24, ఏప్రిల్ 2019, బుధవారం

కలిమి కలిగినట్టి కడు లోభి యాతండు తేనెటీగవోలె తెచ్చి జేర్చు అనుభవించలేని యా సంపదేలరా? నారసింహ తనయ! సార హృదయ! కష్టములకు నోర్చి కార్యశీలివి గమ్ము ఫలము గోరకుండ పదము కదుపు కాలగతియె యిచ్చు మేలగు గుర్తింపు నారసింహ తనయ! సార హృదయ! స్థిరత కలిగియుండు సరళరేఖ యెపుడు వేల మీర దెపుడు వృత్తరేఖ పగిదిలేని దెపుడు వక్రంపురేఖయే నారసింహ తనయ! సార హృదయ! చెవుల పొందు జేరి చెలగు వాక్కును బట్టి పరిహరింత్రు కంటపడ్డ యదియు చూపు కంటె మాట చుట్టమాయెను గదా! నారసింహ తనయ! సార హృదయ! సహనవంతుడెపుడు సాధించు సర్వమ్ము యోర్మి లేని వాడు యోడి పోవు సహన మొకటె కూర్చు సర్వార్థ సిద్థిని నారసింహ తనయ! సార హృదయ!

9, ఏప్రిల్ 2019, మంగళవారం

ఎవరో ఒకరు...ఎపుడో అప్పుడూ


ఎవరో ఒకరు ఎపుడో అపుడు

నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు

అటో ఇటో ఎటో వైపు

మొదటి వాడు ఎప్పుడూ ఒక్కడే మరీ

మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరీ

వెనుకవచ్చు వాళ్ళాకు బాట అయినది

ఎవరో ఒకరు ఎపుడో అపుడు

నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు

అటో ఇటో ఎటో వైపు

కదలరు ఎవ్వరూ వేకువ వచ్చినా

అనుకుని కోడి కూత నిదరపోదుగా

జగతికి మేలుకొల్పు మానుకోదుగా 

మొదటి చినుకు సూటిగా దూకిరానిదే

మబ్బుకొంగు చాటుగా ఒదిగి దాగితే

వానధార రాదుగా నేలదారికీ

ప్రాణమంటు లేదుగా బ్రతకడానికీ

ఎవరో ఒకరు ఎపుడో అపుడు

నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు

అటో ఇటో ఎటో వైపు

చెదరకపోదుగా చిక్కని చీకటి

మిణుగురు రెక్కచాటు చిన్ని కాంతికి

దానికి లెక్కలేదు కాళరాతిరీ

పెదవి ప్రమిద నిలపనీ నవ్వు జ్యోతినీ

రెప్పవెనుక ఆపనీ కంటినీటినీ

సాగలేక ఆగితే దారి తరుగునా?

జాలిచూపి తీరమే దరికి చేరునా 

ఎవరో ఒకరు ఎపుడో అపుడు

నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు

అటో ఇటో ఎటో వైపు

యుగములు సాగినా నింగిని తాకక

ఎగసిన అలల ఆశ అలిసిపోదుగా

ఓటమి ఒప్పుకుంటు ఆగిపోదుగా

ఎంత వేడి ఎండతో ఒళ్ళు మండితే

అంత వాడి ఆవిరై వెళ్ళి చేరదా

అంత గొప్ప సూర్యుడు కళ్ళు మూయడా

నల్ల మబ్బు కమ్మితే చల్లబారడా

ఎవరో ఒకరు ఎపుడో అపుడు

నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు

అటో ఇటో ఎటో వైపు

1, ఏప్రిల్ 2019, సోమవారం

కుర్చీల మహిమలు ఆ కుర్చీ లంటే అంత మోజు అందుకే మరి! ఆ కుర్చీ లెక్కగానే ఎన్ని మహిమ లొస్తాయో! ఉత్త ఇసుకనుండి ఎంత తైల మొస్తుందో, గాలిలో మేడలు కడితే ఎంత డబ్బు ఒళ్లో వాలిపడుతుందో... ఎవడు రోడ్లు వేసినా అందులోంచి నాలుగు రాళ్లు వాళ్ళవే, ఎవడు ఇల్లు కట్టుకున్నా అందులోంచి నాలుగు ఇటుకలు వాళ్ళవే, ఎవడు ఏ పని చేసినా, ఏమని ఏ "మనీ" తీసుకున్నా అందులోంచి కొంత అదృశ్యంగా వాళ్లనే వరిస్తుంది... నదులు వాడి పెంపుడు కుక్కలవుతాయి, కొండలు వాడు కాళ్ళు తుడుచుకొనే పట్ట లవుతాయి, గాలి వాడి చుట్ట మవుతుంది, నిప్పు వాడి నేస్త మవుతుంది... ఆ కుర్చీ లంటే అంత మోజు అందుకే మరి! ఆ కుర్చీ లెక్కగానే అన్నీ వాడి సొంత మవుతాయి... నీ వోటును వాడు నోటుగా మార్చేసాడు, పైగా వా డంటాడు నీ ఓటు రేటు పెంచటానికే పంచభూతాల్ని నోట్లుగా మార్చుకుంటున్నా డట! ఒరే నాయనా, అది నోటు కాదు- నీ నోట్లో కుక్కుతున్న మత్తు బిస్కెట్టు, నీ బుర్రను చెడగొట్టే ఒక తియ్యని విషం బొట్టు... నాలుగు రోజులు పొతే చాలు నీవు నిలబడటానికి నేల కనబడదు, తాగటానికి నీరు దొరకదు, పీల్చటానికి గాలిలో ఆక్సిజన్ ఉండదు, తినబోతే పరమాన్నంలా కనిపించే గరళం, చావబోతే చంపకుండా నరకం చూపించే కల్తీ ఔషధం... మన కళ్ళ ముందే వెధవలు ఎలా కొట్టుకుంటున్నారో చూడు, ఆ కుర్చీల కోసం ఆ మహిమల కోసం మనల్ని నోటులా మడత పెట్టి ఎలా పర్సులో పెట్టుకుంటున్నారో చూడు... ఒక్కసారి కళ్ళను పీకి సరిగ్గా నాటుకోవడం నేర్చుకో నీకు, నీ ముందు తరాలకు చూపు జాగ్రత్తగా పెంచుకో ఓటును మాంఛి పదునైన కత్తిలా మార్చు, వాడిని వాడి గణాల్ని వాడి భవిష్యత్తును నిర్దాక్షిణ్యంగా తెగటార్చు!