26, ఆగస్టు 2019, సోమవారం
సినీ వాలి- కుహూ రాత్రి. ఆధునిక సాహిత్యంతో పరిచయం ఉన్న మిత్రులందరికీ సినీవాలి అనగానే సినీ కవి ఆరుద్ర గారి ఆధునిక కావ్యం గుర్తుకొస్తుంది. ఈ కావ్యానికా పేరు పెట్టడం కూడా తమాషాగా జరిగిందట. మన కేంద్ర సాహిత్య అకాడెమీ తరఫున ఒక కావ్యమాల తయారు చేస్తూ దానిలో మన తెలుగు కవి ఆరుద్ర గారి పద్యాలు కూడా చేర్చిన శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు గారు ఆ గ్రంథాంతంలో కవుల వివరాలు ఇస్తూ పొరపాటున శ్రీ ఆరుద్ర గారు అంతకు ముందే సినీవాలి అనే కావ్యాన్ని వ్రాసినట్లుగా పేర్కొన్నారట. అప్పటికి శ్రీ ఆరుద్ర గారు అటు వంటి కావ్యాన్ని దేన్నీ వ్రాసి ఉండలేదు. అందు చేత తర్వాతి కాలంలో శ్రీ ఆరుద్ర వ్రాసిన తన ఆధునిక కావ్యా నికి సినీ వాలి అని పేరు పెట్టారు. నేడమావాస్య.. అంటూ ప్రారంభమయ్యే ఈ కావ్యానికి ఈ పేరు చక్కగా సరిపోతుంది. ఇంతకీ సినీవాలి అంటే అర్థం – చంద్ర కళ కనిపించే అమావాస్య అని.( సాహితీ పరిచయం ఉన్న నా మిత్రులకీ విషయం తెలిసే ఉంటుంది. తెలియని వారి కోసమే ఈ వివరణ). ఎంత నిరాశా నిస్పృహల్లోనూ ఆశా లేశం ఉంటుందనే విషయాన్ని సూచిస్తుందీ సినీవాలి అన్న పదం. ఇంగ్లీషులో చెప్పాలంటే there is light at the end of the tunnel అంటాము. ఇది సరే .మరి అసలు ఏ చంద్ర కళా కనిపించని అమావాస్యనేమంటారు? కాళ రాత్రి అనేనా? ఏ చీకటి రాత్రినైనా కాళ రాత్రి అనేయవచ్చును కాని చంద్ర కళ కనిపించని అమావాస్య రాత్రికి ప్రత్యేకంగా ఒక పేరుంది. అది కుహూరాత్రి. కుహూ రాత్రి అంటే ఏ చంద్ర కళా కనిపించని కటిక అమావాస్య అన్నమాట. మరి ఇటు వంటి మాటలు ఏ కవుల ప్రయోగాలలోనైనా కనిపిస్తాయా అంటే అరుదుగా అని చెప్పవచ్చు. జాను తెనుగు కు పెద్ద పీట వేసే శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు 1947 లో విడుదలైన పల్నాటి యుధ్దం సినిమాకు వ్రాసిన ఒక పాటలో ఈ పదం వాడేరు. మాంచాల తన ప్రియుని రాక కోసం ఎదురు చూస్తూ నిస్పృహతో ఈ కుహూ రాత్రి నా రాజు వేం చేయునా, నా జీవితమ్ము రసీభూతమ్ము చేయునా అని పాడుకుంటుంది. ( అయితే ఈ పాట సినిమాలో అప్పటి వారి ఒప్పందం ప్రకారం శ్రీ సముద్రాల రాఘవాచారి గారి పేరుతో ఉంటుంది.) సినిమా పాటలలోనూ తన కథల్లోనూ కూడా కుహూ రాత్రి వెలది వెన్నెల వంటి పదాలను ప్రయోగించిన శ్రీ శాస్త్రిగారిని కొనియాడకుండా ఉండగలమా? (నిరుడు ఇదే రోజు ఈ గోడ మీదే ప్రచురించిన ఈ ముచ్చట అప్పుడు చూడని వారి కోసం మరోసారి)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి