3, మార్చి 2015, మంగళవారం

ఇప్పుడిప్పుడే నిద్దుర వదలి
అడుగులొ అడుగును వేస్తున్నా
తప్పటడుగులతొ తడబడుతూ
ముందుకు ముందుకు పోతున్నా

భావావేశం ముంచుతు వుంటే
భావావేశం ముంచుతు వుంటే
కణకణ మండే మండుటెండలో
నిప్పులు చెరిగే వడగాలుల్లో
హాయిగ నిల్చుని ఆహ్లాదంగా
ఆడుతు పాడుతు తడబడుతూ
నేను అడుగులను వేస్తుంటే
అబ్బుర పడుతూ అనంతవిశ్వం
ఎవ్వడీతడని ఆగింది. !
సంధ్య సుందరిని తొందర చేసి
నా వద్దకు పంపింది
చిక్కని పరిమళ సుగంధాలను
చల్లనిగాలికి పూసింది
సంజ రంగుల చీరచెంగులతొ
వింజామరలను వీచింది
చిలుకలు గువ్వలు
కిలకిల కువకువ రాగాలన్నిటితో
పక్షులు అన్నీ ముక్త కంఠమున
ఆశీర్వచనం చేస్తుంటే
చెట్లు చేమలే దీవిస్తూ
పుష్పాక్షతలను వేస్తుంటే
ఆనందంలో ైమెమరచి
అడుగులొ అడుగును వేస్తున్నా
తప్పటడుగులతొ తడబడుతూ
ముందుకు ముందుకు పోతున్నా

కటిక చీకటి లొ ఒంటరిలో
ఎముకలు కొరికే చలిగాలుల్లో
ఆవేశాల జ్వాలల్లో
వేదన కీలల నేనుంటే
ఆశ్చర్యంతో అనంతవిశ్వం
ఆదరణతొ నను చూసింది
మబ్బుల మూతను పక్కకు తీసి
వెన్నెల నింపిన చంద్ర భాండమును
ఈ నిశీధిలో పోసింది. 
మబ్బుల మూతను పక్కకు తీసి
వెన్నెల నింపిన చంద్ర భాండమును
ఈ నిశీధిలో పోసింది.
ఇక వెన్నెల చినుకుల వర్షంలో
కుంభవృష్టిలో స్నానమాడుతూ
ఆనందంలో తడబ డుతూ
నేను అడుగులను వేస్తుంటే
సాగర సుందరి సంభ్రమంగా
నా రాకకు స్పందించి
శరీరమంతా పులకింతలతో
హోరుహోరునా పాడింది
చలచల్లని అలల చేతులతో
పాల నురుగుల దోసిలితో
తన చల్లని అలల చేతులతో
పాల నురుగుల దోసిలితో
ఇసుక తిన్నెలా పళ్ళెంలో
నా పాదాలను కడిగింది
నన్ను పునీతుని చేసింది.


అడుగు అడుగునా అణువు అణువునా
అనంత విశ్వం రూపాలన్నీ
నాకు తోడుగా వస్తుంటే
మిలమిల తళతళ మెరుస్తువున్న
రత్నరాసులు మణులు వజ్రములు
ఆకసమంతా వెదజల్లీ
వినీల గగనమె వేదికచేసి
సృష్టి సర్వమును ఆహ్వానించి
విశ్వసుందరే నాట్యమాడుతూ
నా కోసం దిగి వచ్చింది
స్వాగతగీతం పాడింది

పాదపద్మముల పద సవ్వడీనీ 
అనంత విశ్వం అందెల రవళిని 
పాదపద్మముల పద సవ్వడీనీ 
అనంత విశ్వం అందెల రవళిని  
తాళ లయలుగా చేసికొనీ 
గళాన్ని పలికిస్తున్నా...
స్వరాన్ని సృష్టిస్తున్నా...
ఆనందంలో మైమరచీ
అడుగులో అడుగును వేస్తున్నా...
తప్పటడుగులతో తడబడుతూ....
ముందుకు ముందుకు పోతున్నా...!!                - గౌతమ్ కశ్యప్ 
ఈ దేహంపై సర్వహక్కులూ వున్న ఆ అనంతవిశ్వమే తల్లై, చెల్లై, భార్యై, బంధువై, నా చుట్టూ చేరి నన్ను ఆడించి, అలరించి, ఆదరించి.. ఆదేశించి.. ఈ దేహ రూపం లోంచి చెప్పిస్తోంది..!!
మనం ఒంటరిగా వున్నామని అనుకుంటాం ఎవరూ మనం చెప్పేది అర్థం చేసుకోవడం లేదని వ్యధ చెందుతాం..కానీ మనం నిజంగా ఒంటరిగా అరక్షణమైనా వున్నామా ? అయినా ఒంటరిగా వున్నామని అనుకుంటాం. ! నిజానికి ఈ ప్రకృతీలో వున్నఈ గాలీ, ఈ చెట్లూ ఈ అడవీ, ఈ సెలయేర్లూ, ఈ ప్రకృతీ నిలబడినంత తోడుగా, అంత నిర్మలంగా అంత సత్యంగా.. అంత దగ్గరగా, అంత ఆత్మీయంగా ఎవరైనా వుంటారా..! వుండలేరు కదా...ఇంత అండవున్నా మనమెందుకో ఒంటరివాళ్లమనుకుంటూ వుంటాం !


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి