7, మే 2015, గురువారం

రవీoద్రుని గీతాంజలికి ఈ అనువాదం చలంగారిది
---------------------------------------------------
ఎక్కడ మనసు నిర్భయంగా వుంటుందో
ఎక్కడ మనుషులు తలలెత్తి తిరుగుతారో
ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో
సంసారపు గోడలమధ్య ఎక్కడ భాగాలకింద
ప్రపంచం విడిపోలేదో
ఎక్కడ సత్యాంతరాళంలోంచి
పలుకులు బైలు వెడలతాయో
ఎక్కడ అలసట నెరగనిశ్రమ తనబాహువుల్ని
పరిపూర్ణతవైపు జాస్తుందో
ఎక్కడ నిర్జీవమైన ఆచారపు టెడారిలో స్వచ్ఛమైన
బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా వుంటుందో
ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకీ
కార్యాలలోకీ నీచే నడపబడుతుందో
ఆ స్వేచ్ఛా స్వర్గానికి తండ్రీ నాదేశాన్ని మేల్కొలుపు............
రజనీకాంతరావు గారి అనువాదం
_____________________
చిత్తమెచట భయ శూన్యమో
శీర్షమెచట ఉత్తుంగమో
జ్ఞానమెచట ఉన్ముక్తమొ
భవప్రాచీగృహప్రాంగణ తలమున
దివారాత్ర మృత్తికారేణువుల
క్షుద్ర ఖండములుకావో
వాక్కులెచట హృదయోద్గతోచ్ఛ్వసన
మొరసి వెలువడునొ
కర్మధార యెట అజస్ర సహస్ర విధాల
చరితార్థంబై అనివారితస్రోతంబై
దేశ దేశముల దెసదెస పరచునొ
తుచ్ఛాచారపు మరుప్రాంతమున
విచార స్రోతస్విని ఎట నింకునొ
శతవిధాల పురుషయత్న మెచ్చట
నిత్యము నీయిచ్ఛావిధి నెగడునొ
అట్టి స్వర్గతలి భారత భూస్థలి
నిజ హస్తమ్మున నిర్భయాహతిని
జాగరితను గావింపవో పితా
సర్వకర్మ సుఖ దుఃఖ విధాతా.

ఎచటనైతేభయము చెందని 
మనముతో తల ఎత్తవచ్చునొ 
ఎచటనైతే జ్ఞానకాంతులు 

స్వేచ్ఛగా ప్రసరించవచ్చునొ 
ఎచటనైతే ఇరుకు భావపు 
గోడలతొ భువి వేరువడదొ 
ఎచటనైతేసత్య గర్భమునుండి 
పలుకులు వెలికి వచ్చునొ 
ఎచట పరిపూర్ణతకు నిరతము 
యత్నములు కొనసాగుచుండునొ 
ఎచట నిర్మల హేతువాహిని 
భయదమౌ నిర్జీవ సంస్కృతి
ఇసుక భూముల దారి తప్పదొ 
నిత్య విస్తర విశాలమ్మగు 
భావ కృత్యములందు మా మది 
ఎచట నీచే నడపబడునో 
అచటనే ఆ స్వేచ్ఛామయ స్వర్గమందున 
జనకుడా! నా దేశమచ్చట మేలుకోనీ 
ఇది నా అనువాదం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి