24, మే 2015, ఆదివారం

శాతవాహనుల వంశాన పుట్టినవాడు
కాకతీయుల పోతుగడ్డ మెట్టినవాడు
పల్లెలోనె కాదు ఢిల్లీలో సైతమ్ము 
పెద్ద గద్దెల నేలి పేరుకెక్కినవాడు
ఎవడయ్య ఎవడువాడు ఇం
కెవడయ్య తెలుగువాడు!
పంచెకట్టుటలో ప్రపంచాన మొనగాడు
కండువా లేనిదే గడప దాటనివాడు
పంచభక్ష్యాలు ఆన కంచాన వడ్డించ
గోంగూర కోసమై గుటక లేసేవాడు || ఎవడయ్య ||
తెలుగు బాషను జుంటితేనెయని తెగపొగడి
పొరిగింటి పులుపుకై మరులు పెంచినవాడు
దేశ భాషలలోన తెలుగు లెస్సని చాటి
మల్లెలకు బదులు లిల్లీలు వలచినవాడు || ఎవడయ్య ||
ఒక చేతి మజ్జిగని బరసి పట్టినవాడు
ఒక చేతి మధుపాత్ర వొదిలి పెట్టనివాడు
ఒక ముహుర్తాన ఇంచుక బుర్రగోకుకొని
చల్ల వంచిన చేత కల్లు పంచినవాడు || ఎవడయ్య ||
నేల నల్దెసల డేరాలు నాటినవాడు
అన్ని మూసలలోన అట్టె బదిగినవాడు
ఏ దేశమేగినా ఎందు కాలిడినా
ఆవకాయ వియోగ మసలే సైపనివాడు....
(సి నారాయణ రెడ్డి)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి