మొన్ననిన్నటి దాక కృష్ణదేవరాయలు మావాడే అని ప్రచారం చేసుకున్నారు కాపు,బలిజ నేతలు.ఇప్పుడు ఆయన కులం మీద పెద్ద వివాదం చెలరేగుతుంది.యాదవులు ఆయన తమ కులస్తుడనే వాదనను తెరపైకి తెచ్చారు.కర్ణాటక ప్రభువు,ఆంద్రభోజుణ్ణి కూడా ఈ 'కులకలకలం' వదిలి పెట్టటంలేదు. నవయుగచక్రవర్తి,కవికోకిల శ్రీ జాషువాను కుల  సమాజంబ్రతికినంతకాలం కులదురహంకారులు మానసింగా హింసించి,విశ్వకవిని ఒక 'దళిత'కవిగా చేసారు.ప్రభుత్వాలకు ఇవి పట్టవు.నాలుగు ఓట్లు వస్తాయంటే,వాళ్ళను పట్టించుకుంటారు. లేకపోతే వాళ్ళ ముఖం కూడా చూడరు. గాయత్రి సేవాసమితి అంటే బ్రాహ్మణ సంఘం,వాసవీ యూత్ అంటే వైశ్య యువ జనసంఘం,వేమన యూత్ అంటే రెడ్డి కులసంఘం, కాకతీయ యూత్ అంటే కమ్మజన సేవాసంఘం..ఇలా ప్రతి కులంవారు వారి వారి అస్తిత్వాన్ని చాటుకోవటానికి కులాలమధ్య సం'కుల' సమరాన్ని సృష్టిస్తున్నారు.వీరు చేసే సామాజిక కార్యక్రమాలు ఏమీ ఉండవు.వాళ్ళ కులపు సినీ హీరో సినిమా విడుదలైన రోజు వారికి పెద్ద పండుగ!అంతకు కాకపొతే, కార్తీకమాసంలో వనభోజనాలకు విహారంగా వెళ్లి వస్తారు.నాకు తెలిసినంత వరకు వీరు చేస్తున్న ఒకే ఒక సామాజిక సేవ వివాహ సంబంధాల కోసం Marriage Links ను ఏర్పాటు చెయ్యటం. స్థూలంగా చెప్పాలంటే ఇదీ కుల సంఘాలు చేస్తున్న సామాజికసేవ.ఇక కులనిర్మూలన సంఘాలని కూడా ఉన్నసంగతి మీకు తెలిసిందే.వీరు చేసే సామాజిక కార్యక్రమాలు కూడా పెద్దగా ఏమీ లేవు.కుల నిర్మూలన కోసం వీరు చేసిన,చేస్తున్న నిర్మాణాత్మకమైన పనులు పెద్దగా లేకపోవటం విచారకరం.మరీ విడ్డూరం ఏమిటంటే,దసరా పండుగ రోజున ఒక టీవీ ఛానెల్ లో ఒక కులనిర్మూలన సంఘ నాయకుడు కొత్త వాదాన్ని వినిపించాడు. రామాయణంలోని తాటకి, శూర్పణక,రావణుడు....వీరందరూ దళిత ప్రజలని ,ద్రవిడ ప్రతినిధులని-అందుచేత వాళ్ళను ఘోరంగా చిత్రీకరించారని ఆయన వాదన.ఈ దేశానికి నాగరికత నేర్పిన ఆదికావ్యం వ్రాసిన వాల్మీక మహర్షి ఒక ఆటవికుడనే సంగతే ఆయన మరచిపోయాడు.రాను రాను,ఈ కులగజ్జి దేశమంతా(దేహమంతా) పూర్తిగా వ్యాపించి దేశం,దేహం కలుషితం కాకుండా చూసుకోవటానికి మనమందరమూ సమాయత్తం కావాలి,కంకణం కట్టుకోవాలి.ఎవరో వచ్చి ఈ కుళ్ళిపోయిన దేహాన్ని పరిశుభ్రపరచరు. మనదేహాన్ని,అలాగే దేశాన్ని మనమే పరిశుభ్రపరుచుకోవాలి!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి