28, మార్చి 2015, శనివారం


సీతారాములు ఒక్కసారిగా దేవుళ్ళై పోలేదు.!
ఆకాశం నుంచి భూమి మీదకు దిగలేదు.!
వున్నట్టుండి వూడిపడ లేదు
వరాలిచ్చేస్తాం కోరికల్తీర్చేస్తాం అని చెప్పలేదు.!
కొలువులు తీరి పూజలందుకో లేదు.!  

రాముడంటే నాలుగు తలలూ, పది చేతులూ వున్న దేవుడు కాడు.
ఒక మానవుడు.!
వొట్టి సాధారణ మానవుడు.!
ఒక మామూలు మనిషి.!
ఒక యువరాజు.!
దేశంలోని అనేక వందలమంది యువరాజులలో...
ఇంకో యువరాజు.!
అంతే.!!

ఆమె
కేవలం ఒక మహారాజు పుత్రిక.!
ఇంకో యువరాణి అంతే !
అటువంటి సర్వసాధారణులైన యువరాజులూ యువరాణులూ అనేకులు ఈనాడూ వున్నారు ఆనాడూ వున్నారు.

వారు
ఒట్లు పెట్టుకున్నారు.!
బాసలు చేసుకున్నారు.!
యోగి పుంగవులూ కారు.! 
స్థిత ప్రజ్ఞులూ కారు.!
బాధొస్తే ఏడ్చారు.!
ముల్లు గుచ్చుకుంటే
నొప్పితో నడిచారు. కుంటుతూ తిరిగారు.
ఆగ్రహమొస్తే అరుచుకున్నారు
బాధపడితే తిట్టుకున్నారు. వళ్ళుమండితే కొట్టుకున్నారు.  
మొత్తమ్మీద వారు ఈ నేల మీద రక్తమాంసాలతో నడిచిన
మామూలు మనుషులు.!
సాధారణ మానవులు.!
ఇదొక పార్శ్వం.!!
అంతా చారిత్రక సత్యం!!

మరొక పార్శ్వం -  
అయినా వారు -
అనేక వేల సంవత్సరాలుగా
అందరికీ అనుసరణీయులయ్యారు.! ఎందరికో ఆరాధనీయులయ్యారు.!!
ఇదీ ఇంకో చారిత్రక సత్యం.!!
ఎందుకని?
ఎందుకంటె -
- వారు ఎంత ఎదిగినా అంత ఒదిగి వున్నవారు.!
- గురువుల ముందు వినయంతో వొంగి నిలిచిన వారు.!
- అహాన్నివదిలి ఇహాన్ని సొంతం చేసుకున్నవారు.!
- బ్రహ్మములోని బ్రహ్మాండ సౌందర్యాన్నంతా హృదయభాండంలో ప్రతిష్టించుకుని
  ఎదుటి వారిలో వీక్షించి పొంగి పరవశించినవారు.
- ద్వైతంలో అద్వైతాన్నీ, అనేకత్వంలో ఏకత్వాన్ని దర్శించినవారు.
- ఆదిదంపతులై అనుభవించిన వారు.!
- మాట కోసం సుఖసంతోషాన్నింటినీ వొదిలి కదిలిన వారు.
- తమ సర్వస్వాన్నీ త్యజించిన వారు.!
- పద్నాలుగు సంవత్సరాలు పదవులతో కాక, పాదరక్షలతో ప్రజల హృదయాలను పాలించినవారు.
- రాజ్యాన్ని రక్షించినవారు.!

- అసలు రహస్యమెక్కడుందంటే,
- ధర్మం కోసం తాము శూన్యమై ముందుకు నడిచే వారు, పూర్ణమై వెలుస్తారు. సంపూర్ణులై నిలుస్తారు.
- అట్టివారి పాదరక్షలను కూడా, పద్నాలుగు సంవత్సరాలు కాదు పదివేల సంవత్సరాలైనా పూజామందిరంలో పెట్టుకుంటారు.
- అందుకే అ నామధేయం సర్వులకూ శిరోధార్యమైంది.!
- అందుకే ఆ చరిత్ర నిత్యపారాయణ గ్రంధమైంది.!
- అందుకే నిస్సంశయంగా వారిని అనుసరించిన వారు
- కాములై... రాములై... అనురాగ సోములై..,
- ఆదిదంపతులై.., ఆచంద్రతారార్కం వెలుగొందుతారు.!
- సీతారాములై పూజలందుకుంటారు. !!...................... - డా. గౌతమ్ కశ్యప్)


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి