8, డిసెంబర్ 2014, సోమవారం

నీళ్ళు మాట్లాడతాయి !! గమనించి చూడండి.. నీళ్ళు తాము మాట్లాడాల్సింది మాట్లాడి తీరుతాయి. వినగలిగే శక్తి, గమనించగలిగే దృష్టీ ఉండాలిగానీ నీటిమాటలు మనకు వినబడతాయి.
ముద్రంలో ఉన్న నీటిని చూడండి, అవి విశాలంగా ఉండే భాషను మాట్లాడతాయి. లోపల సుడిగుండాలు ఉన్నా రగిలే అగ్నిపర్వతాలు ఉన్నా పైకి ప్రశాంతంగా ఉండమని చెబుతాయి. పడినా పైకి లేవమని కెరటంతో కబురు పంపుతాయి.
మంచు ప్రాంతాలలొ ఉండే నీటిని చూడండి. గడ్డకట్టి ఉంటాయి, ఘనీభవించి ఉంటాయి. వేసవి వచ్చేవరకూ ఉష్ణం తగిలే వరకూ ఓపిక పట్టి ఉంటాయి. కానీ వేడి తగిలాక అవి కరిగి.. కదిలి.. గల గల మని.. జల జల మని.. ప్రవహించి మనకి ఏమి చెబుతాయి? ఓర్పుతో మంచిరోజులు వచ్చేవరకూ ఆగమంటాయి.. చిన్నా పెద్దా కష్టాలకు కలవరపడవద్దని చెబుతాయి.
నదిలో ప్రవహించే నీటిని చూడండి. జీవితాన్ని తమలో చూసుకోమని చెప్పవూ ?? సాఫీగా ఉంటుందా ఆ నీటి ప్రయాణం !! ఎదుట కాసింత ఇరుకు... అంతలోనే ఒక మలుపు.. ఆ పైన ఒక బండరాయి.. మరికాసేపటికి అడవి.. అది దాటితే లోయ.. అన్నీ దాటుకుని గమ్యాన్ని చేరవూ ? జీవితంలో ఎన్ని మలుపులు వచ్చినా సఫలత్వం అనే గమ్యం వైపు చేరమని చెప్పవూ ?
చెరువులో నీళ్ళు ఉన్నంతలో సంతృప్తి పడమని చెబుతాయి.
బావిలో నీళ్ళు నీ దగ్గర కొంచెమే ఉన్నా అందరికీ పంచమని చెబుతాయి.
కళ్ళలో ఉండే నీళ్ళు నీ దుఃఖాన్ని దాచుకోవద్దని చెబుతాయి. నీ సంతోషాన్ని నలుగురితో పంచుకొమ్మని చెబుతాయి.
తరచూ మీ కుటుంబ సభ్యుల కళ్ళను గమనించండి. వాటిలో చెమ్మ దేనికి సంకేతమో అర్ధం చేసుకోండి. వాళ్ళ దుఃఖం మీ దుఃఖం. వాళ్ళ సంతోషం మీ సంతోషమే కదా !!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి