22, అక్టోబర్ 2020, గురువారం

॥తెలుగు గజల్ ॥ పిడకెడంత గుండెకదా భావాలకు ఆవాసం! చేరెడంత కళ్ళు కదా కన్నీళ్ళకు ఆవాసం ! గుప్పెడంత బువ్వలేక గిలగిలమను కడుపులెన్ని విసిరేసే నాణాలే ప్రాణాలకు ఆవాసం! జానెడంత పొట్టనిండ జారిణిగా మారెనేమొ అనామికలు ఉన్నవాడి కోరికలకు ఆవాసం ! ముత్యమంత నవ్వులేక ముక్కిపోవు మనసులెన్ని ? ఓర్వలేని బుద్ధికదా ద్వేషాలకు ఆవాసం ! బోలెడంత ధనమున్నా సుఖంలేదు మిత్రమా భోగాలే అంతులేని రోగాలకు ఆవాసం ! పుట్టెడంత దుఃఖానికి పుట్టనేల గిట్టనేల ఉదయించిన జ్ఞానంకద త్యాగాలకు ఆవాసం! పట్టెడంత పెట్టిచూడు జంధ్యాలా ఎంతతృప్తి విచ్చుకున్న హృదయాలే మానవతకు ఆవాసం ! డా. ఉమాదేవి జంధ్యాల 2019 జూన్ 3

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి