22, మార్చి 2015, ఆదివారం

విశ్వప్రేమ ని నేర్పే విపశ్యన

           నాగార్జున సాగర్‌ వెళ్ళే దారిలో, గుర్రంగూడ గ్రామంలో ఈ 

 విపశ్యన సెంటర్‌ వుంది.

జూలై 19 వ తేదీన 1.30కి 

 విపశ్యన సెంటర్‌ చేరాను. 2.15 కంతా అప్లికేషన్‌

నింపడం అయ్యింది. అప్లికేషన్‌ నింపాక పద్మజ అనే ఆవిడ దగ్గరికి (టీచర్‌)
వెళ్ళమన్నారు.  అన్ని నియమాలకు కట్టుబడి వుంటారా? రూల్స్‌ మరియు
రెగ్యులేషన్‌లు చదివారా? అని అడిగారు. అన్నీ చదివాను. మీ వైబ్‌సెట్‌లు
కూడా చూసాను అని చెప్పాను. మీరు జర్నలిస్ట్‌ని రాసారు కదా! ఏ పేపర్‌ అంటే
భూమిక పత్రిక అని, స్త్రీల కోసం ఒక హెల్ప్‌లైన్‌ నడుపుతానని చెప్పాను.
మీరు రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో చేసేవారు కదా అని అడిగారు. నేను
ఆశ్చర్యపోయి మీకెలా తెలుసు అన్నా, తర్వాత చెబుతాను అన్నారు. ఎలా తెలుసో ఆ
తర్వాత చెప్పారులెండి.
నాకు సింగిల్‌ రూమ్‌ కావాలి. అంటే 117 ఇచ్చారు. సామాను మోసుకుని రూమ్‌
కొచ్చాను. రూమ్‌ చక్కగా నీట్‌గా, క్లీన్‌గా వుంది. సిమెంటుతో కట్టిన
మంచం, పరుపు. స్టోర్‌కెళ్ళి దుప్పట్లు తెచ్చుకుని  మంచంమీద పరిచాను. నేను
తెచ్చుకున్న దుప్పట్లు కూడా పరుచుకుని ఈ రూమ్‌ని ప్రేమించడం
మొదలుపెట్టాను. రూమ్‌ ముందు చెట్లు పెద్ద రావి చెట్టు. ఆకులు గలగలమంటూ
ఒకటే సంగీతం. దానికి తోడు లెక్కలేవన్నీ పిట్టల వైవిధ్య స్వరాలు.
రామచిలకలు, పిచ్చుకలు ఒకటే పాడుతున్నాయి.
వస్తూ వస్తూ కారులోనే లంచ్‌ తిన్నాను. రూమ్‌ సర్దాక బయటకొచ్చాను ఒకావిడ
నిలబడి వుంది. నవ్వగానే వచ్చి నా రూమ్‌ ముందు కూర్చుంది. ఆవిడకి ఇది మూడో
సారట. విపాసన గురించి చెప్పింది. అన్నం తిన్నారా అని అడిగితే ఇక్కడ
తినలేదు. పన్నెండింటికి ఓ జొన్న రొట్టె తిన్నాను అన్నాను. అయ్యోపదండి.
సాయంత్రం ఏమీ వుండదు. అంటూ డైనింగ్‌ హాల్‌కి తీసుకెళ్ళి తనే కంచంలో
అన్నం, చపాతి, పప్పు, మజ్జిగ పట్టుకొచ్చింది. ఆకుకూర, పెరుగు
అయిపోయినట్టుంది అంది నాకు చపాతి వద్దు కొంచం అన్నం చాలు అని పప్పు అన్నం
తిని మజ్జిగ తాగాను. పప్పు, అన్నం తిని మజ్జిగ తాగాను. పప్పు చాలా రుచిగా
వుంది. 5గంటలకు హాలు దగ్గరికి రమ్మన్నారు. అప్పటి వరకు మాట్లాడవచ్చు.
సెల్‌ఫోన్‌, డబ్బు వాళ్ళ దగ్గర డిపాజిట్‌ చేసేసాను. ఆవరణంతా చెట్లతో
హాయిగా వుంది. వాతావరణం బావుంది. పెద్ద లోటస్‌పాండ్‌లో పసుపుపచ్చ కలువలు
పూసాయి. మూడు రౌండ్లు నడిచి ఒక చెట్టు దగ్గర కూర్చున్నాను. సత్యవతిగారూ!
అంటూ పిలుపు. సర్వీస్‌ కమీషన్‌ కొలీగ్‌.  ఇద్దరం మాట్లాడుతూ మరో రౌండు
నడిచాం. నాలుగింటికి నా రూమ్‌ కొచ్చాను.
ఇక్కడికి రాగానే పెద్ద బరువేదో వదిలినట్టుంది. చేతిలో పైసా లేకుండా
హాయిగా పది రోజులు వుండొచ్చు. రూమ్‌కి తాళం వెయ్యక్కరలేని హాయి. దేనినీ
పట్టించుకోనక్కరలేదు. దేనినీ మొయ్యక్కర్లేలేదు. బ్యాగ్‌,సెల్‌ఫోన్‌
బాదరబందీలేదు. రూమ్‌ తలుపు దగ్గరేసి అలా చెట్లలోకి నడుచుకుంటూ
వెళ్ళిపోవడం అబ్బ! నిజంగా ఎంత సుఖంగా వుందో! పది రోజులపాటు దొరికే ఈ
స్వేచ్చ.  శృంఖాలాలు, గొలుసులు లేని స్వేచ్ఛని అనుభవించడం నిజంగా గ్రేట్‌
ప్రివలేజ్‌. ఎలాంటి మతపరమైన బోధనలు, కీర్తనలు లేకపోవడం కేవలం కేవలం
ప్రకృతితో సంబంధం వుండడం. మనతో మనకి మాత్రమే సంబంధం వుండడం ఫీలింగ్‌
గుడ్‌.
రేపటి నుండి ఎలా వుంటుందో తెలియదు.  ఆ అనుభవం ఎలా వుంటుందో చూడాలి.
 నాకిష్టమైన చెట్లు, పిట్టలు వుండనే వున్నాయి. వుండలేకపోవడం ఏమిటి?
దూరంగా ఎక్కడినుండో నెమలి కేక కూడా వినిపిస్తోంది. కోయిల బృందగానం వుండనే
వుంది.
 ఆరుగంటల నుండి ఏక్టివిటీ మొదలైంది.ఆరింటికి ఉప్మా, టీ, ఇచ్చారు. అదే
రాత్రి. భోజనం ఆ తర్వాత మెడిటేషన్‌ మొదలైంది. విపాశన ప్రారంభించిన గురువు
సత్యన్నారాయణ గోయంకాగారి ఆడియో ఉపన్యాసంతో తొలి మెడిటేషన్‌. పాటించాల్సిన
నియమాలు. అంతకు ముందు దమ్మసేవకులు (పాతసాధకులు) నియమాల గురించి వివరిస్తూ
ఆవరణలో వున్న వివిధ మెడిటేషన్‌ సెంటర్లు చూపించారు. ఆ తర్వాత ఐడికార్డు
ఇచ్చారు. రాత్రి తొమ్మిది వరకు మెడిటేషన్‌ నడిచింది. బాసింపట్టులో
అంతసేపు కూర్చోవడం కష్టమైంది. గుండె బరువెక్కినట్లనిపించింది. నొప్పిగా
కూడా అనిపించింది. దాన్ని పట్టించుకోకుండా మెడిటేషన్‌ చేసాను. రాత్రి
9.30 కి లైటార్పేసి పడుకున్నాను. చాలాసేపు నిద్రపట్టలేదు.  దీని '0' డే
అంటారు.
 బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితం కనుగొన్న మెడిటేషన్‌ని ఇలా ఇపుడు
నేర్చుకోవడం బావుంది. మనం తీసుకునే శ్వాస మీదే ధ్యాస పెట్టడం, పరధ్యాస
లేకుండా వుండడం ఇదే మొదటి రెండు రోజులు.శ్వాస ఎటు వెళుతుంది. ఎలా
వెళుతోంది చూడ్డమే పని వేరే పనేమీ లేదు.

మొదటిరోజు.

ఉదయం నాలుగింటికి గంట మోగింది. ఠక్కున మెలకువ వచ్చింది. బ్రస్‌చేసి,
మెడిటేషన్‌ హాలుకెళ్ళిపోయాను. 4.30కి తొలిసెషన్‌ మొదలైంది. శ్వాసమీద
ధ్యాస అంతే. శ్వాస ఎలా వెళ్ళుతోంది. ఎలా బయటకు వస్తోంది గమనిస్తూ మనసును
ముక్కు పుటాల మీదే కేంద్రీకరించమని గోయంకా గారు హిందీలోను, ఇంగ్లీషులోను,
వేరొకాయన తెలుగులోను చెబుతూంటారు. మనసు శ్వాస మీద నిలవదు. అది గమనించి
మనసును లాక్కొచ్చి శ్వాస మీద నిలపమంటారు. ఓ క్షణం వుంటుంది. రెండోక్షణం
పారిపోతోంది. వరంగల్‌ పోతుంది. హైదారాబాద్‌ పోతుంది. అమెరికా పోతుంది.
అండమాన్‌ పోతుంది. ఏమిటేమిటో ఆలోచనలు వస్తుంటాయి. చిత్రమైన
ఆలోచనలొస్తుంటాయి. ఎవరితోనో మాట్లాడుతుంటాం. మళ్ళీ గుర్తొచ్చి మనస్సును
లాక్కొచ్చి ముక్కు మీద కూర్చొబెడతాం. కొంచెం సేపు కూర్చుంటుంది. మనసు అలా
నిలకడగా వున్నపుడు మనం శ్వాసని చూడగలుగుతాం. మనసు షికార్లు చేస్తునప్రుడు
శ్వాస మీద ధ్యాస వుండదు. ఆలోచనలని ఆపడం మన తరం కాదు. గమ్మత్తుగా మన
ఆలోచనలకనుగుణంగా మన శ్వాసలో తేడా తెలుస్తుంది. ఎవరి మీదో కోపం, ఎప్పటిదో!
వాళ్ళ పని ఎలా పట్టాలి? ఏదో పని మిగిలిపోయింది. దానిని ఎపుడు పూర్తి
చెయ్యాలి. ప్రియమైన వ్యక్తి ఆలోచనలోకి వస్తే... అప్రియమైనవాళ్ళు వస్తే..
శ్వాసలో తేడా గమనించొచ్చు. తనకు నచ్చని అంశం గుర్తొస్తే మనసు
ఉద్రిక్తమౌతుంది. నచ్చినది గుర్తొస్తే మనసు సేదతీరుతుంది. ఈ తేడాలు
శ్వాసలో తెలుస్తాయి. ఉద్రేకపడినప్పుడు శ్వాస బరువుగా, బలంగా వస్తుంది.
అంటే నెగిటివ్‌ విషయాలు ఆలోచనల్లోకి వచ్చినపుడు శ్వాస బరువెక్కుతుంది.
గాలి ధారాళంగా లోపలికి వెళ్ళలేకపోతుంది. మనసు తేలికగా వున్నపుడు గాలి
మాములుగా, తేలికగా వెళ్ళిపోతుంది. అలాగే మనసు ఎప్పుడూ గతంలోకి,
భవిష్యత్తులోకి చక్కర్లు కొడుతూంటుంది. ఇప్పటిమీద నిలవదు. నిన్నేం
జరిగింది? ఎందుకు జరిగింది. ఎలా జరిగింది లాంటి జరిగిపోయినవాటిమీద, రేపేం
జరగబోతోంది? ఏం కాబోతోందిలాంటి వాటి చుట్టే తిరుగుతుంటుంది. దీనివల్ల
ఆందోళన పెరిగి ప్రస్తుతాన్ని ఆస్వాదించలేకపోతాం. ఇది తొలిరోజు గోయంకా
గారి ఉపన్యాససారాంశం.
ఉదయం 4.30 నుండి మధ్యలో కొంత విరామంతో రాత్రి 9.00దాకా సాగింది
మెడిటేషన్‌. సాయంత్రం ఎనిమిదిన్నరకి గోయంకా గారి వీడియో ప్రసంగం విన్నాం.
ఆయన్ని చూసాం టివిలో. సాయంత్రం ఐదింటికి మరమరాలు, అరటిపండు, టీ ఇచ్చారు.
ఇదే డిన్నర్‌. తొమ్మిదింటి దాకా మెడిటేషన్‌లో వున్నాం కానీ ఆకలి
వెయ్యలేదు. మధ్యాహ్నం అన్నం, చపాతీలు, కమ్మటి పప్పు తియ్యటి పెరుగు, వేడి
వేడి సొరకాయ, బెండకాయ కూరతో మంచి భోజనం. ఉదయం ఆరింటికి వేడి వేడి పొంగలి,
పల్లీ చట్ని, అరటిపండు, టీ.
తొమ్మిదింటికి రూమ్‌కొచ్చిన వెంటనే పడుకుండి పోయాను. వెంటనే
నిద్రపట్టేసింది. ఈ రోజు నేను నేర్చుకున్న ముఖ్యమైన అంశం. భోజనాన్ని
ప్రేమగా, ఇష్టంగా, గౌరవంగా తినడం.ఏం తింటున్నామో తెలుసుకుంటూ తినడం.
ఆకలిని అర్ధం చేసుకోగలగడం. నచ్చని అంశం. బుద్ధుడిని భగవానుడనడం. శ్వాసమీద
ధ్యాస సాధిస్తే పరమపదం పొందుతారని చెప్పడం. పరమపదం అంటే ఏమిటి? సెంటర్‌లో
ఎక్కడా బుద్ధ విగ్రహంగానీ, గోయంకా గారి ఫోటోలు కానీ లేవు. ఇది బావుంది.

రెండోరోజు.

నాలుగింటికి గంట మోగింది. వెంటనే లేచాను.  సెంటర్‌వేపు నడిచాను. చాలా
నిశ్శద్ధంగా వున్నాయి పరిసరాలు. చల్లటిగాలి. రావిఆకుల గలగలు. మాతో పాటే
కొన్ని పక్షులు లేచాయి. కోయిలమ్మ గొంతు సవరించుకుంటూ కూయడం
మొదలుపెట్టింది. రకరకాల పిట్టల సంగీతం వింటూ సెంటర్‌దాకా నడిచాను. రోజూ
ఇరవై సార్లన్నా ఇదంతా నడుస్తాను.ఆ నిశ్శబ్దవేళ 4.30కి మెడిటేషన్‌
మొదలైంది. నిన్న మొదలైన ప్రశ్నలవల్ల ఒక వ్యతిరేక భావం రావడంతో
మెడిటేేషన్‌ కష్టమైంది. పదే పదే అవే ప్రశ్నలు వేధించడంతో ఇంక చెయ్యలేనేమో
అనుకున్నాను ''జీవనకళను నేర్చుకోవడమే విపాసన'' అని గోయంకా గారు చెప్పడంతో
ఆ రెండు ప్రశ్నల్ని పక్కన పెట్టాను. సింపుల్‌గా, అర్థవంతంగా, ఆనందంగా
జీవించడానికే ఈ కళ అని ఆయన రెండోరోజు చెప్పారు. బుద్ధుడిని భగవాన్‌
అనలేదుకాని స్వర్గం, నరకం, పాపం, పుణ్యం అంటూ బుద్ధుడు వ్యతిరేకించిన
వాటిని ప్రస్తావించారు. ఈ రెండు రోజుల సాధన విపాశనకి ఉపయోగపడుతుంది
అన్నారు. అంటే విపాసన వేరే వుందని అర్థమైంది. బహుశ రేపటి నుండి
మొదలవుతుందోమో! 4.30 నుండి మధ్యలలో కొంత విరామమిస్తూ 9.00 దాకా సాగింది
అంత సేపు కూర్చోవడం చాలా కష్టంగా వుంది మోకాళ్ళు పాదాలు విపరీతమైన
నొప్పి. ఐదు నిమిషాలు ఒకే ఫోజులో కూర్చోలేక ఇబ్బంది పడుతున్నాను.
కావాలంటే కుర్చీ మీద కూర్చోవచ్చు. దిండులేసుకుని కిందే కూర్చున్నాను.
ఆరింటికి ఉప్మా, బత్తాయి పండు ఇచ్చారు. ఎనిమిది దాకా రెస్ట్‌. అపుడే
స్నానం, రూమ్‌ శుభ్రం చేసుకోవడం, బట్టలుతుక్కోవడం. లాండ్రి సౌకర్యం
వుంది. నేను తొలిరోజు మాత్రమే లాండ్రికిచ్చాను. తర్వాత నేనే ఉతుక్కోవడం
మొదలుపెట్టాను. పనులన్నీ స్వయంగా చేసుకోవడం చాలా బావుంది. మధ్నాహ్నం మంచి
భోజనం. కేసరి స్వీట్‌. ఎ్కవ తినడంవల్ల మధ్యాహ్నం సరిగా కూర్చోలేకపోయాను.
ఇలా చెయ్యకూడదు.
 సాయంత్రం ఆరింటికి పేలాలు, బత్తాయిపండు, టీ. అదే డిన్నరు. పేలాలు తిని
బత్తాయి రూమ్‌కి తెచ్చాను. రాత్రికి ఆకలేస్తుందేమోననే భయం వదలడం లేదు.
నిజానికి ఆకలి వెయ్యడం లేదు. తొమ్మిదింటికి రూమ్‌కొచ్చి బత్తాయి తిని,
స్నానం చేసి నిద్రపోయాను, మూడు రోజులుగా నిశ్శబ్దమే. మాటలు లేవు.
ఒకరివేపు ఒకరు చూడ్డంలేదు. తలదించుకుని ఎవరి ధోరణిలో వాళ్ళు. మూడు
రోజుల్లో కేవలం మూడు మాటలు, అదీ టీచర్‌తో, దమ్మ సేవకులతో
మాట్లాడాను.గోయంకా గారి ఉపన్యాసంలో కొంచెం నవ్వాను అంతే. మా గుంపులో
పెద్దవాళ్ళు, మధ్యవయస్కులు, పిల్లలు దాదాపు డెబైమంది. పన్నెండు మంది
క్రిస్టియన్‌ నన్స్‌ వున్నారు. అందరూ చాలా శ్రద్ధగా చేస్తున్నారు.
తొలిరోజు వాళ్ళతో మాట్లాడాను. మీరు ఎందుకు వచ్చారు అంటే డిఫరెంట్‌
ఎక్స్‌పీరియన్స్‌ కోసం అన్నారు. నేనూ అందుకే వచ్చానని చెప్పాను.

 మూడో రోజు

నాలుగింటికి బెల్‌. నాలుగున్నర నుండి 6 వరకు మెడిటేషన్‌. ఆరింటికి
ఇడ్లీలు పల్లీ చట్నీ. బత్తాయి పండు. పండురూమ్‌కు తెచ్చాను. ఎనిమిది నుండి
11 వరకు కంటిన్యూయస్‌గా మెడిటేషన్‌. కూర్చోవడం చాలా కష్టం. అయినా
కూర్చుంటాం. కూర్చోలేక బయటకొస్తే రెండు నిమిషాల్లో దమ్మ సేవకురాలు వచ్చి
నమస్కరించి లోపలికి పదమంటుంది. సౌంజ్ఞలే. మాటలుండవు. పదకొండుకి వేడి వేడి
భోజనం. మితంగా తినడం మంచిది. లేకపోతే కూర్చోలేం.  ఒకటినుండి ఆరింటివరకు
నిరంతరధ్యానం. మధ్యలో టీచర్‌తో మాట్లాడొచ్చు ''మీరు మధ్యలో లేవకండి.
కళ్ళు తెరవకండి'' అని సలహా ఇచ్చారు. శ్వాస మీద ధ్యాసపెట్టండి.
నొప్పులుండవు '' అని కూడా అన్నారు. నాకు విపరీతంగా చెమట పడుతోంది. అంటే
చాలా మంచిది కదా! చెమట పట్టాలంటే ఎంత కష్టపడాలి. మీకు ఫ్రీ స్టీమ్‌ బాత్‌
అవుతోంది కదా  అంటూ నవ్వారు''.  నేను కూడా హాయిగా నవ్వాను. ఆవిడ సలహా
పాటించాను. మధ్యలో లేవలేదు.కళ్ళు తెరవలేదు.నొప్పుల మీద దృష్టిిపోయింది.
శ్వాస మీదే ధ్యాస పెట్టాను. 7 గం. నుండి తొమ్మిదిదాక మళ్ళీ ధ్యానం.
గోయంకా గారి ఉపన్యాసం. రేపు విపశ్యన నేర్పుతామని చెబుతూ చాలా సరదాగా
మాట్లాడారు. చాలా నవ్వాను. బుద్ధుడి అష్టాంగ మార్గాల గురించి చెప్పారు.
విపాశన తర్వాత ఎలాంటి మార్పులొస్తాయో ప్రతి క్షణాన్ని ఎరుకతో ఎలా
ఆస్వాదిస్తామో ప్రతిదీ నిరంతరం ఎలా మార్పు చెందుతుందో, శరీరంలోని కణాలు
చస్తూ పుడుతూ ఎలా వుంటాయో మంచి సరదా ఉదాహరణతో చెప్పారు. ప్రతిదీ
అశాశ్వతమని, మార్పు మాత్రమే శాస్వతమని అర్థం చేసుకోవాలని చెప్పింది విని
నేను ఆశ్చర్చపడ్డాను.''మార్పు మాత్రమే శాశ్వతం'' అని ఒక సందర్భంలో నేను
రాసిన కవిత గుర్తొంచ్చింది. ఒక వేదనామయ సమయంలో నేను ఆ కవిత రాసాను.
భ్రమలకు లోనవ్వకుండా అన్నింటినీ తీక్షణంగా చూడాలని, అప్పటికి ఏది సత్యమో
అదే సత్యమని, గతానికి భవిష్యత్తుకు లంకెపెట్టి మనుషులు బాధపడతారని
వాస్తవంలో ఎప్పుడూ జీవించరని ఆయన చెప్పింది నేను చాలాకాలంగా
ఆచరిస్తున్నదే. గతం గొప్పది భవిష్యత్తు ఏమవుతుందో అనే ఆందోళనతోనే మనిషి
బతుకుతుంటాడు. నాకెప్పుడూ ఈ ఆందోళన లేదు. నేను ప్రస్తుతంలోనే జీవిస్తాను.
తొమ్మిదింటికి రూమ్‌కొస్తే ఒకావిడ రూమ్‌ ముందు పాము ముడుచుకుని పడుకుంది.
అందరూ బేజారయ్యారు. మౌనం వీడి మాటల్లో పడ్డారు. ఈ లోపు దమ్మసేవిక వచ్చి
చాలా నిబ్బరంగా పాముని చీపురుతో తొలగించేసి అందరినీ రూమ్‌లోకి పంపింది.
పాము పెద్దదికాదు. చిన్న కట్లపాముపిల్ల. అయినా జనాలకి పామంటే భయమేకదా!.
చిన్న పాము పిల్ల అందరి మౌనాన్ని కాసేపు భగ్నం చేసింది. రూమ్‌లోపలి
కొచ్చి ఉదయం, సాయంత్రం సేకరించిన బత్తాయిలు తిని, స్నానం చేసి
మంచమెక్కాను. చాలాసేపు నిద్రపట్టలేదు. రేపు విపాశన నేర్పుతారట., అంటే
ఏమిటోనని చాలాసేపు ఆలోచించాను. మెల్లగా నిద్రపట్టింది. ఏవేవో కలలు.
ఒంటిగంటకు ఏదో చప్పుడై మెలుకువవచ్చింది. మంచినీళ్ళు తాగి మళ్ళీ
పడుకున్నాను. సాయంత్రం మెడిటేషన్‌ అయ్యాకా వొళ్ళంతా తేలిక పడుతున్న
ఫీలింగ్‌ వచ్చి నవ్వొచ్చింది.

నాలుగోరోజు

ఈ రోజు  చాలా ముఖ్యమైంది. రోజూలాగానే 4 గంటలకి లేవడం, 4.30కి
మెడికేషన్‌లో కూర్చోవడం. 4.30కి ప్రకృతి ఎంత ప్రశాంతంగా, సమ్మోహనంగా
వుంటుందో! చల్లటిగాలి అడక్కుండానే ప్రేమగా వొళ్ళంతా తాకుతుంది. ఆ
నిశ్శబ్దం మనసును ఎంత హాయి పరుస్తుందో! మధ్యాహ్నం విపాశన
క్లాసువుంటుందని, రెండు గంటలు ఎవ్వరూ హాల్లోంచి బయటకెళ్ళకూడదని, ఆసనం
మీంచి లేవకూడదని చెప్పారు. మూడు రోజులపాటు శ్వాస మీద ధ్యాసతో మెడిటేషన్‌
నడిచింది. 3.15కి గోయంకాగారి ఆడియో ఉపన్యాసం మొదలైంది. విపాశన గురించి.
కళ్ళు మూసుకుని తలమీది ఆయువు పట్టును చూడమన్నారు. తర్వాత ముఖం కళ్ళు,
చెవులు, ముక్కు, బుగ్గలు, నోరు పెదవులు, మెడ కుడి చెయ్యి మొత్తం ఎడమ
చెయ్యి మొత్తం, గుండె, పొట్ట, నాభి, కుడికాలు మొత్తం, ఎడమ కాలు మొత్తం,
వీపు మొత్తం మీద శ్వాసను నడుపుతూ చూడమన్నారు. ఏం సంవేదన/సెన్‌సేషన్‌
జరుగుతుందో గమనించమన్నారు. శిరస్సు నుంచి పాదాలదాకా ఎలాంటి సెన్సేషన్‌
ఏర్పడుతున్నాయో సాక్షిలాగా గమనించమన్నారు. ప్రతీదీ అశాశ్వతం. పుడుతుంది,
నశిస్తుంది. నిత్యం మారుతుంది అనే ఎరుకతో గమనించమన్నారు. తలనించి
పాదాలకొచ్చేసరికి ఎన్నో నొప్పులు పుడతాయి. నశిస్తాయి. చెమట పడుతుంది.
ఆరిపోతుంది. దురద పుడుతుంది. పోతుంది. శరీరం మొత్తంలో నిరంతరం ఎన్నో
సంవేదనలు పుడుతుంటాయి. పోతుంటాయ్‌. మళ్ళీ పుడుతుంటాయ్‌. పోతుంటాయ్‌.
వాటిని నిర్వేదంగా, నిరపేక్షంగా, సాక్షిలాగా గమనించమంటారు. ఏదీ నిత్యం
కాదు. ఏదీ శాశ్వతం కాదు అనే దృష్టిలో సంవేదనలని చూడమని చెప్పారు. అలాగే
ఎక్కువ నొప్పిని ద్వేషించవద్దని, తక్కువ నొప్పిని ప్రేమించవద్దని, రెండూ
శాశ్వతం కాదని తలనించి పాదాలవరకు జరిగే ప్రయాణంలో కనబడే సంవేదనలన్నీ
శాశ్వతం కాదనే ఎరుకతో చూడమని చెప్పారు. విపాశన అంటే మార్పు.  శరీరంలోను,
ప్రకృతిలోను నిరంతర మార్పులు జరుగుతుంటాయి. ఏదీ శాశ్వతం కాదు అనే ఎరుకే
విపాశన అని నాకు అర్థమైంది. క్లాసయ్యాక బయటికొచ్చాక ఓ బెంచీ మీద చాలా
సేపు అలాగే కూర్చుండిపోయాను. నా ఆలోచనా విధానం విపాశనకు చాలా దగ్గరగా
వుందనిపించింది. కళ్ళల్లో ఎందుకో నీళ్ళొచ్చాయి. ఎవరితోనైనా మాట్లాడితే
బావుండనిపించింది.  సెన్స్‌ ఈజ్‌ డీటాచిమెంట్‌ ఇన్‌ విపాశన. '' మార్పు
మాత్రమే శాశ్వతం. మరేదీ కాదు'' అంటూ నేను రాసుకున్న కవిత పదే పదే
గుర్తొచ్చింది. ఎంతో అందంగా పూసే బ్రహ్మకమలం ఎంత అశాశ్వతమో
గుర్తొచ్చింది. ఎర్రటి చిగురాకు, ఆకుపచ్చగా మారి, పసుపు రంగుకు మారి
రాలిపోవడం గుర్తొచ్చింది. అందమైన గులాబీ నాలుగు రోజులకే రేకులన్నీ
రాలిపోయి నిర్జీవమవ్వడం గుర్తొచ్చింది. ప్రకృతిలో ప్రతిదీ పుడుతూ
నశిస్తూ, మళ్ళీ పుడుతూ నశిస్తుంటుంది. మనిషి మాత్రమే తాను శాశ్వతమని
విర్రవీగుతాడు. ఎంతో విధ్వంశం సృస్టిస్తాడు. సంపద పోగేసి జనాలని దోపడీ
చెయ్యాలనుకుంటాడు. ఏదీ శాస్వతం కాదు తానే శాశ్వతం కాదు అనే ఎరుకతో
జీవించడం, అదే ఎరుకతో మరణించడం విపాశన అని నాకు అర్థమైంది.

ఐదో రోజు

 ఈ రోజు కూడా 4.30 నుండి 9 దాకా ధ్యానం సాగింది. నిన్న తలనించి పాదాలవరకు
మనసును నడుపుతూ మెడిటేషన్‌ చేస్తూ శరీరంలో ఏ భాగంలో ఏ స్పందన కలుగుతుందో
చూస్తూ, ఆ స్పందనలను అర్థం చేసుకోమని చెప్పారు. ఈ రోజు పాదాలనుండి
శిరస్సుదాకా చూడమని చెప్పారు. గంటసేపు కదలకుండా, కళ్ళు తెరవకుండా
మెడిటేషన్‌ చేస్తూ మనసుతో శరీరంలోని అంగాంగాన్ని పరిశీలిస్తే ఎన్నో
సంవేదనలు తెలుస్తాయి. నెప్పులు, చెమటలు, మంటలు, దురదలు, దగ్గులు,
తుమ్ములు, ఆవలింతలు ప్రతి అంగంలోను ఏదో ఒక సంవేదన పుడుతూ, నశిస్తూ
వుంటుంది. చెమట మీద చల్లగాలి తగిలినపుడు హాయిగా వుండడం, చెమటకి
మంటపుట్టినపుడు చికాకుగా కోపంగా వుండడం అన్నీ తెలుస్తుంటాయి. 150 మంది
కూర్చునే హాలులో ఫ్యాన్‌లు వెయ్యరు. చెమట పట్టాలని ఆ ఫీలింగ్స్‌
తెలియాలని ఫ్యాన్‌లు వెయ్యరని తర్వాత అర్థమైంది కానీ ముందు చాలా
కోపమొచ్చేది. కోపంగా బయటకొచ్చి చల్లగాలిలో తిరిగిన సందర్భాలు కూడా
వున్నాయి. కానీ ఆ స్థితి అవసరమని తర్వాత అర్థమై నా ప్రవర్తనకి
సిగ్గుపడ్డాను. ఆల్‌మోస్ట్‌ అందరూ అలాగే చేసారు.  తలనించి పాదాలదాకా,
పాదాలనించి తలదాకా కళ్ళు మూసుకుని సర్వే చేస్తున్నపుడు శరీరంలో ఎన్నో
స్పందనలు పుట్టి, నశిస్తున్నాయని, ఏ స్పందనా శాశ్వతంగా వుండదని
అర్థమౌతుంది. తలనించి దిగుతున్నపుడు మెడమీద నొప్పి వుండొచ్చు. మళ్ళీ
పాదాలనించి తలమీదికి వచ్చేటప్పటికీ ఆ నొప్పి పోవచ్చు. తీవ్రత తగ్గొచ్చు.
అంటే శరీరంలో పుట్టే ప్రతి స్పందన అశాశ్వతం. శరీర ధర్మం ప్రకారం
నొప్పులు,  చెమటలు, దురదలు ఇంకా ఎన్నో సంవేదనలు వస్తూ పోతుంటాయి.
ఒకనాటికి తన ధర్మం ప్రకారం ముసలిదై శరీరం నశిస్తుంది. మట్టిలో
కలిసిపోతుంది. ఆ శరీరానికి ఎన్ని నగిషీలు చెక్కినా, గుడిసెలో వున్నా,
బంగ్లాలో వున్నా, వీధిలో వున్నా మరణం ఆసన్నమైనపుడు మరణిస్తుంది. ఇది శరీర
ధర్మం.  ప్రకృతి ధర్మం కూడా అదే. ప్రకృతి కూడా అనుక్షణం మారుతుంటుంది.
గంగానదిలో నిలబడి నీళ్ళు తాగుతున్నపుడు ఒకే నీరును మరో మాటు ఎప్పటికీ
తాగలేం. తాగి తలయెత్తే సరిగా గంగా ప్రవాహం ఎంతో దూరం పోతుంది. కొత్త నీరు
వస్తుంది. హిమాలయాలు అలాగే వున్నట్లనిపిస్తాయికానీ హిమం కరుగుతూంటుంది.
మళ్ళీ మంచు కురుస్తూంటుంది. విత్తనం మొలకెత్తగానే ఎదుగుతుంటుంది.
ప్రకృతిలో చలనమున్నదంతా చలిస్తూనే వుంటుంది. మారుతూనే వుంటుంది. మార్పు
సహజం.  సుకుమార బాల్యం, ముగ్ధయౌవ్వనం, మధ్య వయస్సు, ముసలితనం - శరీరం
నిరంతరం మారుతుంటుంది. శరీరంలో కానీ, ప్రకృతిలో కానీ ఏదీ నిత్యం, శాశ్వతం
కాదు. అంతా అనిత్యం. మార్పు మాత్రమే శాస్వతం. ఇదే విపాశన. ప్రతి నిత్యం
మారడాన్ని అర్ధం చేసుకోవడమే విపాశన. మార్పును అర్థం చేసుకోలేక
శాశ్వతమనుకుంటేనే దు:ఖం. ఇప్పటికిది నిజం.వాస్తవం. అంతే.
ఆరో రోజు 
ఈ రోజు ఉదయం ఓ గమ్మత్తు జరిగింది. నాలుగ్గంటలకి విపరీతమైన వర్షం
కురిస్తున్నపుడు మెలుకువ వచ్చింది. లేచి టైమ్‌ చూస్తే  నాలుగయ్యింది. బయట
వర్షం. గంట కొట్టారో లేదో తెలియడం లేదు. అందరి రూమ్‌ తలుపులు మూసే
వున్నాయి. ఎవ్వరూ లేవలేదు. బ్రష్‌ చేసుకుని బయటకొచ్చాను. దమ్మ సేవిక
కనబడింది. బెల్‌కొట్టలేదు అని చెప్పాను అపుడు వెళ్ళి బెల్‌ కొట్టించింది.
 నేను గొడుగు తెచ్చాను. గొడుగేసుకుని వర్షంలో సెంటర్‌కెళ్ళాను.  అలా
కుండబోతగా కురుస్తున్న వర్షంలో ఒక్కదాన్ని నడుచుకుంటూ వెళ్ళడం ఎంత
బావుందో చెప్పలేను. కాసేపటికి వాన తగ్గింది. ఒక్కొరొక్కరే రాసాగారు.
ఆలస్యంగా  మెడిటేషన్‌ మొదలైంది. నిన్నటి పద్ధతే. తలమీంచి పాదాలవరకు ఏం
జరుగుతుందో గమనించడం. గంటసేపు కదలకుండా కళ్లు మూసుకుని కూర్చుంటే అన్నీ
తెలుస్తాయి. మనసు ఎక్కడ ఆగుతుందో అక్కడ ఏదో ఓ సంవేదన/సెస్సేషన్‌
తెలుస్తుంది. పదిగంటలకి మమ్మల్ని సెల్‌కి వెళ్ళమన్నారు. సెల్‌ అంటే
పగోడా. ఆరు అడుగుల పొడవు/మూడు అడుగుల వెడల్పు వుండే చీకటిగది. లైట్‌
వుంటుంది. కానీ చిమ్మ చీకటిలోనే కూర్చోవాలనిపిస్తుంది. అక్కడ కూర్చుని
మెడిటేషన్‌ చెయ్యాలి. ఇక్కడ కూడా ఓ గమ్మత్తు జరిగింది. నాకు ఆరు బయటే
విపరీతంగా చెమట పడుతుంది. పగోడాలోకి వెళ్ళగానే టాప్‌ తీసేసి  బనీను,
పైజామా మీద కూర్చున్నాను. చెమటతో తడిసి పోతాననుకున్నాను. ఒక్క చుక్క చెమట
పట్టలేదు. ఆ మాట టీచర్‌కి చెపితే '' మీరు పరిసరాలకు బాగా అడ్జస్ట్‌
అవుతారు. కొత్త ప్రాంతంలో కూడా టెన్షన్‌ వుండదు. చాలామందికి పగోడా చూస్తే
భయం. చీకటి చూస్తే భయం. మీకు ఎక్కడున్నా ఒకటే. వాస్తవం మీద మీ దృష్టి
వుంటుంది. ఇది చాలా మంచిది.'' అన్నారు. మధ్యాహ్నం టీచర్‌ పిలిచారు.
ఎందుకు పిలిచారా అనుకుంటూ ఆవిడ దగ్గరికెళ్ళాను. పగోడాలో ఎలా వుందో
అడగడానికి పిలిచారు. చాలాసేపు మాట్లాడారు. ఆవిడ కూడా పదిరోజుల కోసం
వచ్చారు మాతో పాటే వెళ్ళిపోతారు. నా మెళ్ళో పూసలదండ ఏంటి? ఏం నమ్మకం అని
అడిగారు. ఉట్టిదే! సరదాగా వేసుకున్నాను. నేను నాస్తికురాలను. దేవుడిని
నమ్మను అని చెప్పాను. ఓ ఇరవై నిమిషాలు అవి ఇవి మాట్లాడారు. ఆవిడ ఎవరితోను
అలా మాట్లాడ్డం చూడలేదు. గుళ్ళల్లో నాకు ఎదురైన అనుభవాలు చెపితే బాగా
నవ్వారు.
గోయంకా గారి ఉపన్యాసాలు చాలా బావున్నాయి. చాలా వ్యంగ్యంగా సూటిగా
మాట్లాడతారు. బుద్ధుడి జీవితం గురించి, ఎందరివో అనుభవాలుగురించి చక్కగా
చెబుతారు. ఆయన ఇంగ్లీషు అద్భుతంగా వుంటుంది. నేను ఆయన హిందీ ఉపన్యాసాలు
విన్నాను. తెలుగు అనువాదం నచ్చలేదు. రోజూ ఓ కొత్త అనుభవం. కొత్త ఆలోచనలు
వస్తున్నాయి.
ఏడో రోజు ఉదయం ఓ సంఘటన జరిగింది. బ్రేక్‌ఫాస్ట్‌కి వెళ్ళినపుడు సేవిక
నన్ను అరటిపండు తీసుకోవద్దని సైగ చేసింది.మొదట నాకు అర్ధం కాలేదు. సరేనన
ఉప్మా మాత్రమే తిన్నాను. నేను పండు రూమ్‌కి తీసుకెళుతున్నానని, ఐదు
తర్వాత ఏమీ తినకూడదనే నియమం వుంది కాబట్టి అలా చెప్పింది
కాబోలనుకున్నాను. ఆమెను అడిగాను. ఎందుకు అలా చెప్పారని (సేవికతో
మాట్లాడొచ్చు) రూమ్‌కు తీసుకెళ్ళి తినడం 'శీల్‌భంగ్‌' అని అలా
చెయ్యకూడదని చెప్పింది.  కానీ చాలామంది రూమ్‌కి తీసుకెళ్ళడం గమనించాకే,
తీసుకెళ్ళొచ్చనుకుని నేనూ అలా చేసాను. 'శీల్‌భంగ్‌' అనే మాట చాలా చికాకు
పెట్టింది. టీచర్‌కెళ్ళి చెప్పాను. ''నేను ఓ పొరపాటు చేసాను. నాకు తెలియక
చేసాను'' అన్నాను.'' ఫర్వాలేదులెండి. ఇపుడు తెలిసి మానేసారుగా. చెప్పారు
కాబట్టి మాఫీ అయిపోయిందిలెండి '' అంటూ నవ్వారు. మనసులో చికాకు
మాయమైపోయింది. అంతకు ముందు చాలా గింజుకున్నాను. ఎందుకు అలా చేసానని
చాలసేపు మధన పడ్డాను. పొరపాటును ఒప్పేసుకుని, బయటకు చెప్పేసుకోవడంతో ఎంత
రిలీఫ్‌ వుంటుందో తెలిసి వచ్చింది.

పగోడాలో ఏడుపు

విపశ్యన మెడిటేషన్‌లో పగోడాలో కూర్చుని చేసే మెడిటేషన్‌ చాలా పవర్‌ఫుల్‌గా
వుంటుంది. మనసు చాలా తీక్షణమౌతుంది. ఏడో రోజు పగోడాలో మెడిటేషన్‌
చేస్తున్నపుడు నాకెందుకో ఆపుకోలేనంత ఏడుపు వచ్చింది. వెక్కి వెక్కి
ఏడుస్తూనే వున్నాను. నా జీవితంలో నేను చేసిన కొన్ని తప్పులు కొన్ని
గుర్తొచ్చాయి. వాటివల్ల ప్రభావితమైన వాళ్ళు గుర్తొచ్చారు. నా ప్రవర్తన
వాళ్ళనెంత  బాధపెట్టి వుంటుందో గుర్తొచ్చింది. ఇలాంటివి ఒకటి రెండు
సంఘటనలే నా జీవితంలో జరిగాయి. అవే గుర్తొచ్చి అమితమైన దు:ఖం కలిగింది.
రెండోది హెల్ప్‌లైన్‌కి కాల్‌చేసే అసంఖ్యాక స్త్రీల దు:ఖం, వారి సమస్యలు,
బాధలు గుర్తొచ్చి మరింత ఏడుపు తన్నుకొచ్చింది. నా స్నేహితుల్లో, నా
చుట్టూ వున్న వాళ్ళల్లో కొంతమంది పడుతున్న మానసిక వేదనలు, సంఘర్షణలు
గుర్తొచ్చి కూడా చాలా ఏడుపొచ్చింది. వాళ్ళంతా ఆ దు:ఖాలను మోయకుండా,
ఇలాంటి మెడిటేషన్‌కొచ్చి, ఆ బరువుల్ని దింపేసుకోగలిగితే ఎంత బావుంటుంది
అనిపించింది. పగోడాలో ఏడుపు గురించి టీచర్‌కి చెప్పాను. ''అలా దు:ఖం
రావడం చాలా మంచిది. లోపలున్న బరువంతా కరిగిపోయింది. స్త్రీల దు:ఖం
మిమ్మల్ని కదిలించింది వాళ్ళంతా సంతోషంగా వుండాలని మీరు భావిస్తారు.
అందుకే వాళ్ళకోసం ఏడ్చారు'' అన్నారావిడ.

 ఆకలివేళ అందిన బిస్కట్‌

మెడిటేషన్‌ పూర్తయ్యాక తొమ్మిదింటికి రూమ్‌కొచ్చి స్నానం చేసి, నైటీ
తగిలించి బయటకొచ్చి నిలబడ్డాను. బయట చల్లగా, హాయిగా వుంది. ఎదురుగా
అర్థచంద్రుడు. మెల్లగా ఆకలి మొదలైంది. రూమ్‌ లోపలి కెళ్ళి నీళ్ళు తాగాను.
 కాసేపు చల్లబడింది. మళ్ళీ మొదలైంది. ఐదింటికి తిన్న మరమరాలు. సేవిక అలా
చెప్పాకాఅరటిపండు డైనింగ్‌హాల్లో కూడా తినాలనిపించలేదు. తినలేదు. ఇంత
ఆకలేస్తోంది. నిద్రపడుతుందా అసలు? పొద్దున నాలుగింటికి లేవాలి కదా!
తలుపేసి పడుకున్నాను. ఊహూ! ఆకలి.. మళ్ళీ వరండాలో కొచ్చాను. అటుఇటూ తిరగడం
మొదలుపెట్టాను. అలా తిరుగుతున్నపుడు హఠాత్తుగా పక్కరూమ్‌లో ఉన్నావిడ ఓ
చిన్న బిస్కట్‌ పాకెట్‌ తెచ్చి నా చేతిలో పెట్టింది. ఆశ్చర్యపోయాను.
మాటలు, పరిచయాలు లేవు కాబట్టి ఆవిడ పేరు తెలియదు. వొద్దన్నాను. ఫర్వాలేదు
తీసుకోండి అని సైగలద్వారానే చెప్పింది. ఆ తర్వాత ఆవిడ లోపలి
కెళ్ళిపోయారు. నేను నా రూమ్‌లో కొచ్చి బిస్కట్‌ ప్యాకెట్‌ విప్పాను. మూడు
బిస్కట్‌లున్నాయి. బ్రిటానియా వాళ్ళు కొత్తగా తెస్తున్న రాగిబిస్కట్‌లు.
రెండు బిస్కట్‌లు తిని నీళ్ళు తాగాక అబ్బ! ఆకలి మంట చల్లారడం అంటే ఏంటో
అర్థమైంది. అసలావిడకి నాకంత ఆకలిగా వుందని ఎలా అర్థమైదబ్బా!
బిస్కటివ్వాలని ఎందుకన్పించిందబ్బా అంటూ ఆశ్చర్యపోతూ, ఆలోచిస్తూ
నిద్రపోయాను.
 ఎనిమిది, తొమ్మిది రోజులు పూర్తిగా మెడిటేషన్‌తోనే గడిచాయి. తలనుండి
పాదాలవరకు, పాదాల నుండి తలవరకు గమనిస్తూ మెడిటేషన్‌ చెయ్యాలి.
రిపీటెడ్‌గా గంటల తరబడి అదే స్థితిలో వుండాలి. శరీరంలోని అంగాంగాన్ని
గమనించడం, కలుగుతున్న సంవేదనల్ని చూడడం, సుఖకరమైన వాటిని, దు:ఖకరమైన
వాటిని సమంగా చూడడం, నొప్పిని ద్వేషించడం, సుఖాన్ని ప్రేమించడం
చెయ్యకుండా సమతని పాటించడం చాలా ముఖ్యమైన అంశంగా వుంటుంది. కళ్ళు
మూసుకుని అంతర్వేత్రం తో మనసుని అంగాంగం మీదికి నడిపిస్తున్నపుడు చాలా
అనుభవాలు కలుగుతాయి. మనసు ఒక అంగం మీద ఆగినపుడు అక్కడ ఏదో ఒక సెన్షేషన్‌
వుంటుంది. నొప్పో, దురదో, మంటో, చెమటో ఏదో ఒకటి వుంటుంది. మన
రియాక్షన్స్‌ కూడా వుంటాయి. దురద పెట్టగానే గోకడం కూడా రియాక్షనే. దురదని
ద్వేషిస్తాం. కోపంగా గోకుతాం. చెమటపట్టి చీదరగా వున్నపుడు చెమటని
ద్వేషిస్తాం. ఆ చెమట మీదికి చల్లగాలి వాలినపుడు ఆ చల్లదనాన్ని
ప్రేమిస్తాం. రెండూ క్షణికమైన భావాలే. అశాశ్వతమైనవే. మనం శిరస్సు నుంచి
పాదాల వరకు అంతరౌత్రంతో ప్రయాణం చేస్తున్నపుడు మన ప్రయాణం
మొదలుపెట్టినపుడు ముక్కు మీద దురదనో, చెమటలో, మంటో ఏదో ఒక సంవేదన
కనబడుతుంది. మనం దాన్ని అలాగే సాక్షిలాగా చూసుకుంటూ పాదాలవేపు ప్రయాణం
అయిపోతే...మళ్ళీ పాదాల నుంచి శిరస్సు వేపు వచ్చినపుడు ఆ సంవేదన ముక్కు
మీద వుండకపోవచ్చు. చెవిమీదో, నుదిటి మీదో అలాంటి సంవేదన కనబడవచ్చు.
గోయంకా గారు చాలా సార్లు అనిత్య, అనిత్య అంటూంటారు. అలాగే మనసు
పొరల్లోనో, గుండెల్లోనో గూడు కట్టుకుని గడ్డకట్టుపోయిన సంవేదనలు- మన
సబ్‌కాన్షన్‌ మైండ్‌లో నిక్షిప్తం అయివున్న జ్ఞాపకాలు, ద్వేషాలు,
ప్రేమలు, దు:ఖాలు, అసంఖ్యాక సంఘటనలు - మనం సంవత్సరాలుగా మోస్తున్న దు:ఖపు
మూటలు మన అంతర్నేత్రానికి ఆనడం మొదలుపెడతాయి. శాస్వత సంపదగా మనం మనలోపల
నిక్షిప్తం చేసుకున్న గుట్టలకొద్దీ సంవేదనలు, వాటిద్వారా మనకి ఎదురైన
దు:ఖాలు, సుఖాలు అన్నీ కళ్ళకు కట్టడం మొదలౌతుంది. ఎవరిమీదో ఎంతో కాలంగా
పెంచుకుని, గుండెల్లో ఘనీభవించుకున్న ద్వేషం,ఎవరి మీదో అవధుల్లేకుండా
పెంచుకున్న ప్రేమ, ఆ ప్రేమవల్ల ఎదురైన దు:ఖాలు కరగడం మొదలౌతాయి.
ఘనీభవించిన సంవేదనలు కరుగుతున్నపుడు  మన కళ్ళల్లోంచి ఒక్కోసారి కన్నీళ్ళు
ధారకడతాయి. చాలామంది బాగా ఏడుస్తారు.
నా వరకు నేను ఎవ్వరి మీద శాశ్వత ద్వేసాన్ని పెంచుకోలేదు. నాకు ఎవరి మీద
అంతద్వేషం లేదు. కానీ ఒక సంఘటన ఇక్కడ చెప్పాలి. నేను రెవెన్యూ
డిపార్ట్‌మెంట్‌లో పనిచేసేటపుడు ఆ డివిజన్‌ సబ్‌కలెక్టరు నా మీద అకారణ
ద్వేషం చూపించేవాడు. మీటింగ్‌ల్లో నిలబెట్టి అవమానించడం, పరుషంగా
మాట్లాడడం చేసేవాడు. దానికి కారణముండేది కాదు. బహుశా నా బాడీ లాంగ్వేజ్‌,
ధిక్కార స్వభావం అతనికి నచ్చివుండవు. నాకు రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌
ఫ్యూడల్‌ బానిసత్వపు లక్షణాలు అలవడలేదు. నేను ఆఫీసుకు నా కైనటిక్‌ హోండా
మీద వెళుతున్నపుడు, అతని జీప్‌ ఎదురుపడిందంటే- ఆ సాయంత్రం మీటింగ్‌లో
అతను శివాలు తొక్కేవాడు. దీనివల్ల అతని మీద నాకు విపరీతమైన ద్వేషం,
అసహ్యం పెరిగిపోయాయి. ఛాన్స్‌ వస్తే ఎప్పుడో తన్నాలి అన్నంత అసహసం
పెరిగిపోయింది. ఇదంతా నా మనసులో ఘనీభవించిపోయింది. అతని పేరు తలిస్తే
వొళ్ళంతా కంపించి పోయేంత కోపం. నేను ఆ డిపార్ట్‌మెంట్‌ వొదిలేసి వచ్చాకా
పదేళ్ళ వరకు ఆ ద్వేషం నాలో వుంది. సంవత్సరం క్రితం భూమిక పనిమీద అతన్ని
కలవాల్సి వచ్చినపుడు, కలిసి మాట్లాడినపుడు ఇతని మీద ఇంతకాలం ఈ ద్వేషాన్ని
అలాగే గడ్డకట్టి దాచుకున్నానా?  అని సిగ్గనిపించింది. ఆ ద్వేషం అలాగే
వుండడంవల్ల నా కోపం పెరగడం తప్ప లాభామేముంది. అతని కొచ్చిన నష్టమేముంది?
పోనీ  నీ వల్ల నేనింత బాధపడ్డాను అని చెప్పానా? చెప్పేవీలుందా? లేదు కదా!
ఆ రోజు అతని మీద ద్వేషం కరిగిపోయింది. గమ్మత్తుగా అతనిపుడు మా ఇంటి
ఎదురుగా కొత్తగా కట్టిన ఐఎఎస్‌/ఐపిఎస్‌ క్వార్టల్లో కొచ్చాడు. అతని మీద
అదే ద్వేషం కొనసాగివుంటే  రోజు ఆ ఇంటి వైపు చూస్తూ కోపంతో సతమతమై
వుండేదాన్ని. ఇపుడలాంటి ఫీలింగ్‌ లేదు. అలా గడ్డకట్టిన ద్వేషాలు, కోపాలు
మన మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో  మనకు అనుభవమే.నేను ఇప్పటికీ
ద్వేషిస్తున్న మనిషి/ క్షమించలేని మనిషి మరొకడున్నాడు. అతను నరేంద్రమోడి.
పేపర్‌లో అతని ఫోటో కనిపిస్తే చాలు అతని కళ్ళని చింపేస్తాను. అతని
ఫోటోలోని కళ్ళుల్లోకి చూడడం కూడా నాకు ఇష్టం వుండదు. అయితే ఈ ద్వేషం,
కోపంవల్ల నాకు జరిగే నష్టం ఏమీ లేదు కానీ అతను జరిపించిన మారణకాండని
నేనెప్పటికీ మర్చిపోలేను. అయితే మోడీ మీద ద్వేషం వ్యక్తిగతమైందికాదు
కాబట్టి అది నాలో గడ్డకట్టలేదు.
విపాశన ధ్యానం చేస్తున్నక్రమంలో, గంటలకొద్దీ సమయం మనతో మనం గడపడంతో మన
మనస్సులో పేరుకున్న వికారాలు మనకు అర్థమవ్వడం మొదలౌతుంది. రాగం,ద్వేషం ఈ
రెండే మనల్ని ప్రభావితం చేస్తుంటాయని తెలుస్తుంది. ఆ రెండూ కూడా
శాశ్వతంగా మనలో ఉండిపోయేవి కావని, అవి కూడా మారుతుంటాయని తెలుస్తుంటుంది.
మనకి దు:ఖాన్ని కలిగించేవి, సుఖాన్ని కలిగించేవి ఏ సంవేదనలు, అవి ఎంత
కాలముంటాయి? అవి శాశ్వతంగా వుండిపోతాయా? మారిపోతుంటాయా? అనిత్యాలైతే,
మారిపోతే మనమెందుకు బాధపడాలి? సంతోషపడాలి? ఆ ప్రభావాలు మన జీవితాలనెందుకు
శాశించాలి? ఎన్నో ఆలోచనలకు నిలయమౌతుంది మనసు. ఆ మనసే అంతర్నేత్రం ద్వారా
శరీరంలోని ప్రతి అంగాన్ని శోధిస్తుంటుంది. సంవేదనలని చూస్తుంటుంది.
విపశ్యన ధ్యానం చేస్తున్న వాళ్ళు ఆ దు:ఖకారక, సుఖకార సంవేదనల్ని
సాక్షిలాగా, సమత్వంతో చూడాలని చెబుతుంటారు గోయంకాగారు.  కోట్ల కణాల
సముదాయం శరీరమైతే ప్రతి కణంలోను ప్రతి క్షణం మార్పు జరుగుతుంటుంది.
సంవేదనలు పుడుతూ గిడుతూ వుంటాయి. పుట్టిన క్షణం నుంచి ఈ మార్పు శరీరంలో
జరుగుతుంటుంది. ఒకరోజు గడవడం అంటే ఒక రోజు చావుకి దగ్గరవ్వడం. శిశువు ఒక
రోజు పెరగడం అంటే మరణానికి ఒక రోజు దగ్గరవ్వడం. ఈ నిరంతర మార్పు
అనివార్యంగా జరుగుతూ చివరికి శరీరం మరణించడంగా పరిణమిస్తుంది. ఇది శరీర
ధర్మం. దీన్ని ఎవ్వరూ మార్చలేరు. శాసించలేరు. అయినప్పటికీ మనిషి తాను
శాశ్వతమనే భ్రమతోనే సంపదల్ని, పోగేసుకుంటూ వుంటాడు. సమాజానికి చెందాల్సిన
వనరుల్ని కూడా తానొక్కడే కొల్లగొట్టాలనుకుంటాడు. హింసలకి, అణచివేతలకి,
దుర్మార్గాలకి పాల్పడతాడు. మనిషిలోని కౄరత్వం, శరీరధర్మం ఏమిటో అర్థం
చేసుకోనివ్వదు. అహంకారం, ఆధిపత్యం, పొగరుబోతుతనం తన ఉనికి శాస్వతమనే
భ్రమని కల్పిస్తాయి. ఒక్కసారి మనిషి అంతర్ముఖుడై తన మనసులోని భయంకర చీకటి
కోణాలపై వెలుతురు ఫోకస్‌ చేసుకోగలిగితే, తాను ఎన్ని నికృష్ణకార్యాలకు
పాల్పడతాడో, ఎన్ని వికారాలు తనలో గూడు కట్టుకుని వున్నయో, అవి తననెంత
హీనస్థితికి దిగజార్చాయో అర్థమవుతుంది. విపాశనలో పది రోజులపాటు ఎలాంటి
బహిర్ముఖం లేకుండా అంతర్ముఖంలో వుంటూ తన మనసు లోతుల్ని శోధిస్తుండడంవల్ల,
వాటి నిజనైజాలు తెలుస్తుండడంవల్ల, తమ నిజ స్వరూపాలు తేట తెల్లమవుతుంటాయి.
ఒక్కోసారి అది గాఢమైన దు:ఖానికి దారితీస్తుంది.  రాగం, ద్వేషం, కౄరత్వం,
అహంకారం, ఆధిపత్యంలాంటి గుణాలు తనకి దు:ఖాన్నివ్వడంతో పాటు తన చుట్టూ
వున్న వాళ్ళకు మానసిక వేదనని, మన:శాంతిని లేకుండా చేస్త్తాయని
అర్థమవుతుంది.
శరీరధర్మం ఏమిటి? మరణించడం అంటే అశాశ్వతం. అనిత్యం. మరి ప్రకృతిధర్మం
ఏమిటి? వాట్‌ ఈజ్‌ రూల్‌ ఆఫ్‌ నేచర్‌? ప్రకృతి ధర్మం   కూడా పుట్టడం,
గిట్టడం. నిరంతర మార్పు. ఓ చిన్న బీజం నుండి పుట్టిన మర్రిమాను కూడా
పుట్టి పెరిగి, పువ్వులు పూసి, కాయలు కాసి, మరణించడం. విత్తనం ద్వారా
మళ్ళీ పుట్టడం... మళ్ళీ అదే సైకిల్‌. అంటే ప్రకృతిలోని సమస్తం. పుడుతూ,
గిడుతూ...నిరంతరం మార్పు చెందుతూ వుండడమే ప్రకృతి ధర్మం. ధర్మం అంటే
ఇక్కడ నియమం. మహోత్తుంగ హిమాలయాలమీద మంచు కూడా శాస్వతంగా వుండదు. మంచు
కురుస్తుంది. కరుగుతుంది. ప్రవహిస్తుంది. నదిగా అవతరిస్తుంది. ఆఖరికి
సముద్రంలో కలుస్తుంది. మళ్ళీ మబ్బురూపం ధరించి వాన చినుకై కురుస్తుంది.
హిమాలయాలు అలాగే మంచుతో శాశ్వతంగా నిలబడి వుంటాయని మనకి భ్రమ కలుగుతుంది.
కానీ అక్కడ నిరంతర చలనం, నిరంతరం మార్పు జరుగుతుంటుంది. హిమాలయాల మీద
మంచుకూడా అశాశ్వతమే. అలాగే సముద్రాలు ఒక్కచోటే వున్నట్టు అన్పిస్తుంది.
సముద్రంలో నిరంతర మార్పులు జరుగుతుంటాయి. నదుల నీరొచ్చి చేరుతుంది. తన
లోని నీళ్ళే మబ్బులై మళ్ళీ తన మీదే కురుస్తుంటాయ్‌. సెలయేళ్ళు, జలపాతాలు
ఇవన్నీ కూడా చలన  శీలత సిద్ధాంతానికి కట్టుబడివుంటాయి. మార్పు ప్రకృతి
ధర్మం. శరీరధర్మం, ప్రకృతి ధర్మం ఒక్కలాగే వుండి అనుక్షణం మారుతూ
వుంటాయి. రెండింటిలోను శాశ్వతత్వం లేదు. మార్పు చెందుతూ పుడుతూ, నశిస్తూ
వుండడమే రెండింటి ధర్మం. ఈ నియమాన్ని, ఈ ధర్మాన్ని అర్థం చేసుకోవాలంటే,
అనుభూతి చెందాలంటే, ఎవరో చెబితే కాకుండా మనకు మనమే అనుభవంలోకి తెచ్చుకునే
జీవనకళ విపాశన.


ఓ అర్ధరాత్రి సమస్తాన్ని వొదిలేసి చీకటిలోకి నడుచుంటూ వెళ్ళిపోయిన
సిద్ధార్థ గౌతముడు, బుద్ధగయలో రావిచెట్టు కింద తపస్సుచేసి దు:ఖానికి
పరిష్కారం సాధించాడని, బుద్ధుడయ్యాడని, ప్రపంచానికి వెలుగు ప్రసాదించాడని
చెప్పగా విన్నాం. సాహిత్యంలో చదువుతున్నాం. దు:ఖమంటే ఎరుగని సిద్ధార్ధుడు
దు:ఖం ఎదురైనపుడు కలత చెంది అసలు మనిషికి దు:ఖమెందుకు కలుగుతుంది. దు:ఖం
ఎక్కడ, ఎలా పుడుతుంది?అని శోధించాడు. బోధివృక్షం కింద కదలకుండా కూర్చుని
దు:ఖ కారణం కనుక్కున్నాడు. రోజుల తరబడి  కదలకుండా కూర్చుని సిద్ధార్థుడు,
కన్నువిప్పకుండా దు:ఖం కారణం కోసం తన లోపలే వెతనారంభించాడు. తన
మనసులోకి, తన లో ప్రపంచంలోకి  చేసిన ప్రయాణం తన శరీరంలో జరుగుతున్న
సంవేదనలను చూపించింది. దు:ఖకారక, సంతోషకారక సంవేదనలు ఎలా పుడుతున్నామో,
నశిస్తున్నామో సిద్ధార్ధుడు తన అంతర ప్రపంచంలో గమనించాడు. కోరికలు ఎలా
పుడతున్నాయో అర్థం చేసుకున్నాడు. సంవేదనల స్వభావం- అవి మంచివైనా,
చెడువైనా, దు:ఖాన్నిచ్చినా సంతోషాన్నిచ్చినా వాటి జీవితం స్వల్పమని
పుడుతూ గిడుతూ వుంటాయని తెలుసుకున్నాడు. తన సొంత అనుభవం నేర్చిన ఈ
జ్ఞానాన్ని విపశ్యన పేరుతో ప్రజానీకానికి పరిచాడు. మొదట తన అనుభవాన్ని
ఐదుమందికి పరిచాడు. ఆ తర్వాత కోట్లాది మంది ఈ జ్ఞానాన్ని అందుకున్నారు.
మనసు ఆడించినట్టల్లా మనిషి ఆడితే-  కోరికలు తీరితే సంతోషపడి (ఆ సంతోషం
కూడా అశాశ్వతమే) తీరకపోతే దు:ఖపడడం జరుగుతుందని చాలాస్పష్టంగా చెప్పాడు.
కోరికలే మనిషి దు:ఖానికి కారణమని, సుఖదు:ఖాలను సమంగా చూడగలిగితే- సమతను
సాధించగలిగితే మనిషి జీవితం సాఫీగా సాగిపోతుందని, గొప్ప ఆనందం
అందుబాటులోకి వస్తుందంటాడు.  ఒక వ్యక్తి మీద ప్రేమకన్న, వస్తువుల మీద
ప్రేమ కన్నా విశాల ప్రేమని, ప్రకృతిలోని సమస్తాన్ని ప్రేమించగలిగితే
మనిషి మహానందాన్ని అందుకుంటాడని, అతను కూడా బుద్ధుడవుతాడని, బుద్ధుడు
అనేది పేరు కాదని, సమస్థితిని సాధించిన ప్రతి వొక్కరూ బుద్ధులేనని విపశ్యన
చెబుతుంది.

 భారతదేశంలో బుద్ధుడి ద్వారా పుట్టిన ఈ జ్ఞానం ఇక్కడ అంతరించి పోయిందని,
బర్మా  మాత్రం  దీన్ని భద్రంగా కాపాడుకున్నదని, తాను 1969లో బర్మా నుంచి
భారతదేశం వచ్చానని, విపశ్యన సెంటర్‌లను స్థాపించానని గోయంకాగారు చెబుతారు.

పదిరోజులపాటు ఇంటిని, పనిని, సంబంధాలని వొదిలేసి కేవలం నాతో నేను, నాలో
నేను గడపడానికి విపాశనని వెళ్ళడానికి కారణం అసలు విపశ్యన అంటే ఏమిటో
తెలుసుకోవడం, ఆ అనుభవం ఎలా వుంటుందో అనుభూతి చెందడం కోసమే. నిజానికి నేను
ఎప్పుడూ పాజిటివ్‌ దృక్పథంతోనే వుంటాను. జీవితాన్ని సింపుల్‌గా ఎలాంటి
ఆర్భాటాలు లేని విధంగా మలుచుకున్నాను. వస్తు సముదాయం అవి ఎలాంటివైనా సరే
నన్ను ప్రలోభపెట్టలేవు. దు:ఖాలను, దిగుళ్ళను గుండెల్లో మోస్తూ తిరగడం నా
వల్లకాదు. వాటిని అధిగమించే మార్గాలను అన్వేషిస్తాను. ప్రతి సమస్య
పరిష్కారం ఆ సమస్యలోనే వుంటుందని నమ్ముతాను. ఏ అతీత శక్తిని నమ్మని
దాన్ని  కాబట్టే  నాకు విపాశన సెంటర్‌లో వాతావరణం చాలా నచ్చింది. మతపరమైన
కర్మకాండ, సంప్రదాయాలు లేని లౌకిక పద్ధతులు అక్కడ నెలకొనడం, బుద్ధుడి
విగ్రహం కూడా లేకపోవడం బావుంది. బుద్ధుడిని భగవానుడని పిలవడం వెనుక
ఇప్పటి భగవానుడు కాడని, విపాశన జ్ఞానంద్వారా సమతను సాధించిన వాళ్ళని
భగవాన్‌ అని ఆ రోజుల్లో పిలిచేవారని గోయంకాగారు వివరించారు. అలాగే
పరమపదమంటే మరణాన్ని కూడా ఎరుకతో,చిరునవ్వుతో స్వీకరించడంగా అర్థం
చేసుకోవాలి, బుద్ధుడు మతం ఆధారంగా సృష్టించబడిన స్వర్గ, నరకాలను
నిరసించాడని, మతపరమైన కర్మకాండలవల్ల మనిషి పొందే జ్ఞానమేమీ వుండదని, ఆ
కర్మకాండలో కూరుకుపోవడమే వుంటుంది తప్ప దాన్నుండి బయటపడలేరని బుద్ధుడు
చెప్పాడని గోయంకా చెబుతారు.

మొత్తానికి విపశ్యన మెడిటేషన్‌ నాకొక కొత్త అనుభవాన్నే ఇచ్చింది.
ఆహ్లాదకరమైన వాతావరణం, ఎంతో నిబద్ధతతో పనిచేసే దమ్మసేవికలు, ఎంతో
స్నేహంగా వుండే టీచర్‌ పద్మజగారు. పది రోజుల పాటు చక్కటి క్రమశిక్షణ,
వొళ్ళొంచి అన్ని పనులూ చేసుకోవడం చాలా నచ్చింది. మనం తలుచుకుంటే ఏమైనా
చెయ్యగలం అనే నమ్మకాన్ని మనకి ఇస్తుంది. పదిరోజులు మాట్లాడకుండా వుండగలం,
రాత్రి భోజనం లేకుండా బతకగలం, బయట ప్రపంచంతో సంబంధం లేకుండా మనతో మనం
పదిరోజులు గడపగలం. అన్నింటినీ మించి పుడుతూనే సెల్‌తో పుట్టామని,
కంప్యూటర్‌ కవచకుండలాలతో  పెరిగామని విర్రవీగే వాళ్ళకి అవి లేకుండా కూడా
హాయిగా పది రోజులు బతకొచ్చని అర్థమౌతుంది. ఎపుడూ బయట ప్రపంచంతో, వస్తు
సముదాయంతో ఉక్కిరిబిక్కిరిగా బతికే మనం, మన లోపలి ప్రపంచాన్ని
దర్శించాలంటే, సంకుచిత ప్రేమల్నుండి విశ్వప్రేమను అలవరుచుకోవాలంటే  ప్రతి
వొక్కరం ఈ అనుభవాన్ని పొందితీరాలి.

మరో ముఖ్య విషయం చెప్పాలి. ఇక్కడ భోజనం, వసతి అన్నీ ఉచితమే.
విరాళాలివ్వమని కూడా అడగరు. అయితే పది రోజులు హాయిగా అన్ని సౌకర్యాలు
పొందుతాం కాబట్టి మనమే విరాళం ఇవ్వాలనుకుంటాం. నేను రూ. 2000
విరాళమిచ్చాను. ఇక్కడ పద్ధతి ఏమంటే నేను ఇచ్చిన విరాళం నా తర్వాత
వచ్చేవాళ్ళకు ఉపయోగపడుతుంది. నా కోసం ఎవరో విరాళం ఇచ్చే వుంటారు. ఈ
అవగాహనతో అందరూ తోచినంత  విరాళం ఇస్తారు. నిజానికి పదిరోజులు
తిండితిప్పలు, కరెంట్‌, వాటర్‌ వీటికి బాగానే ఖర్చవుతుంది. సాధకులిచ్చే
డొనేషన్స్‌ కాకుండా వేరే ఎలాంటి విరాళాలు స్వీకరించరు.

అన్ని మానవ సంబంధాల్లోకి స్నేహం ఉన్నతమైందని నమ్మే నాకు,విపశ్యన
చివరిరోజు మంగళమైత్రి ఒక్కటే అలవరుచుకోవాలని, ప్రకృతి మీద, మానవాళి మీద
స్నేహాన్ని, ప్రేమని మాత్రమే కురిపించాలని, మనం స్నేహంతో మన హృదయాన్ని
నింపుకుంటే, ఆ స్నేహం మన చుట్టూ ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పుతుందని,
ఒక్కోసారి ఆ స్నేహం, ప్రేమ మన మనసుల్లోంచి పొంగిపొర్లి మనతో వున్న
వాళ్ళందరికీి దాన్ని పంచుతుందని గోయంకా గారు చెప్పినపుడు నా కళ్ళల్లోంచి
ఆనందభాష్పాలు కురిసాయి.మానవాళి మొత్తం ఈ కళని అలవరుచుకుంటే ప్రపంచం
మొత్తం శాంతి నెలకొని, అందరూ మనశ్శాంతితో బతుకుతారు కదా! అనిపించింది.

 చివరగా పదో రోజు మధ్నాహ్నం నుండి ఒకరితో ఒకరం మాట్లాడుకునే అవకాశం
దొరికింది. చిత్రంగా చాలామంది నన్ను గుర్తుపట్టారు. మీరు టీవీలో
వస్తారుకదా! మిమ్మల్ని చాలాసార్లు చూసాం అన్నారు. పరస్పర పరిచయాల్లో
భూమిక పత్రిక, భూమిక హెల్ప్‌లైన్‌ గురించి చెబుతూ నేను రచయిత్రినని,
జర్నలిస్ట్‌నని చెప్పగానే చాలామంది బాగా ఎడ్జ్తెట్‌ అయ్యారు.
హెల్ప్‌లైన్‌ గురించి వివరంగా చెప్పమన్నారు. నేను చేస్తున్న పనిని
మెచ్చుకుంటూ చాలామంది అభినందనలు  చెప్పారు. టీచర్‌ పద్మజగారు నిన్నటివరకు
మీరు నాకు నమస్తే చెప్పారు. ఈ రోజు నేను మీకు నమస్తే చెబుతున్నాను.  మీరు బాధిత స్త్రీల కోసం చాలా
చేస్తున్నారు. అభినందనలు. నేను మీ ఆఫీసుకొస్తాను. మనం మళ్ళీ కలుద్దాం ''
అన్నపుడు నాకు నా పనిపట్ల  మరింత గౌరవం, నిబద్దత పెరిగినట్లనిపించింది.
నేను రెగ్యులర్‌గా సందర్శించే చెంచల్‌గూడా మహిళా జైలులో విపాశన
మెడిటేషన్‌ను ఏర్పాటు చేద్దామని పద్మజగారితో చెప్పినపుడు ఆవిడ తప్పకుండా
ప్రయత్నిద్దాం అన్నారు.
జూలై మొదటి తేదీన పెట్టెబేడా సర్దుకుని, నా రూమ్‌ని శుభ్రంగా కడిగి,
దుప్పట్లు వగైరాలు ఉతికేసి మళ్ళొస్తానని చెట్టకి, పిట్టలకి చెప్పి,
తేలికైన శరీరంతో (మూడు కేజీల బరువు తగ్గాను) ఉత్సాహంగా వున్న మనసుతో మా
ఇంటి ముఖం పట్టా
  • Sambasivarao Nulu
    Write a comment...


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి