27, నవంబర్ 2016, ఆదివారం


.....
చరణకింకిణులు ఘల్లు ఘల్లుమన..
కరకంకణములు గల గలలాడగ..
వినీల కచభర..విలాస బంధుర..
తనూలతిక చంచలించిపోగా..
ఆడవే మయూరీ.. నటనమాడవే మయూరీ..!!
నీ కులుకును గని నా పలుకు విరియ..
నీ నటనను గని నవకవిత వెలయగా.. ||ఆడవే మయూరీ..||
అది యమునా సుందర తీరమూ..
అది రమణీయ బృందావనమూ..
అది విరిసిన పున్నమి వెన్నెలా..
అది వీచిన తెమ్మెర ఊయలా..
అది చల్లని సైకత వేదికా.. అట సాగెను విరహిణీ రాధికా..
అది రాధ మనసులో మాధవుడూదిన రసమయ మురళీ గీతికా.. ||ఆడవే మయూరీ.. ||
నా పలుకులకెనయగు కులుకు చూపి..
నా కవితకు సరి యగు నటన చూపి..
ఇక ఆడవే మయూరీ..నటనమాడవే మయూరీ..
ఫాలనేత్ర సుంప్రధమజ్వాలలు ప్రసవశరుని దహియించగా..
పతిని కోలుపడి రతీదేవి దుఃఖిత మతియై రోదించగా..
హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవత్ ప్రమధ గణము కనిపించగా..
ప్రమధనాధ కర పంకజ భాంకృత ఢమరుధ్వని వినిపించగా..
ప్రళయకాల సంకలిత భయంకర జలధరార్భటుల చలిత
దిక్కటుల వికృత కీంకరుల సహస్ర ఫణ సంచలిత భూకృతుల
కనులలోన.. కనుబొమల లోన..
అధరమ్ములోన.. వదనమ్ములోన..
గళసీమలోన.. కటిసీమలోనా..
కరయుగములోన.. పదయుగములోన..
నీ తనువులోని అణువణువులోన..
అనంత విధముల అభినయించి ఇక ఆడవే..ఆడవే..ఆడవే !

25, నవంబర్ 2016, శుక్రవారం

అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా! ఆవేదన తీరురోజు ఈజన్మకు లేదా!
అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా! ఆవేదన తీరురోజు ఈజన్మకు లేదా!
పదినెలలు నను మోసి పాలిచ్చి పెంచి, మదిరోయగ నాకెన్నో ఊడిగాలు చేసినా

ఓ తల్లి నిను నలుగురిలో నగుబాటు చేసితి! తలచకమ్మ తనయుని తప్పులు క్షమియించవమ్మ
దేహము విజ్ఞానము బ్రహ్మోప దేశామిచ్చి! ఇహపరాలు సాధించే హితమిచ్చిన తండ్రిని
కనుగానని కామమున ఇలు వెడలా నడిపితి! కనిపిస్తే కన్నీళ్ళతో కాళ్ళు కడుగుతా నాన్న! నాన్నా!

మారిపోతినమ్మా! నాగతి ఎరిగితినమ్మా! నీమాట దాటనమ్మ! ఒకమారు కనరమ్మా!
మాతాపిత పాదసేవే! మాదవసేవే యని మరువనమ్మా! మాతాపిత పాదసేవే!
మాదవసేవే యని మరువనమ్మా! నన్ను మన్నించగ రారమ్మా! అమ్మా!

అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా! ఆవేదన తీరురోజు ఈజన్మకు లేదా!
అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా! అమ్మా! అమ్మా! అమ్మా!

ఏ పాద సీమ కాశి ప్రయాగాది పవిత్ర భూములకన్న విమల తరము.
ఏ పాదపూజ రమాపతి చరణాబ్జ పూజల కన్నను పుణ్య తమము
ఏ పాదతీర్థము పాప సంతాపాగ్ని ఆర్పగా జాలిన అమృతదరమూ
ఏ పాదస్మరణ నాగేంద్రశయను ధ్యానమ్ము కన్నను మహానందకరము.

అట్టి పితరుల పదసేవ ఆత్మమరచి ఇహపరమ్మునకెడమై తపించువారి కావగలవారు లేరు
లేరు ఈజగాన లేరు. నన్ను మన్నించి బ్రోవుమో అమ్మా నాన్నా!

20, నవంబర్ 2016, ఆదివారం



కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిం బొందరే
వారేరీ సిరి మూటగట్టుకుని పోవంజాలిరే భూమిపై(
బేరైనంగలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశః కాములై
యీరే కోర్కులు వారలన్ మఱచిరే యిక్కాలమున్ భార్గవా!
ఈ కాలంలో అంటూ ఆ కాలంలోనే ఈ కాలం గురించి పోతనగారు చెప్పిన గొప్ప పద్యాలలో ఇదొకటి. అన్నీ ప్రశ్నలే! సమాధానాలను మనం కాలం లోంచి వెదుక్కోవాలి. ఈ కాలంలో రాజులెక్కడున్నారయ్యా అనుకోనవసరం లేదు, ఈ కాలం పాలకుల్లో తామే రాజులం అనీ, తమదే ఈ రాజ్యం అనే భావన గూడు కట్టుకుని ఉంది కాబట్టి! రాచరికం పోయిందిగానీ రాజాధిరాజ భావన పోలేదు రాజ్యం చేస్తున్న వారిలో! అన్ని పార్టీల వాళ్ళలోనూ ఇదే ధోరణి నేటి ప్రజాస్వ్యామ్యంలో ప్రముఖం అయ్యింది,
దుర్యోధనుడికి తట్టలేదు గానీ ప్రజాస్వామ్యంలో పాలిస్తానని ఒక్క మాట అని ఉంటే, ఖచ్చితంగా గెలిచి ఉండేవాడు. తనూ, తన సోదరులు కలిసి దుర్యోధనుడికి వంద వోట్లు పడతాయి. పాండవులకు ఐదు వోట్లతో డిపాజిట్ గల్లంతై ఉండేది. ఇలాంటి ప్రజాస్వామ్య ప్రమాదాన్ని శంకించే కాబోలు, ధర్మరాజు ముందు జాగ్రత్తగా `మేం నూటైదుగురం’ అంటూ ఉండేవాడు…
దుర్యోధనుడు కూడా పాండవులు అఙ్ఞాతవాసం నుండి తిరిగొచ్చే సమయానికి విపరీతంగా దాన ధర్మాలు చేసి, ప్రజాభిమానం పెంచుకొనేందుకు సిద్ధంగా ఉన్నాడట! కానీ ఒక ప్రపంచ యుద్ధాన్ని తలపించే యుద్ధం జరగటాన, ఎన్నికలప్రహసనం జరిగే అవకాశం లేకుండా పోయింది. ఇదంతా విషయాంతరం.
“దానం అడగటానికి వచ్చినవాడు మారువేషంలో ఉన్న విష్ణువే! జాగ్రత్తగా ఉండకపోతే ఓడతావు” అని గురువైన శుక్రాచార్యుడు బలి చక్రవర్తిని హెచ్చరించినప్పుడు బలి చెప్పిన సమాధానం ఈ పద్యం! ఇది నాటి రాచరికానికీ, నేటి దొంగ ప్రజాస్వామానిక్కూడా వర్తించే సమాధానం.
కారే రాజులు?: ఈ కాలంలో ఎవరైనా,ఎలాంటి వాడైనా రాజు కావటం లేదా?
రాజ్యముల్ గలుగవే?: వాళ్ళకి రాజ్యాలు దక్కటం లేదా?
గర్వోన్నతిం బొందరే?: వొళ్ళు పొగరెక్కి వ్యవహరించట్లేదా?
వారేరీ?: అలాంటి రాజకీయ దురంధరులుగా తమని చిత్రించుకున్న వాళ్ళు ఏవయ్యారు? ఈ లోకంలోంచే పోయారు
సిరి మూటగట్టుకుని పోవంజాలిరే?: అధికారంలో ఉన్న కాలంలో మూటగట్టుకున్న సిరినంతా పోయేటప్పుడు పట్టుకు పోగలిగారా?
భూమిపై పేరైనంగలదే?: ఈ నేలపైన వాళ్ళ పేరైనా ఉందా? కనీసం వాళ్లను తలుచుకునే వాడున్నాడా?
శిబిప్రముఖులుం బ్రీతిన్ యశఃకాములై: శిబిచక్రవర్తి లాంటివాళ్ళు ప్రజాదరణ పొంది కీర్తిమంతులై నిలిచారు.
యీరే కోర్కులు: ఎందుకంటే మనఃస్ఫూర్తిగా అడిగింది అడిగినంతగా ఇచ్చారు కాబట్టి! ఈ ప్రజలకోసం ఎంతో కొంత చేశారు కాబట్టి.
వారలన్ మఱచిరే యిక్కాలమున్ భార్గవా?: ఇంత కాలం తరువాత కూడా అలాంటి వాళ్ళని ప్రజలు మరిచారా గురుదేవా?
రాజుమరణిస్తే శిల్పంలో జీవిస్తాడు, సుకవి మరణిస్తే జనం నాలుకలమీద జీవిస్తాడన్న జాషువా మాటలు ఇక్కడ గుర్తుకొస్తాయి. రోడ్లను ఆక్రమించి శిల్పాలు నిలబెట్టేవాళ్ళకిది చురక! లోకోపకారి చిరంజీవి అవుతాడనేది దీని సారాంశం.
వామనుడు సత్యలోకం కంటే ఎత్తికు పెరిగి బ్రహ్మాండం అంతా నిండి, ఇదంతా తనకు దానంగా కావాలని అడిగాడంటే అదంతా బలి చక్రవర్తి ఆధీనంలోని రాజ్యం అన్నట్టే కదా! వామనుడు అడిగింది భూమికి పైన ఉన్న రాజ్యాన్నే! ఇంకా అంత రాజ్యం బలి చక్రవర్తికి భూమికి అడుగున పాతాళాది లోకాల్లో ఉంది. తనవి ఇచ్చే చేతులని చాటటమే తనకు నిజమైన ఆస్తి, కీర్తి అని గుర్తించిన రాజు కాబట్టి, తనను తాను బలి చేసుకోవటానికే సిద్ధపడ్డాడు బలి చక్రవర్తి.

మచ్చుకు ఒక్క ప్రధాని, ఒక్క ముఖ్యమంత్రి, ఒక్క మంత్రి అలాంటి వాడు ఉంటాడేమోనని ప్రజలు ఒక్క ఆశతో ప్రతిసారీ తమ ఓటుని బలి ఇచ్చుకుంటూ ఉంటారు... ప్రజా‘బలి’స్వామ్యంలో!