10, ఆగస్టు 2019, శనివారం

నాన్నకు ప్రేమతో.... ఏమని చెప్పను.. ఎంతని చెప్పను.. నాన్న ఔన్నత్యం నాన్న ఆకాశమంత...అంతకు మించి...అనంతమంత!! ఆకాశమంత ఔన్నత్యం, వెన్నెల కురిపించే చక్కనయ్య, చంద్రయ్య మోము, చల్లని వెన్నెల లాంటి గుణం, కమ్మని వెన్నలాంటి మనసు, నడకతోపాటు నడత నేర్పే నేర్పరి, సేవా సహన శీలత, కోమలతల త్యాగం... ఏమని చెప్పను!? ఎంతని చెప్పను!? ఎంతచెప్పినా తక్కువే నాన్న గురించి చెప్పడం. నాన్న గొప్పదనాన్ని అక్షరాలుగా మార్చి, వాక్యాలలో ఒదిగింపచేసి నాన్న గుణగణాలను లెక్కిస్తూ పోతే నక్షత్రాల సంఖ్య కూడా తక్కువే పడుతుందేమో! నాన్న ఔన్నత్య విస్తీర్ణం ముందు అంబరమంతా నేలమీద పరచినా చాలా తక్కువనిపిస్తుంది. అలుపెరుగని సూర్యుడు, అనునిత్యం చంద్రుడు, పోరాడే సైనికుడు, కష్టించే శ్రామికుడు... ఇలా చెప్పనలవి కానంత కీర్తి ఆయన సొంతం. త్యాగానికి నిలువెత్తు నిదర్శనం. ప్రేమకు తరగని శిఖరమంత కూర్పులు. మంచికి మానవత్వానికి చెరగని చిరునామా నాన్న. సంతాన అభివద్ధి కోసం తాను రెక్కలు ముక్కలు చేసుకున్నా కూడా తన సాధకబాధకాలను ఎవరికీ చెప్పుకోడు. నిస్వార్థంగా బిడ్డల భవిష్యత్తుకు రాచబాట వేసి , వారిని కీర్తి శిఖరాలను అధిరోహింప చేసి... తాను మాత్రం ఒక అనామకుడిలా మిగిలిపోయే త్యాగనిరతి '' నాన్న ''. నాన్న త్యాగం గురించి కవితా రూపంలో '' పగిలిన కాళ్ళు ప్రశ్నిస్తున్నాయి... అదేమంటే శీతాకాలం కదా అందుకే పగిలాయని నాన్న జవాబు! చీలిన పెదాలు హెచ్చరి స్తున్నాయి ... ఎండన తిరిగి వేడిచేసి చీలాయి లేరా అని నాన్న జవాబు! చిరిగిన చొక్కా పేదరికాన్ని చూపెడుతున్నది... ఈ వయస్సులో నన్నెవరు మెచ్చుకోవాలి లేరా అని నాన్న జవాబు! అలసిన మొహం కష్టాన్ని గుర్తిస్తున్నది... ఎండతాకిడికి మొఖం వాడిందిరా ఎక్కువ పనేమి చేయలేదులేనని నాన్న జవాబు! స్వేదం బొట్లు బొట్లుగా కరుణగా జాలువారుతున్నది... ఉక్కపోతకు అలా వస్తుంది లేరా అని నాన్న జవాబు! తెగిన చెప్పులు ఆర్థిక ఇబ్బందిని చూపెడుతున్నది... వేసుకోవటానికి ఇవే మెత్తగా ఉంటాయని నాన్న జవాబు! కూడులేక దేహం బక్కచిక్కి శల్యమై పోయింది... లావుగా ఉంటే పనిపాటా చేయలేమని ఇలా వున్నానని నాన్న జవాబు! ప్రశ్నలన్నీ నేను సంధించినవే తెలిసీ తెలియని అమాయక సందిగ్ధ వయసులో జవాబులన్నీ నాన్ననుండి వచ్చినవే జీవితాన్ని కాచి వడబోసిన వయసులో! వయసు పెరిగాక మనసు పరిణితి చెందాక నాన్న చెప్పే జవాబులన్నీ అబద్ధాలని గ్రహించాను తాను ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా మోముపై కనపడనీయకుండా నన్ను సంతోష తీరాలకు చేర్చిన నాన్న! తల్లి నవ మాసాలు మోసి కంటే.. మనల్ని నడిపించే దైవం నాన్న. నాన్నంటే ధైర్యం.. నాన్నంటే బాధ్యత.. నాన్నంటే భద్రత, భరోసా.. అంతకుమించిన త్యాగం అతడు. చేయి పట్టి నడిపిస్తూ.. ఆడిస్తూ.. అల్లారుముద్దుగా పెంచుతాడు. ఆటలతో పాటు ఆత్మస్థైర్యమూ నేర్పిస్తాడు. జీవితాంతం పిల్లలను తన గుండెలపై మోస్తాడు. కన్నబిడ్డలే జీవితంగా బతుకుతాడు. వాళ్ల సుఖం కోసం చెమట.. కాదు, కాదు.. రక్తం చిందిస్తాడు. ఈ క్రమంలో తానేమైపోయినా పర్వాలేదు అనుకుంటాడు. పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేస్తాడు నాన్న. తను తిన్నా, తినకపోయినా.. తన దుస్తులు బాలేకపోయినా.. పిల్లలకు మాత్రం ఏ లోటూ రాకుండా ఉండాలని పరితపించే వ్యక్తి నాన్న. పిల్లలు ఒక్కో మెట్టు ఎదుగుతుంటే ఎంతో సంతోషపడతాడు. వాళ్లు ఏదైనా సాధిస్తే చిన్న పిల్లాడిలా సంబరపడిపోతాడు. మనల్ని కంటికి రెప్పలా కాపాడే నాన్నకు ఏమిచ్చినా తక్కువే !!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి