30, అక్టోబర్ 2016, ఆదివారం

వంశీ పద విన్యాసం:
జీవనయానం
------------------
నోట చిలుక పలుకులు
చేత పలకా బలపాలు
కలగలసినదే...................బాల్యం

ఇంట అలకల ఆటలు
బయట చిలకల వేటలు
కులుకులు చిలికేదే........ యవ్వనం

వులుకూ పలుకూ లేక
నులక మంచం మీద
పలకరింపు నోచనిదే....వృద్ధాప్యం

29, అక్టోబర్ 2016, శనివారం

మనం
--------
సైలెంట్ గుండేది మనం
వైలెంట్ చేసేది మనం
నీతులు చెప్పేది మనం
గోతులు తవ్వేది మనం
మంచి చేసేది మనం
ముంచి వేసేది మనం
కోటలు  కట్టేది మనం
కొంపలు కూల్చేది మనం
'''''''''''''''''''''''''''''''''''''''''''''''' వంశీ
సారా వ్యతిరేకోద్యమం కాలంలో వచ్చిన దీపావళి రోజున సత్యభామను తెలుగుభామను పోల్చి నేను వ్రాసిన కవిత 1992 అక్టోబర్ 8 న ఆంధ్రప్రభ లో ప్రచురితమైనది ... 23 సంవత్సరాల తర్వాత ఆ కవిత ఈ దీపావళి వేళ  మీ కోసం ...
సారాసురసంహారం
----------------------
అందరికి వందనాలు
అభినందన చందనాలు
అందుకోండి దీపావళి
శుభోదయపు వందనాలు
ద్వాపరయుగంలో ...
నరకాసురుని చెడు ఆగడాలు
అధికం కాగా ...
నాడు సత్యభామ
చెడుపై సమర శంఖం పూరించింది
నరకాసుర సంహారం చేసి
భూభారం తగ్గించింది
కలియుగంలో ...
సారాసురుడు సంసారాలు
కబళిస్తుంటే ...
నేడు తెలుగుభామ
మద్యనిషేద మహోద్యమం లేపింది
సారాసుర సంహారానికి
సమధికోత్సాహం తో కదిలింది
సారాసుర సంహారం
సత్వరమేఅవసరం
మహిళా ఉద్యమం
మతాబులా జ్వలిస్తుంది
తారాజువ్వల స్థానంలో
సారాజువ్వలెగురుతున్నాయ్
నినాదాల ధ్వని ముందు
టపాసులు వెలవెల బోతున్నాయ్
ఓ ప్రభుత్వాధి నేతలారా
మహిళల కోరిక మన్నించండి
మద్య పానాన్ని నిషేధించండి
గుడివాడ భారతీ సమితి సప్తతి మహోత్సవం సందర్భంలో నేను వ్రాసి ఆలపించిన గీతం ... చిత్తగించండి

ఎద నిండా ఆనందం నిండగా
ఏడు పదుల వత్సరాల పండుగ
జరుపుకుంటున్నది భారతీ సమితి
జయప్రదం చెయ్యమని చేస్తున్నది వినతి  ॥ ఎద ॥

సాహితీ సరస్వతికి నిత్యహారతి
పట్టుచున్నది ... భారతీ సమితి
సాహితీ వేత్తలకు స్వాగత గీతి
పాడుచున్నది ... భారతీ సమితి
సాహితీ పోషకులకు ... సౌజన్య మూర్తులకు
సాహిత్యాభిమానులకు ... సౌహార్ద్ర హ్రుదయులకు
అభిమాన పాత్రులకు ... పాత్రికేయ మిత్రులకు
అతిధి దేవుళ్ళకు ... ఆహ్వానితులందరికి
వందనాలు అందిస్తుంది భారతీ సమితి
జరగనుంది సప్తతి ఘనమైన రీతి           ॥ ఎద ॥

స్వాతంత్ర్యం రాకముందు పుట్టిన సమితి
గుడివాడలో గుబాళించే తెలుగు సాహితీ
కోగంటి దుర్గా మల్లికార్జున రావు
కోటి కలలతో నీవు స్తాపించినావు
మల్లంపల్లి .. కోడూరి .. బూసా చినవీరయ్య
మక్కువతో చక్కగా నడిపించినారయ్య
దశరధ రామి రెడ్డి కొండపల్లి
నడిపించే సాహితీ పరిమళాలు జల్లి
సాహితీ ఘనాపాటి నూతుల పాటి
దొండపాటి దేవదాసు నడిపిరి మేటి
దుగ్గిరాల ఆనంద బోసు .. బాలకవి సిఆర్ దాసు
నవ్యభవ్యసవ్య రీతి చూపించిరి సొగసు  
కోగంటి వారి నుండి కొడాలి వారి వరకు
ఉద్దండుల చేతులలో సాధించెను వున్నతి  ॥ ఎద ॥

సాహితీ సేవలోన సుస్థిర ప్రగతి
అడుగడుగున సాధించెను అభ్యున్నతి
యువకవులకు ఎందరికో ఆశాజ్యోతి
గుడివాడ ఖ్యాతి పెంచు అఖండ జ్యోతి
అంగ రంగ వైభవంగా సంబరాల సప్తతి
భాగస్వాము లందరికి మధురానుభూతి  ॥ ఎద ॥
                                           వంశీ 20-12-2015
ఆడది
--------
ప్రేమిస్తే
పక్కలో బాబు
ద్వేసిస్తే
పక్కలో బాంబు
'''''''''''''''''''''వంశీ
పైత్యం
--------
అసలావిడ
ముసలావిడ లా
కనిపిస్తుంది ...
కొసరావిడ కోసం
మనసారడి
చేస్తుంటుంది .
శ్రీ కరాకారుండ ... భీకరాకారుండ
నరకాధినాధుండ ... సురవరుండ
భూనభోంతమ్ముల.. దోర్దండసూరుండ
మార్తాండ తనూజుండ ... మారకుండ
చండప్రచండ పాషండ ప్రకారుండ
కాలపాశధరుండ ...కర్కసుండ
గత స్మృతులు ...
గతం నాస్తి కాదు నేస్తం ... అనుభవాల ఆస్తి

27, అక్టోబర్ 2016, గురువారం

ఈ దుర్యోధన దుశ్శాసన
దుర్వినీతలోకంలో
రక్తాశ్రులు చిందిస్తూ
రాస్తున్నా శోకంతో
మరో మహాభారతం ఆరవవేదం
మానభంగపర్వంలో
మాతృహృదయ నిర్వేదం నిర్వేదం

పుడుతూనే పాలకేడ్చి
పుట్టి జంపాలకేడ్చి
పెరిగి పెద్దకాగానే
ముద్దుమురిపాలకేడ్చి
తనువంతా దోచుకున్న
తనయులు మీరు
మగసిరితో బ్రతకలేక కీచకులై
కుటిలకామ నీచకులై
స్త్రీ జాతిని అవమానిస్తే
మీ అమ్మల స్తన్యంతో
మీ అక్కల రక్తంతో
రంగరించి రాస్తున్నా
ఈనాడే మీకోసం ॥మరో॥

కన్న మహాపాపానికి
ఆడది తల్లిగ మారి
మీ కండలు పెంచినది
ఈ గుండెలతో కాదా
ఎర్రని తన రక్తాన్నే తెల్లని నెత్తురుజేసి
పెంచుకున్న తల్లి
ఒక ఆడదని మరిచారా
కనబడలేదా అక్కడ
పాపలుగా మీ చరిత్ర
ఏనాడో మీరుంచిన లేతపెదవి ముద్ర
ప్రతిభారత సతిమానం
చంద్రమతి మాంగల్యం
మర్మస్థానం కాదది మీ జన్మస్థానం
మానవతకి మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం
శిశువులుగా మీరు పుట్టి
పశువులుగా మారితే
మానవరూపంలోనే దానవులై పెరిగితే
సభ్యతకి సంస్కృతికి సమాధులే కడితే
కన్నులుండి చూడలేని
ధృతరాష్ట్రుల పాలనలో
భర్తలుండి విధవ అయిన
ద్రౌపది ఆక్రందనలో
నవశక్తులు యువశక్తులు
నిర్వీర్వం అవుతుంటే
ఏమైపోతుంది సభ్యసమాజం
ఏమైపోతుంది మానవధర్మం
ఏమైపోతుంది ఈ భారతదేశం
మన భారతదేశం మన భారతదేశం

15, అక్టోబర్ 2016, శనివారం